iDreamPost
android-app
ios-app

రాజమౌళి డీకోడెడ్..!

రాజమౌళి డీకోడెడ్..!

రాజమౌళి సినిమాలన్నీ చందమామ కథలలాంటి సాదాసీదా కామిక్ బుక్ ఇతివృత్తాలతో తీసినవే. వాటిలో మణిరత్నం, సుకుమార్ సినిమాలలోలాగా ఇంటలెక్చువల్ టచ్ గానీ, శంకర్, కొరటాల శివ సినిమాలలోలాగా సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చేవిగాగానీ ఉండవు. ఆ మాటకొస్తే గొప్ప జీనియస్ టింజ్ ఏమీ రాజమౌళి సినిమాలలో కనపడదు. మరి గ్లోబల్ లెవల్ డైరెక్టర్ ఎలా అయ్యాడు!

అతని సక్సెస్‌కు కారణం అతని సినిమాలలో ఉండే భారీతనం అని, బలమైన ఎమోషన్స్ అని, హీరోను తలదన్నేలా ఉండే విలన్ అని, హీరో ఎలివేషన్స్ అని రకరకాల వాదనలు వినబడుతుంటాయి. అవన్నీ కరెక్టేగానీ, ఇక్కడ చర్చించబోయే కోణం వేరే డైమన్షన్‌ది. తెలుగు రాష్ట్రాలలోనే కాదు, ఆ మాటకొస్తే భారతదేశం మొత్తంలో ఏ దర్శకుడికీ లేని కొన్ని advantages రాజమౌళికి ఉన్నాయి.

ఒక దర్శకుడికి ఏవి ఉన్నా, లేకపోయినా రెండు లక్షణాలు మాత్రం ఖచ్చితంగా ఉండితీరాలి.
1. ఈస్థటిక్ సెన్స్ 2. ఆర్గనైజింగ్ స్కిల్స్
అంటే రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్‌ రెండింటితో ఆలోచించగలిగి ఉండాలి. ఈ రెండు లక్షణాలూ విడివిడిగా చాలామందికి ఉండవచ్చు. కానీ, రెండూ కలిసి ఉన్నవాళ్ళే సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అవుతారు. ఎందుకంటే ఈస్థటిక్ సెన్స్ – కళాత్మకదృష్టి ఉండేవాళ్ళు ఊహాప్రపంచంలో ఉంటుంటారు ఎక్కువగా. వారికి పీపుల్ స్కిల్స్, ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉండటం చాలా అరుదు. కానీ ఆ స్కిల్స్ లేకపోతే, వందలమంది సాంకేతికనిపుణులతో కూడుకుని ఉండే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్‌ పనులలో దర్శకుడు ఒక్క రీల్ ఔట్ పుట్ కూడా బయటకు తీసుకురాలేడు. అందులోనూ అనేక రకాల టెంపరమెంట్స్‌తో కూడి ఉండే నటీనటులు, సాంకేతిక నిపుణులను సమన్వయం చేసుకుంటూ వారినుంచి తను అనుకున్నస్థాయి ఔట్ పుట్ రాబట్టుకోవటం అంటే కత్తిమీద సాము లాంటి పని.

మరోవైపు, ఎంత గొప్ప దర్శకుడు అయినా తమ మనస్సులో concieve చేసిన ఐడియాను నూటికి నూరుశాతం తెరకు ఎక్కించటం అసాధ్యమని కూడా సినిమా పండితులు చెబుతుంటారు. ఎందుకంటే షూటింగ్ సమయాలలో ఎదురయ్యే అనేక ఛాలెంజింగ్ పరిస్థితులలో ఆ దర్శకుడు carry away అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కరెక్ట్‌గా ఇక్కడే రాజమౌళికి advantage ఉంది. తన ఐడియాను execute చేసే క్రమంలో ఎదురయ్యే వివిధ ఛాలెంజింగ్ పరిస్థితులను absorb చేసుకోవటానికి అతనికి ఒక పెద్ద బెటాలియనే ఉంది. అదే అతని కుటుంబం. రాజమౌళికి క్రియేటివ్ సైడ్ ఒక్కటీ చూసుకుంటే సరిపోతుంది. మిగిలిన ప్రొడక్షన్ డిజైన్, లాజిస్టిక్స్ వంటి ఆర్గనైజేషనల్ వ్యవహారాలన్నీ కుటుంబసభ్యులు ఒక్కొక్కరూ ఒక్కో విభాగం రెస్పాన్సిబిలిటీ తీసుకుని పనులు ఖచ్చితంగా, అత్యుత్తమంగా జరిగేలా చూసుకుంటారు.

సినిమాకు మూలస్తంభాలైన విభాగాలలో – కథ(తండ్రి విజయేంద్రప్రసాద్), సంగీతం(కజిన్ కీరవాణి), లైన్ ప్రొడ్యూసర్(కీరవాణి భార్య శ్రీవల్లి), సెకండ్ యూనిట్ డైరెక్టర్(కొడుకు కార్తికేయ), కాస్ట్యూమ్స్(భార్య రమ), పాటలు(పెదనాన్న శివశక్తిదత్తా, మరో పెదనాన్న రామకృష్ణ), సౌండ్ మిక్సింగ్(కజిన్ కళ్యాణి మాలిక్), గాయకుడు (కాలభైరవ-కీరవాణి కుమారుడు), అసిస్టెంట్ డైరెక్టర్(శ్రీ సింహా-కీరవాణి కుమారుడు), వీఎఫ్‌ఎక్స్(రాజబలి-పెదనాన్న రామకృష్ణ కుమారుడు) వంటి వివిధ కీలక బాధ్యతలన్నీ సొంత కుటుంబసభ్యులే చూసుకుంటారు. ఇక ఫొటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్, సంభాషణలు వంటి విభాగాలను మాత్రమే బయటివాళ్ళు నిర్వహిస్తారు. వారినికూడా తమ కుటుంబ సభ్యులుగా మార్చేసుకుని సొంతమనుషులలాగా కలిపేసుకోవటం రాజమౌళి కుటుంబ ప్రత్యేకత. మరోవైపు ఇండస్ట్రీకే చెందిన గుణ్ణం గంగరాజు, ఏలేటి చంద్రశేఖర్ వంటి బంధువుల సలహాలు, సూచనలు, ఇటు రాఘవేంద్రరావువంటి వెటరన్ సలహాలు ఎలాగూ ఉంటాయి. అలా ఆ సపోర్ట్ సిస్టమ్,
క్లోజ్ నిట్‌గా ఉండే ఆ కుటుంబంలోని సభ్యుల టీమ్ వర్కే రాజమౌళి మొదటి విజయరహస్యం.

ఆ కుటుంబ సభ్యులు ఒక టీమ్‌లాగా పనిచేయటమేకాదు, వారందరి మధ్య ఒక చక్కటి అనుబంధం, సమన్వయం ఉండటం రాజమౌళికి వేల్యూ ఎడిషన్ అని చెప్పుకోవాలి. రాజమౌళి, కీరవాణి కుటుంబాలన్నీ హైదరాబాద్‌లో ఒకేచోట కలిసిమెలసి ఉంటాయి. ఆ కుటుంబాలలోని సభ్యులు అందరూ సినిమాను తాగుతారు, తింటారు, శ్వాసిస్తారు. రోజువారీగా షూటింగ్‌లో ఎదురయ్యే సమస్యల గురించి అందరూ చర్చించుకుంటారు కాబట్టి రాజమౌళిపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది.పైగా రాజమౌళి వేసుకునే బట్టల దగ్గరనుంచి తినే తిండి వరకు ప్రతి చిన్న విషయాన్నీ రమా రాజమౌళి చాలా శ్రద్ధగా చూసుకుంటారు. ఇక అతను చిన్నచిన్న విషయాలపై బుర్ర పెట్టాల్సిన పనే ఉండదు.వీటన్నిటినీ మించి మరో విషయం గుర్తుపెట్టుకోవాలి – రాజమౌళి సహజంగానే ఒక ప్రతిభావంతుడు, నిజాయితీ, నిబద్ధత మెండుగా ఉన్న వ్యక్తి. సినిమా రంగంలో ఎక్కువగా ఉండే అవకాశవాదం, మాయమాటలు చెప్పటం, మోసగించటం వంటి చెడు లక్షణాలేమీ లేవు. కష్టపడే స్వభావం, సినిమాలపై తపన, అద్భుతంగా తీర్చిదిద్దాలనే ప్యాషన్ బలంగా ఉన్నాయి. అలాంటి ఆ ప్రతిభావంతుడికి వెన్నుదన్నుగా ఒక అద్భుతమైన కుటుంబం ఉండటంతో రాజమౌళికి డబుల్ ధమాకా స్వతహాగా ఏర్పడిపోయింది. కాబట్టి రాజమౌళి విజయ రహస్యాలలో మొదటిది ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్. ఇక అతని విజయ రహస్యాలలో రెండవది లెగసీ – వారసత్వంగా సంక్రమించిన ఆస్తి. ఇక్కడ రాజమౌళికి వారసత్వంగా సినిమా పరిజ్ఞానం లభించింది. ఆ లెగసీయే అతను ఇవాళ అంతర్జాతీయ స్థాయి దర్శకుడిని చేసింది. అది ఎలాగో చూద్దాం.

బాహుబలి అనే రెండుభాగాల జయింట్ ప్రాజెక్టును అసలు concieve చేయగలగటానికే గట్స్ కావాలి. ఎందుకంటే అలా రెండు భాగాలుగా ఒక సినిమాను తీస్తాం అని ప్రారంభానికి ముందే ప్రకటించటం అనే ఒక రాడికల్ ప్రయత్నం ముందెన్నడూ జరగలేదు… భారతీయ చలన చిత్రచరిత్రలో. రాజమౌళికి అంత గట్స్ ఈ లెగసీనుంచే వచ్చాయి. దీనిని ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే – రెండు మూడు తరాలనుంచి ఒకే వ్యాపారం/వృత్తిలో ఉన్న ఒక కుటుంబంనుంచి ఒక ప్రతిభావంతుడైన యువకుడు అదే వృత్తిలో ప్రవేశిస్తే తన విజన్, అతని యాటిట్యూడ్‌తో ఆ వ్యాపారాన్ని ఎలా అయితే నెక్స్ట్ లెవల్‌లోకి తీసుకెళ్ళగలుగుతాడో, రాజమౌళికూడా అలాగే ఈ వృత్తిలో నెక్స్ట్ లెవల్‌ను చేరుకోగలిగాడు.

రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్, పెదనాన్న శివశక్తిదత్తా దాదాపు 60 ఏళ్ళనుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. వారికి సినిమాలు తప్ప వేరే ప్రపంచం లేదు. దత్తా బ్రదర్స్ పేరుతో కథా రచయితలుగా పనిచేసేవారు. పెద్దగా సక్సెస్ లభించకపోయినా స్ట్రగుల్ అవుతూ అలాగే ఇండస్ట్రీలో కొనసాగారు. ఇంటిదగ్గరమాత్రం ఉమ్మడి కుటుంబంలాగానే ఉండేవారు. అటువంటి కుటుంబ నేపథ్యంనుంచి రావటం వలనో, ఏమో రాజమౌళికి మొదటినుంచి సినిమాలపైన ప్యాషన్ ఉండేది. దానికితోడు సహజంగానే ప్రతిభావంతుడు. తన తండ్రి, పెదనాన్నల పరిచయాల వలన ఇండస్ట్రీలోకి తేలిగ్గానే ప్రవేశించగలిగాడు. పైగా ఇండస్ట్రీని శాసించగలిగే ఒక పెద్ద సామాజికవర్గం అండ ఉండనే ఉంది(ఒక దళిత వర్గానికో, మైనారిటీ వర్గానికో చెందిన దర్శకుడు రాజమౌళిస్థాయిలో విజయవంతం కావటం అటుంచి, అసలు దర్శకుడు కావటమే కష్టమనే విమర్శ తెలుగు ఇండస్ట్రీలో ప్రచారంలో ఉంది. తమిళ సినిమా ఇండస్ట్రీలోలాగా తెలుగు ఇండస్ట్రీలో దళిత దర్శకులు రాణించలేకపోతున్నారనేదిమాత్రం ఎవరూ కాదనలేని వాస్తవం). అందుకనే సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావుదగ్గర నేరుగా అసిస్టెంట్‌ అయిపోయాడు, ప్రియ శిష్యుడుకూడా అయ్యాడు. రాజమౌళిలోని ప్రతిభను గమనించిన రాఘవేంద్రరావు సీరియల్ ద్వారా అవకాశం ఇచ్చారు. సినిమాలలో మొదటి అవకాశంకూడా త్వరగానే వచ్చింది. ఇక అక్కడనుంచి రాజమౌళి ప్రస్థానం అందరికీ తెలిసిందే. అలా అతని లెగసీ రాజమౌళి ఇండస్ట్రీలో ప్రవేశించటానికి మార్గం సుగమం చేసింది.

బాహుబలిని ప్రారంభానికి ముందే రెండు భాగాలుగా చేస్తున్నట్లు ధైర్యంగా ప్రకటించటం అనే సాహసాన్ని ఏ ఫస్ట్ జనరేషన్ డైరెక్టరో అయితే చేయగలడా? దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కేవలం తనకున్న లెగసీ కారణంగానే రాజమౌళి మగధీర వంటి మెగా ప్రాజెక్ట్‌ను, బాహుబలి వంటి ఫ్రాంచైజ్‌ను ముందే విజువలైజ్ చేయగలిగాడు. బాహుబలిని రెండు భాగాలుగా తీస్తున్నట్లు ప్రకటించటంతో వెంటనే ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ అది ఆకర్షించింది. అంటే చిత్రానికి చేయవలసిన 75 శాతం ప్రమోషన్‌ ఆ ప్రకటనతోనే ముందే జరిగిపోయింది. ఆ ప్రకటనపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగా చిత్రం మొదటిభాగాన్ని execute చేయటం, దానికి మంచి టాక్ రావటంతో చిత్రంపై క్రేజ్ అనూహ్యస్థాయిలో పెరిగిపోయింది. చిత్రం బ్రహ్మాండమైన విజయం సాధించటంతో అది కేవలం రాజమౌళి స్థాయినేకాదు తెలుగు చిత్రాల, భారతీయ చిత్రాల స్థాయిని కొన్ని వందలరెట్లు పెంచేసింది.

ఏది ఏమైనా రాజమౌళి విజయానికి కారణమైన ఫ్యామిలీ, లెగసీ అనే పాయింట్స్‌లో అందరూ స్ఫూర్తిపొంది తేలిగ్గా విజయాన్ని చేజిక్కించుకునే పాయింట్ ఒకటి ఉందని చెప్పొచ్చు. పై రెండు కారణాలలో లెగసీ అనే కారణం అతనికి అప్రయత్నంగా డెస్టినీ వలన లభించింది కాబట్టి అది అందరికీ సాధ్యం కాదు, కేవలం అదృష్టం వలనే వస్తుంది. ఫ్యామిలీ ప్యాకేజ్ అనే కారణం మాత్రం అందరూ అనుసరించటానికి వీలైనది. ఇంట్లో అందరూ సమష్టిగా, టీమ్‌లాగా సమన్వయంతో పనిచేస్తే ఎంతటి గొప్ప లక్ష్యమైనా, ప్రాజెక్ట్ అయినా చేరుకోవటం కేక్ వాకే అవుతుంది. ఇది రాజమౌళినుంచి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందాల్సిన విషయం.

ఇక మరి కొద్ది గంటల్లో విడుదలవుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా విషయానికొస్తే, అందరి మనసుల్లో ఇప్పుడు మెదులుతున్నది ఒకటే ప్రశ్న. అప్రతిహతంగా విజయ పరంపరను సాగిస్తూ పీక్స్‌కు చేరుకున్న రాజమౌళి, మళ్ళీ ట్రిపుల్ ఆర్‌తో విజయాన్ని చేజిక్కించుకుంటారా అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. మామూలు సినిమాలకంటే ఈ సినిమాలో ఆయన ఎదుర్కోవలసిన సవాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నాయి.

1.బాహుబలి తర్వాత వస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులలో రాజమౌళిపై అంచనాలు ఆకాశాన్ని అందుకుంటున్నాయి వాటిని ఎలా చేరుకుంటారో చూడాలి.
2.ఈ సినిమాలలో ఆయన కథా నేపథ్యం స్వాతంత్ర్యోద్యమ చరిత్ర, ఇద్దరు ప్రముఖులైన దేశభక్తులు. అయితే ఆ ఇద్దరి దేశభక్తుల పాత్రలను మాత్రమే తీసుకుని ఈయన తన సృజనాత్మకత జోడించి కొత్త కథను సృష్టించి ఈ సినిమాను రూపొందించారు. కానీ, ఈ ఇద్దరు దేశభక్తులు… ముఖ్యంగా కొమరం భీం ,అల్లూరి సీతారామరాజు తెలుగువారికి ఐకానిక్ ఫిగర్స్ .సూపర్ స్టార్ కృష్ణ తీసిన అల్లూరి సీతారామరాజు చిత్రంతో ఆయన చరిత్ర అందరికీ బాగా చేరిపోయింది. అలాంటి వ్యక్తి పాత్ర బ్రిటిష్ సైన్యంలో చేరటం, బ్రిటిష్ సైన్యం తరపున పనిచేస్తూ స్వాతంత్ర్యంకోసం పోరాడుతున్న మరో దేశభక్తుడిని, జనాలను కొట్టినట్లు చూపించటం ఎంతవరకు జస్టిఫై చేయగలరో చూడాలి.

3.ఇక తెలుగు ఇండస్ట్రీలోని రెండు వేర్వేరు వర్గాలకు చెందిన అగ్రహీరోలను ఒకే చిత్రంలో నటింపజేస్తున్న రాజమౌళి వారిద్దరి పాత్రలమధ్య ఎలా సమతూకం చూపగలుగుతారనేది మూడో సవాల్. ఏ మాత్రం తేడా వచ్చిన అభిమానులు తెరలు చింపేస్తారనేది అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం. రాజమౌళికి, ఆయన సినిమా కుటుంబ బృందం మొత్తానికీ జూనియర్ అభిమాన నటుడు… ఫర్ ఆబ్వియస్ రీజన్స్. కాబట్టి సహజంగానే ఆయనను బాగా చూపించాలని, ఎలివేట్ చేయాలని చూస్తాడు. మిగిలిన విషయాలలో అయితే రాజమౌళి ఒక్కడే ఏమైనా జడ్జిమెంట్‌లో తేడాచేస్తే కుటుంబసభ్యులు అభ్యంతరం చెప్పగలరేమోగానీ, ఇక్కడ కుటుంబసభ్యులు అందరూ జూనియర్‌కు అభిమానులు అయినప్పుడు – రాజమౌళి జూనియర్‌పట్ల మొగ్గు ఎక్కువ చూపించినా అభ్యంతరం చెప్పకపోవచ్చు. అలాంటప్పుడు రాంచరణ్ కంటే జూనియర్‌ది డామినేషన్ కనబడే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఇప్పటికే ట్రైలర్‌లో జూనియర్ సీన్లలో ఆ డామినేషన్ కనబడుతోంది. మరి దీనిని ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది చూడాలి. రాజమౌళికాబట్టి సినిమా మినిమమ్ గ్యారంటీ అయితే ఉంటుంది. కానీ, ప్రముఖ దేశభక్తుల పాత్రలతో ఊహాజనిత సన్నివేశాలను వివాదాస్పదం కాకుండా ఎలా జస్టిఫై చేసి చూపిస్తారో చూడాల్సిఉంది.

కొసమెరుపు: రాజమౌళి గురువు రాఘవేంద్రరావుకూడా లెగసీ అనే అడ్వాంటేజ్‌తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాణించారు. ఆయన తండ్రి కె.ఎస్.ప్రకాశరావు పెద్ద దర్శకుడు, ఎన్టీఆర్, అక్కినేనిలతో ఎన్నో హిట్ చిత్రాలు తీశారు. అయితే రాఘవేంద్రరావుకు అప్పట్లో – ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా, కిందస్థాయినుంచి వచ్చిన దాసరి నారాయణరావు గట్టి పోటీ ఇచ్చేవారు. అలాగే ఇప్పుడు – దాసరి లాగానే సినిమా బ్యాక్ గ్రౌండ్ ఏమాత్రంలేని మిడిల్ క్లాస్ ఫ్యామిలీనుంచి వచ్చిన సుకుమార్ రాజమౌళికి దీటుగా తనదైన శైలితో సినిమాలను రూపొందిస్తున్నారు. అటు రాఘవేంద్రరావు, రాజమౌళి ఇటు దాసరి, సుకుమార్ ఇండస్ట్రీలో పోటీపడే రెండు వేర్వేరు బలమైన సామాజికవర్గాలకు చెందినవారు కావటం విశేషం.

– Written By Sravana Babu, Freelance Journalist