మీరు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేయబోతున్నారా? మీ ఆర్డర్ ఎప్పట్లా అరగంట, ముప్పావు గంటలో కాకుండా గంట దాటినా రాకపోవచ్చు. ఎందుకంటే స్వీగ్గీ డెలివరీ పార్ట్ నర్స్ (Swiggy delivery partners) అన్ని మెట్రోపాలిటన్ సిటీస్ (metropolitan cities)లో స్ట్రైక్ (strike) చేస్తున్నారు. బెంగళూరులో ఐదు రోజుల నుంచి 3 వేల మంది డెలివరీ పార్ట్ నర్స్ స్ట్రైక్ లో ఉన్నారు. ఆ తర్వాతి రోజే ఢిల్లీలోని లజ్ పత్ నగర్ ఏరియా కూడా ఈ లిస్టులో చేరింది. కిందటేడాది ముంబయి, హైదరాబాద్ లోనూ ఈ తరహా నిరసనలు జరిగాయి. మిగతా నగరాలకూ ఈ సెగ తాకొచ్చని తెలుస్తోంది.
అసలెందుకు ఈ నిరసన?
ఈమధ్య కాలంలో స్విగ్గీ డెలివరీ పార్ట్ నర్స్ చెల్లింపులు తగ్గించేసింది. దీంతో పాటు డెలివరీ జోన్స్ పరిధి పెంచింది. దూర ప్రాంతాలకు కూడా అతి తక్కువ చార్జెస్ ఇవ్వడంతో డెలీవరీ బాయ్స్ ఇలా రోడ్డు మీదకొచ్చారు. ఒక రిపోర్ట్ ప్రకారం డెలీవరీ బాయ్స్ 5 కిలోమీటర్ల వరకు పార్సెల్ డెలివర్ చేస్తే 35 రూపాయలు ఇస్తారు. అది దాటితే కిలోమీటరుకు 6 రూపాయల చొప్పున చెల్లిస్తారు. అయితే గత నాలుగేళ్ళుగా ప్రతి డెలివరీకి 40 రూపాయల బేసిక్ పే ఫిక్స్ చేయమని డెలివరీ బాయ్స్ డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు ఏటా పదివేల రూపాయల బోనస్ ఇచ్చే స్విగ్గీ , దాని మీద కూడా కోత పెట్టేసింది. పైగా డెయిలీ టార్గెట్స్ బాగా పెంచేసింది. రోజుకు 14 గంటలు పని చేస్తే కానీ ఈ టార్గెట్స్ పూర్తి చేయలేకపోతున్నామని డెలివరీ బాయ్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోలుకే 300-400 ఖర్చవుతుందని తమకేమీ మిగలట్లేదని వాళ్ళంటున్నారు.
దీనిపై స్విగ్గీ యాజమాన్యం ఇంతవరకు స్పందించలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో డెలివరీలు బాగా లేటవుతాయని కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ తమలో తాము మాట్లాడుకున్న సంభాషణ వివరాలు బయటికొచ్చాయి. మరోవైపు స్విగ్గీ ఆర్డర్స్ లేటవుతున్నాయంటూ సోషల్ మీడియాలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.