iDreamPost
iDreamPost
రాష్ట్ర హోదా కోల్పోయి రెండేళ్లుగా త్రిశంకు స్వర్గంలో ఉన్న కాశ్మీర్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ప్రయత్నాలు కొలిక్కి వచ్చినట్లు కనిపించినా.. ఇంకా పీటముడి వీడలేదు. ఈ నెల 24న ప్రధాని మోదీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం సానుకూలంగా జరిగిందని అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు అఖిలపక్ష నేతలు చెప్పినా.. అసలు విషయం తేలనప్పుడు సానుకూలమని, చర్చలు ఫలించాయని ఎలా చెబుతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చర్చలు సామరస్య పూర్వకంగానే జరిగినా.. ప్రత్యేక హోదా పునరుద్ధరణ, ఎన్నికల నిర్వహణ.. ఈ రెండింటిలో ఏది ముందు చేపట్టాలన్న దగ్గరే ప్రతిష్టంభన ఏర్పడింది. ముందు ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం ప్రతిపాదించగా.. కాదు హోదాను పునరుద్ధరించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
370 రద్దుతో వివాదం
జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ లను రెండేళ్ల క్రితం కేంద్రం రద్దు చేసింది. దాంతోపాటు ప్రత్యేక హోదా కోల్పోయిన రాష్ట్రాన్ని కశ్మీర్, లడఖ్ లను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చింది. ఈ నిర్ణయాలను వ్యతిరేకించిన ప్రతిపక్ష పార్టీల నేతలను నెలల తరబడి గృహ నిర్బంధంలో ఉంచింది. ఈ తరుణంలో సుప్రీంకోర్టు జోక్యంతో కశ్మీరీ నేతలకు విముక్తి లభించింది. ఆర్టికల్ 370 రద్దు అంశం కూడా కోర్టు విచారణలో ఉంది.
Also Read : చంద్రబాబు ను మరిచిపోయారా?
ఎవరి వాదన వారిదే
ఈ నేపథ్యంలో కాశ్మీర్లో రాజకీయ ప్రక్రియ పునరుద్ధరణ కోసమంటూ ఈ నెల 24న కశ్మీరుకు చెందిన పలు పార్టీల నేతలతో డిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికల నిర్వహణ అజెండాగా జరిగిన ఈ సమావేశంలో పునర్విభజన అంశం పక్కకు వెళ్ళిపోయి.. ఎన్నికలు, ప్రత్యేక హోదా చుట్టూనే చర్చలు కేంద్రీకృతమయ్యాయి. ఆర్టికల్ 370ని వెంటనే పునరుద్ధరించి కశ్మీరుకు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని సూచించాయి. అయితే మొదట ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. అందుకు సహరించాలని కోరారు. ఎవరూ పట్టువీడక పోవడంతో.. అక్కడితో సమావేశాన్ని ముగించేశారు. బయటకొచ్చిన నేతలు గానీ, ప్రభుత్వ ప్రతినిధులు గానీ.. చర్చలు సానుకూలంగా జరిగాయని చెప్పారే తప్ప.. తీసుకున్న నిర్ణయాలేమిటో చెప్పకపోవడం గమనార్హం.
సుప్రీం తీర్పే కీలకం
రాష్ట్ర, ప్రత్యేక హోదా కల్పిస్తే ప్రజల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసం ఏర్పడుతుందని, దానివల్ల ఎన్నికలకు సానుకూల వాతావరణం ఏర్పడుతుందన్నది ప్రతిపక్షాల వాదన. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం ఇంకోలా వాదిస్తున్నాయి. మొదట ఎన్నికలు నిర్వహిస్తే ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని.. అప్పడు ఆర్టికల్ 370, రాష్ట్ర హోదా పునరుద్ధరణ సులభం అవుతాయని పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో అందరి దృష్టి సుప్రీంకోర్టు వైపు మళ్లింది. కోర్టు తీర్పే ఈ ప్రతిష్ఠంభనను తొలగించగలదని అంటున్నారు. ఆర్టికల్ 370 రద్దును కోర్టు సమర్థిస్తే ప్రభుత్వ వాదనే నెగ్గి తప్పనిసరిగా ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. అలాకాకుండా ఆర్టికల్ 370 రద్దు ఉత్తర్వులను కోర్టు కొట్టివేస్తే.. ఆటోమేటిగ్గా 370 హోదా, రాష్ట్ర హోదా అమల్లోకి వచ్చేస్తాయి. అప్పుడిక దాని కోసం ప్రత్యేక ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉండదు.
Also Read : కుమారస్వామి జోస్యం.. నమ్మకమా.. ఓవర్ కాన్ఫిడెన్సా?