iDreamPost
android-app
ios-app

ఐపిఎస్ డ్రెస్సులో రివెంజ్ డ్రామా – Nostalgia

  • Published Aug 28, 2021 | 12:49 PM Updated Updated Aug 28, 2021 | 12:49 PM
ఐపిఎస్ డ్రెస్సులో రివెంజ్ డ్రామా – Nostalgia

విక్టరీ వెంకటేష్ తొలి పోలీస్ సినిమా అనగానే ఠక్కున గుర్తొచ్చే సినిమా ఘర్షణ. కానీ కెరీర్ ప్రారంభంలోనే ఖాకీ దుస్తుల్లో ఓ మూవీ చేసిన సంగతి అభిమానులకు బాగా గుర్తే. అది సూర్య ఐపిఎస్. ఆ విశేషాలు చూద్దాం. 1990లో ‘బొబ్బిలిరాజా’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాక వెంకీ ఇమేజ్ మాస్ లో అమాంతం పెరిగిపోయింది. ఒక్కసారిగా నిర్మాణంలో ఉన్న చిత్రాలకు కూడా డిమాండ్ పెరిగిపోయింది. దర్శక రచయితలు తన మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత చేసిన ‘శత్రువు’ కూడా సూపర్ హిట్ కావడంతో ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ‘కూలి నెంబర్ వన్’తో హ్యాట్రిక్ పూర్తి చేశాడు వెంకటేష్.

ఆ సమయంలో ప్రముఖ నిర్మాత టి సుబ్బరామిరెడ్డి వెంకీతో ఓ సినిమా ప్లాన్ చేసుకున్నారు. ముందు ఒక కథను ఫిక్స్ చేసుకుని బాలీవుడ్ బ్యూటీ మీనాక్షి శేషాద్రి హీరోయిన్ గా ప్రారంభోత్సవం కూడా చేశారు. కానీ ఏవో కారణాల వల్ల స్క్రిప్ట్ లో మార్పులతో పాటు వెంకటేష్ జోడి మారిపోయింది. విజయశాంతి వచ్చి చేరారు. పరుచూరి బ్రదర్స్ రచనలో దర్శకులు ఏ కోదండరామిరెడ్డి అన్ని అంశాలు ఉండేలా పకడ్బందీగా సిద్ధం చేశారు. ఇళయరాజాను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. ఈ బ్యానర్ లో వెంకీ అప్పటికే హిందీ నసీబ్ రీమేక్ ‘త్రిమూర్తులు’ చేశారు కానీ అది ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. అందుకే టీమ్ పట్టుదలగా ఉంది.

తాత(సత్యనారాయణ)బలవంతం మీద పోలీస్ కోచింగ్ తీసుకుంటున్న సూర్య(వెంకటేష్)అక్కడ అమ్మాయిలను అల్లరి చేయడమే పనిగా పెట్టుకుని బాధ్యత లేకుండా కాలం గడుపుతాడు. ఇది కాస్తా మితిమీరడంతో తాత వచ్చి అసలు ఖాకీ బట్టలు ఎందుకు వేయించాల్సి వచ్చిందో చెబుతాడు. ఆ తర్వాత నాన్న మీద ప్రతీకారం తీర్చుకుంటాడు కొడుకు. కథలో కావాల్సినంత డ్రామా ఉన్నప్పటికీ సూర్య ఐపిఎస్ పూర్తిస్థాయిలో ఫలితాన్ని అందుకోలేక యావరేజ్ కు జస్ట్ ఒక మెట్టు పైన నిలిచింది. చరణ్ రాజ్ వెంకటేష్ కు తండ్రిగా నటించడం అస్సలు నప్పలేదు. దీంతో పాటు డ్రామా పాళ్ళు కాస్త ఎక్కువ కావడం ఆడియన్స్ కి సింక్ కాలేదు. 1991 సెప్టెంబర్ 3న విడుదలైన సూర్య ఐపిఎస్ పోటీని తట్టుకుని దీనికి వారం ముందు వచ్చిన దాసరి ‘మామగారు’ పెద్ద హిట్టు కావడం కొసమెరుపు

Also Read : అభిమాని మాటల్లో పవన్ సినిమా – Nostalgia