వీళ్ళు ఎందుకు సమావేశం అయ్యారబ్బా ? … టిడిపిలో టెన్షన్

ఫొటోలో కనిపిస్తున్న ముగ్గురు నేతలు ఎందుకు సమావేశమయ్యారో తెలీక తెలుగుదేశంపార్టీలో టెన్షన్ పెరిగిపోతోంది. ఇంతకీ ఫొటోలో ఉన్నదెవరంటే టిడిపిలోనే ఉంటూ యాక్టివ్ రాజకీయాలనుండి తప్పుకున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపి జేసి దివాకర్ రెడ్డి. అలాగే టిడిపిలో నుండి బిజెపిలోకి ఫిరాయించిన రాజ్యసభ ఎంపి సిఎం రమేష్. మూడో వ్యక్తి కడప జిల్లా పులివెందులకు చెందిన టిడిపి ఎంఎల్సీ బిటెక్ రవి.

ఒకపుడు ముగ్గురు టిడిపి నేతలే అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ మొన్నటి ఎన్నికల తర్వాత రమేష్ మాత్రం బిజెపిలో చేరిపోయాడు. ఎన్నికల్లో ఫలితాల దెబ్బకు జేసి కూడా అస్త్ర సన్యాసం చేసేసినట్లే. ఎందుకంటే తాను యాక్టివ్ రాజకీయాల నుండి రిటైర్ అయినట్లు ఆయనే చెప్పాడు కాబట్టి. ఇక మూడో నేత బిటెక్ రవి ఏమో పార్టీలో ఉన్నా లేనట్లే అన్నట్లుగా అయిపోయింది పరిస్ధితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిది కూడా పులివెందులే కాబట్టి అక్కడి ప్రతిపక్ష నేతలు చప్పుడు చేయటం లేదు. అందులోను వైఎస్ ఫ్యామిలిపై నాలుగు ఎన్నికల్లో పోటి చేసిన సతీష్ రెడ్డి టిడిపికి రాజీనామా చేసేసిన తర్వాత పార్టీనే స్తబ్దుగా అయిపోయింది.

ఇక జేసి విషయమే తీసుకుంటే ఈ మాజీ ఎంపి బిజెపిలోకి వెళిపోతారనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. తనకు బిజెపిలో చేరమని ఆహ్వానం అందిన మాట నిజమే అని జేసి కూడా చెప్పారు. దాంతో జేసి ఫ్యామిలి ఎప్పుడు టిడిపికి రాజీనామా చేసేస్తుందో తెలీక నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అందులోను టిడిపి ఘోరంగా ఓడిపోయిన తర్వాత జేసి వ్యాపారాలపై వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతోంది. అందుకనే తమను తాము రక్షించుకునేందుకే జేసి కుటుంబం బిజెపిలో చేరబోతోందనే ప్రచారం జరుగుతోంది. ఆ విషయం మాట్లాడేందుకే రమేష్ జేసిని కలిసినట్లుగా చెప్పుకుంటున్నారు.

ఈ సమయంలోనే బిజెపి నేత రమేష్ టిడిపి ఎంఎల్సీతో కలిసి మాజీ ఎంపిని కలిసిన విషయం బయటపడటంతో టిడిపిలో కలకలం మొదలైంది. సరే ఏదో సరదాకి కలిసినట్లు వీళ్ళు చెబుతున్నా పనికట్టుకుని ముగ్గురు నేతలు ఊరికే సరదాకి కలుస్తారా ? అనే సందేహం కూడా ఉంది లేండి. నిజానికి బిటెక్ రవికి కూడా పార్టీలో ఇమడలేని పరిస్దితిలు మొదలైనట్లు సమాచారం. చూస్తుంటే టిడిపికి తొందరలోనే పెద్ద దెబ్బ పడేట్లే ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో.

Show comments