నైరుతి అప్ డేట్.. నేడు తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాల ఆగమనం

మండుటెండలతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) చల్లనివార్త చెప్పింది. ఈ ఏడాది నైరుతి ఆగమనం ఊహించని దానికంటే ముందే వచ్చినా.. దేశమంతా విస్తరించేందుకు ఎక్కువ సమయం తీసుకుంది. నేడు నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రతీరంలోని కొన్ని ప్రాంతాలతో పాటు.. గుజరాత్, మధ్య మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమలో కొన్ని ప్రాంతాలతో పాటు కొంకణ్ ప్రాంతం మొత్తానికి విస్తరించనున్నట్లు ఐఎండీ తెలిపింది.

అలాగే బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు.. సబ్ హిమాలయన్ ప్రాంతాలు- పశ్చిమ బెంగాల్లో కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించి ఉన్నట్లు వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న ఐదురోజుల్లో పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య భారతంలో విరివిగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. మరోవైపు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా ఈ విషయాన్నే వెల్లడించింది.

నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి.. మహబూబ్ నగర్ జిల్లా వరకూ విస్తరించి ఉన్నాయని, రానున్న రెండ్రోజుల్లో ఇవి రాష్ట్రమంతా విస్తరిస్తాయని తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో మూడ్రోజుల వరకూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో గత అర్థరాత్రి తేలికపాటి జల్లులు కురిశాయి. ఉదయం నుంచి పలు చోట్ల ఆకాశం మేఘావృతమై.. వాతావరణం చల్లబడటంతో ప్రజలు సేదతీరుతున్నారు. నిజానికి జూన్ మొదటి వారంలోనే రుతుపవనాలు తెలుగురాష్ట్రాల్లోకి వస్తాయని అంచనాలుండగా.. అధిక ఉష్ణోగ్రతల కారణంగా రుతుపవనాల రాకకు ఆటంకం కలిగింది.

 

 

Show comments