iDreamPost
iDreamPost
“రాష్ట్రంలో రోజూ ఒక కోటి మంది మద్యం సేవిస్తున్నారు. ఆ కోటి మంది ఈ సారి (2024లో) బీజేపీకి ఓటు వేయండి. మేం అధికారంలోకి వస్తాం. అప్పుడు రూ 50 కే ఓ క్వార్ట్రర్ బాటిల్ మద్యం ఇస్తాం. అదికూడా నాణ్యమైన మద్యం ఇస్తాం.” ఈ హామీ ఇచ్చింది ఎవరో కాదు, బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉందని చెప్పిన వీర్రాజు తమ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తెస్తే రోజూ మద్యం సేవించే కోటి మందికి ఒక్కొక్కరికీ యాభై రూపాయలకే నాణ్యమైన మద్యం అందిస్తామని హామీ ఇవ్వడం ఎలాంటి రాజకీయమో ప్రజలు ఆలోచించాలి.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుచరులు, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులూ చీప్ లిక్కర్ తయారు చేస్తున్నారని, దాన్ని రూ 200 నుండి రూ 250 వరకూ అమ్ముతున్నారని వీర్రాజు ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో పేరున్న బ్రాండ్లు ఏవి అందుబాటులో లేకుండా చేశారని, ఏవో ఎప్పుడూ వినని బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉంచారని బీజేపీ నేత విమర్శించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే నాణ్యమైన మద్యం అందుబాటులో ఉంచడంతో పాటు మంచి పేరున్న బ్రాండ్లను కూడా అందుబాటులో ఉంచుతామని సోము వీర్రాజు హామీ ఇచ్చారు.
నాణ్యమైన మద్యం తక్కువ ధరకే అందిస్తామని ఇచ్చిన హామీ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. హిందూ మతం, భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలు అంటూ గొంతు చించుకునే పార్టీ నేతలు ఇలా సరసమైన ధరకు నాణ్యమైన మద్యం అందిస్తామని హామీ ఇవ్వడం ఏ రకం రాజకీయమో బీజేపీ నేతలే చెప్పాలి. భారత్ మాతాకు జై అంటూ ప్రజల్లో ఉద్వేగం పెంచే పార్టీ ఇప్పుడు సరసమైన ధరకు నాణ్యమైన మద్యం ఇస్తామని ఇచ్చిన హామీ ఏ రకం జాతీయ వాదం అనిపించుకుంటుందో సోము వీర్రాజు కానీ, బీజేపీ నేతలు కానీ చెప్పాలి.
Also Read : జగన్ వద్ద 9 రత్నాలే.. మోదీ వద్ద 90 రత్నాలున్నాయట..!
మద్యం తర్వాత బీజేపీ ఇచ్చిన మరో హామీ అమరావతి రాజధానిగా కొనసాగించడం. అమరావతి రైతులను అటు చంద్రబాబు నాయుడు, ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ మోసం చేశారని చెప్పిన వీర్రాజు తాము అధికారంలోకి వస్తే అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు అమరావతి రైతులకు ద్రోహం చేశాయని ఆ రైతులు బీజేపీకి ఓటు వేస్తె న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చి, అమరావతి రైతుల మద్దతు కూడా కోరారు. అయితే కారణం ఏదైనా బీజేపీ నిర్వహించిన ఈ సభకు అమరావతి రైతుల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సభలోనే బీజేపీ నేత రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మాట్లాడుతూ అమరావతి అంగుళం కూడా కదలదని, ఆంధ్రటప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగుతుందని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని “ప్రజా ఆగ్రహ సభ” అంటూ నిర్వహించిన సభలో బీజేపీ నేతలు వ్యక్తిగత ఆరోపణలు చేయడం మినహా నిర్మాణాత్మకమైన విమర్శలేవీ చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి బెయిలుపై ఉన్నారని, బెయిలు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని, లేేకపోతే కేంద్రం ఇచ్చే నిధులతో ఇక్కడ సంక్షేమ పధకాలు స్టిక్కర్ వేసుకుని అమలు చేస్తున్నారు అని మినహా ,ప్రజలను ఆలోచింపజేసే విమర్శ లేదా ఆరోపణ ఒక్కటీ చేయలేకపోయారు. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలకు నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తోంది అంటూ ఆ క్రెడిట్ పొందే ప్రయత్నం చేశారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జనం ఆగ్రహంతో ఉన్నారు అని చెప్పేందుకు, ప్రజలను ఆలోచింప జేసేందుకు బీజేపీ నేతలు సరైన ఆరోపణ ఒక్కటి కూడా చేయలేకపోయారు.
Also Read : మందుబాబులకు బిజెపి బంపర్ ఆఫర్ !