iDreamPost
android-app
ios-app

టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకిన రాహుల్

టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకిన రాహుల్

ఐసీసీ సోమవారం ప్రకటించిన టీ20 బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ 823 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 56 సగటుతో 224 పరుగులు చేసి టాప్ ప్లేస్ లో నిలిచిన రాహుల్ తన ర్యాంకింగ్ మెరుగుపరుచుకున్నాడు.నాలుగు మ్యాచ్‌లలో కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం 105 పరుగులే చేయడంతో 673 రేటింగ్ పాయింట్లతో పదో స్థానానికి పడిపోయాడు.

టీమిండియా బ్యాట్స్ మెన్లలో రాహుల్,కోహ్లీ టాప్-10లో స్థానం సంపాదించగా రోహిత్ శర్మ 662 పాయింట్లతో 11వ స్థానానికి పరిమితమయ్యాడు. ర్యాంకింగ్స్‌ పరంగా పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజామ్ అగ్రస్థానంలో ఉండగా, రాహుల్, ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ వరుసగా రెండు,మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.

టీ20 బౌలింగ్ విభాగంలో టాప్-10లో కనీసం ఒక్క భారత బౌలర్ కూడా చోటు సంపాదించలేదు.ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా 630 పాయింట్లతో 12వ స్థానంలో నిలవగా, స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 567 పాయింట్లతో 20వ ర్యాంక్‌తో తృప్తి పడ్డాడు.బౌలింగ్ విభాగంలో ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 749 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆఫ్ఘనిస్థాన్ కే చెందిన ముజీబ్ ఉర్ రహ్మాన్ 742 పాయింట్లతో రెండో స్థానంలో,న్యూజిలాండ్ బౌలర్ మిచెల్ శాంట్నర్ 677 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు.

ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-20లో కూడా టీమిండియా క్రికెటర్‌కి చోటు లభించలేదు. ఆల్ రౌండర్లలో ఆఫ్ఘాన్ ఆటగాడు మహ్మద్ నబీ 319 పాయింట్లతో అగ్రస్థానం సాధించగా, ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్, సీన్ విలియమ్స్ రెండు మూడు స్థానాలలో నిలిచారు. టీ20 జట్టు ర్యాంకింగ్స్‌లో 270 రేటింగ్‌ పాయింట్లతో పాకిస్థాన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా 269,265 పాయింట్లతో వరసగా ఆస్ట్రేలియా,ఇంగ్లండ్ రెండు,మూడవ స్థానాలలో ఉన్నాయి.264 పాయింట్లతో భారత జట్టు నాలుగో స్థానానికి పరిమితమైంది.