iDreamPost
android-app
ios-app

సీఎం పదవి నుంచి జగన్‌ను తొలగించాలి.. పిటిషనర్‌కు సుప్రింలో దిమ్మతిరిగే రిప్లై..

సీఎం పదవి నుంచి జగన్‌ను తొలగించాలి.. పిటిషనర్‌కు సుప్రింలో దిమ్మతిరిగే రిప్లై..

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందే అక్కడ అక్రమ మార్గంలో సుప్రిం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణ (ఎన్‌వీ రమణ) కుమార్తెల పేరుతో భూములు కొనుగోలు చేశారంటూ సాక్షాధారాలతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సుప్రిం చీఫ్‌ జస్టిస్‌ బాబ్డేకు లేఖ రాశారు. ఆ లేఖలోని వివరాలను సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం మీడియాకు వివరించారు. ఇలా చేయడం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని, వెంటనే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని సీఎం పదవి నుంచి తొలగించాలని దాఖలైన పిటిషన్లపై ఈ రోజు సుప్రిం కోర్టు తీర్పు వెలువరించింది.

న్యాయవాదులు జీఎస్‌ మణి, ప్రదీప్‌కుమార్‌లు దాఖలు చేసిన ఈ పిటిషన్‌కు అసలు విచారణ అర్హతే లేదని సుప్రిం కోర్టు తెలిపింది. విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గ్యాగ్‌ ఆర్డర్‌ ఎత్తివేసిన తర్వాత చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది. పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.

సీఎం వైఎస్‌ జగన్‌ రాసిన లేఖలోని అంశాలపై జోక్యం చేసుకోవాలంటూ న్యాయవాది సునీల్‌కుమార్‌ సింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా త్రిసభ్య ధర్మాసనం విచారించింది. లేఖలోని అంశాలపై దర్యాప్తు జరపాలా..? వద్దా..? అనేది చీఫ్‌ జస్టిస్‌ పరిధిలో ఉందని పేర్కొంది. లేఖలోని అంశాలపై ఎంత మంది జోక్యం చేసుకుంటారని ప్రశ్నించింది. లేఖలోని అంశాలను ఇప్పటికే వేరే బెంచ్‌ పరిశీలిస్తోందని తెలిపింది. సీఎం రాసిన లేఖలోని అంశాలపై సీబీఐతో దర్యాప్తు చేయించేది..? లేనిది..? చీఫ్‌ జస్టిస్‌ నిర్ణయిస్తారని ధర్మాసనం స్పష్టం చేస్తూ పిటిషన్‌ను మూసివేసింది.