iDreamPost
iDreamPost
బెల్లంకొండ గణేష్ ని హీరోగా పరిచయం చేస్తూ లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వంలో రూపొందిన స్వాతిముత్యంకు పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ దాదాపు క్రాష్ అయ్యే పరిస్థితి వచ్చేసింది. చూసిన కొంతమంది ప్రేక్షకులు బాగానే ఉందని కితాబిచ్చినప్పటికీ అదే పనిగా థియేటర్ కు వెళ్లేందుకు జనం ఇష్టపడటం లేదని కలెక్షన్లు చెబుతున్నాయి. చాలా చోట్ల నెగటివ్ షేర్లు వచ్చిన మాట వాస్తవం. ఇదంతా పూర్తిగా గాడ్ ఫాదర్ ప్రభావమేనని వేరే చెప్పనక్కర్లేదు. మాది సినిమా కాదా పండక్కు స్టార్లే రావాలా అన్న నిర్మాత నాగ వంశీ కాన్ఫిడెన్స్ మిస్ ఫైర్ అయ్యింది. ఇంకొక్క వారం ఆగి అక్టోబర్ 13కు వేసుకుని ఉంటే పెద్దగా పోటీ లేని అవకాశాన్ని బ్రహ్మాండంగా వాడుకుని ఉండేది.
మళ్ళీ పికప్ అవ్వడం అంత సులభంగా కనిపించడం లేదు. గణేష్ ఒకవేళ ఆల్రెడీ సెటిలైన హీరో అయితే మెల్లగా అయినా ఆక్యుపెన్సీలు పెరిగేవి. అలా కాకుండా డెబ్యూతోనే ఇంత సాహసం చేయించడం రిస్క్ అయ్యింది. ది ఘోస్ట్ ఫెయిలేనప్పటికీ అది కూడా స్వాతిముత్యం ఏ రకంగానూ వాడుకోలేకపోయింది. కొన్ని బిసి సెంటర్స్ లో దీన్ని గాడ్ ఫాదర్ తో రీప్లేస్ చేశారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో సెకండ్ వీక్ లో రన్ ని ఎక్కువగా ఆశించలేం. దసరా సెలవులు కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ ఆడియన్స్ కేవలం గాడ్ ఫాదర్ వైపే మొగ్గు చూపడం ఆశ్చర్యం కలిగించేదే. ఈ వీకెండ్ వీలైనంత రాబట్టుకోవడం మీదే దృష్టి పెట్టాలి. లేదంటే కష్టం.
ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఒకటుంది. కంటెంట్ ఎంత బలంగా ఉన్నా టైమింగ్ చాలా ముఖ్యం. మంచి సినిమా తీశాం కదా పరిస్థితులు వాతావరణం ఎలా ఉన్నా ఆడేస్తుందని అనుకోవడానికి లేదు. చిరంజీవిని తక్కువ అంచనా వేయడం కూడా స్వాతిముత్యంని దెబ్బ కొట్టి ఉండొచ్చనే కామెంట్లో నిజం లేకపోలేదు. ఆ మాటకొస్తే చిరు నాగ్ ల మధ్య కొడుకుని లాంచ్ చేయించడం బెల్లంకొండ సురేష్ కే ఇష్టం లేదట. కాకపోతే తన ప్రమేయం లేని ప్రొడక్షన్ కాబట్టి ఏమీ చెప్పలేని పరిస్థితి. ఇవే సినిమాలు సంక్రాంతికి వచ్చి ఉంటే ఇంకోలా ఉండేది కానీ మొత్తానికి దసరా రేసులో ఇద్దరిని సైడ్ చేసేసి గాడ్ ఫాదర్ బ్రహ్మ ఒక్కడే విజేతగా నిలిచాడు