Idream media
Idream media
ప్రపంచీకరణ అంటే ఏదేదో అనుకుంటాం గానీ, దానర్థం ఇప్పుడు కరోనా వైరస్. ప్రపంచం చిన్న గ్రామంగా మారిపోయింది. పేర్లు కూడా వినని దేశాల్లో మనవాళ్లు వ్యాపారాలు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలోని మారుమూల గోరంట్ల గ్రామానికి చెందిన వారు మడగాస్కర్ దేశంలో బంగారు గనులు లీజుకు తీసుకున్నారు. ఘనా దేశంలోని లిక్కర్ కాంట్రాక్టర్లంతా రాయలసీమకు చెందిన వాళ్లే. ఎపుడైతే ప్రపంచం నలుమూలలా ఉద్యోగాలు, వ్యాపారాల కోసం జనం తిరగడం మొదలైందో అప్పుడే వ్యాధుల వ్యాప్తి కూడా మొదలైంది.
ఒకప్పుడు మనుషులు తమ ప్రాంతం దాటి వెళ్లేవాళ్లు కాదు. అందువల్ల ఎక్కడి వ్యాధులు అక్కడే ఉండేవి. 2వేల ఏళ్ల క్రితం ఏథేన్స్‌లో ప్లేగు వ్యాధి వచ్చి లక్ష మంది చనిపోయారు. అయితే ఇది అక్కడే ఆగిపోయింది. లక్ష మంది చనిపోయినట్టు ప్రపంచానికి తెలియను కూడా తెలియదు.
14వ శతాబ్దం నాటికి యూరప్‌లోని అనేక దేశాల వాళ్లు వ్యాపారం కోసం తిరగడం మొదలు పెట్టారు. మంగోలియాలో ఉన్న ప్లేగుని ఇంగ్లండ్ వరకు తీసుకెళ్లారు. మొదట రేవు పట్టణాలకు అంటుకొంది. తర్వాత యూరప్‌లోని అన్ని దేశాలకు వచ్చింది. 3 కోట్ల మంది చనిపోయారు. చరిత్రలో దీన్ని బ్లాక్ డెత్ అంటారు. బెల్జియం, నెదర్లాండ్స్, స్పెయిన్‌లో చాలా వరకు జనం తుడిచిపెట్టుకుపోయారు.
1898లో బొంబాయి రేవుకి ప్లేగు వచ్చింది. పదేళ్లలో లక్షలాది మందిని చంపేసింది. ఆ తర్వాత ప్లేగు భయమే తప్ప, ప్లేగు కనపడలేదు. ఆశ్చర్యకరంగా 1994లో సూరత్‌ని కుదిపేసింది. అదృష్టం కొద్ది విస్తరించలేదు.
ఇప్పుడు ఎంత స్పీడ్ అంటే డిసెంబర్ 2019లో చైనాలో కరోనా బయటపడింది. మూడు నెలల్లో ప్రపంచమంతా వచ్చేసింది. దీనికి కారణం ట్రాన్స్పోర్ట్ అభివృద్ధి. కమ్యూనికేషన్ వ్యవస్థ ఎంత వేగంగా ఉందంటే ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని స్థితిలో ఏ సంబంధమూ లేనివాళ్లు దివాళా తీస్తున్నారు.
మాంసం తింటే వస్తుందని ఎవరో చెబితే చికెన్ ఎంత దారుణంగా పడిపోయిందంటే వందకు మూడు కిలోలు ఇచ్చినా కొనేవాళ్లు లేరు. చేతులు కడుక్కోమని చెబితే హ్యాండ్‌వాష్‌ల అమ్మకాలు పెరిగిపోయాయి. ఫలానా హోమియో మందు వాడమని చెబితే అది దుకాణాల్లో దొరకడం లేదు.
ప్రపంచానికే కరోనా కొత్త. మరి దీని వల్ల వస్తుంది, దీని వల్ల రాదు అని ఎట్లా చెబుతారు. శుభ్రంగా ఉంటే రాదట. అదే నిజమైతే మనదేశంలో ఇప్పటికి సగం మందికి వచ్చి ఉండాలి.
కరోనా వల్ల ప్రయోజనం ఏమంటే కొన్ని కోట్ల డాలర్లు ఖర్చు పెట్టినా, కొన్ని వందల సమావేశాలు పెట్టినా కర్బన ఉద్గారాలు తగ్గించడం సాధ్యం కాలేదు. కరోనా వచ్చి ఆ పని చేసింది.