స్వాతిముత్యం రిపోర్ట్

ఇద్దరు సీనియర్ హీరోలు పండగ బరిలో ఉన్నప్పుడు కొత్త హీరో సినిమాను రిలీజ్ చేయడం చాలా పెద్ద రిస్క్. అయినా సిద్ధపడింది సితార సంస్థ. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తమ్ముడు గణేష్ ని లాంచ్ చేసిన స్వాతిముత్యంని దసరా టార్గెట్ గా థియేటర్లు తక్కువగా ఉన్నా విడుదల చేయడం ఆసక్తిని రేపింది. దానికి తోడు ఒక రోజు ముందు కొన్ని ప్రధాన కేంద్రాల్లో స్పెషల్ ప్రీమియర్లు వేయడంతో ఇందులో మ్యాటర్ ఏదో ఉందనే అభిప్రాయం జనంలో కలిగించగలిగారు. అయితే విపరీతమైన పోటీ మధ్య ఓపెనింగ్స్ కి ఇబ్బంది పడిన స్వాతిముత్యం పూర్తిగా పబ్లిక్ టాక్ మీదే ఆధారపడింది. ఇంతకీ సినిమాలో మ్యాటర్ బలంగా ఉందా లేదా రిపోర్ట్ లో చూద్దాం

అమాయకంగా ఉండే బాలమురళీకృష్ణ(బెల్లంకొండ గణేష్)కరెంట్ ఆఫీసులో ఉద్యోగం చేస్తుంటాడు. ఎలాంటి లంచాలకు ప్రలోభపడని చక్కని కుర్రాడు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా అమ్మానాన్నాల అతి జాగ్రత్త వల్ల పెళ్లి కుదరదు. ఓ శుభ ముహూర్తంలో స్కూల్లో పాఠాలు చెప్పే పంతులమ్మ భాగ్యలక్ష్మి(వర్ష బొల్లమ)ని ఇష్టపడి ఓకే చేసుకుంటాడు. అలా అని అన్నీ చకచకా జరిగిపోవు. తీరా పెళ్లి జరిగే సమయానికి శైలజ(దివ్య శ్రీపాద)ఓ తొమ్మిది నెలల బిడ్డతో వచ్చి వాడికి తండ్రి బాలనే అని చెప్పి షాక్ ఇస్తుంది. ఇంతకీ ఆ అమ్మయి ఎవరు, ప్యూర్ గోల్డ్ లాంటి బాలకు అంతకు ముందే ఫ్లాష్ బ్యాక్ ఉందా, చివరికి మూడుముళ్ళు ఎవరికి వేశాడు అనేదే స్టోరీ


కొంచెం సెన్సిబుల్ గా అనిపించే చిన్న పాయింట్ ని తీసుకుని ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడమే లక్ష్యంగా ఈ కథను రాసుకున్నాడు దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ. టేకాఫ్ నెమ్మదిగానే ఉన్నప్పటికీ లవ్ స్టోరీ మొదలయ్యాక వినోదం పాళ్ళు పెరుగుతుంది. జంధ్యాల శైలిని అనుకరిస్తూ సెకండ్ హాఫ్ లో రావు రమేష్, గోపరాజు రమణలతో చేయించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కామెడీ బాగా పేలింది. ఎమోషన్లు కూడా కుదిరాయి. కేవలం లీడ్ పెయిర్ మీదే ఫోకస్ పెట్టకుండా లక్ష్మణ్ చాలా తెలివైన పని చేశారు. గణేష్ నటన పాస్ అయ్యింది. వర్ష మరోసారి గుర్తుండిపోతుంది. రెండు గంటల లోపే నిడివున్న ఈ క్లీన్ ఎంటర్ టైనర్ ని ఓసారి ట్రై చేస్తే మరీ నిరాశపరిచే అవకాశం లేదు

Show comments