iDreamPost
android-app
ios-app

నాకొద్దీ రాజకీయం…. ఐదుసార్లు ఎమ్మెల్యే

నాకొద్దీ రాజకీయం….  ఐదుసార్లు ఎమ్మెల్యే

మహారాష్ట్రలో ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని “మహా వికాస్ అఘాడి” సంకీర్ణ ప్రభుత్వం మంత్రి వర్గ విస్తరణ చేపట్టి సరిగ్గా 24 గంటలు కూడా గడవక ముందే ప్రభుత్వ సంకీర్ణ భాగస్వామి ఎన్సీపీ కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బీద్ జిల్లా మజల్‌గాన్ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎన్సీపీ సీనియర్ నేత సోలంకే అనూహ్యంగా తన శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేసి ఊహించని షాక్ ఇచ్చారు. సోమవారం రాత్రి ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు.

తాను రాజకీయాలకు పనికిరానన్న ప్రకాశ్ సోలంకే తనకు మంత్రి పదవి రాకపోవడం వల్లే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. సోమవారం జరిగిన మంత్రి వర్గ విస్తరణకు, తన రాజీనామాకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే మంత్రివర్గ విస్తరణ తర్వాత తాను రాజకీయాలకు పనికిరానని రుజువైందని ఆయన పేర్కొనడం విశేషం.

మంగళవారం నేను రాజీనామా చేయబోతున్నాను. ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నాను, ఎన్సీపీ లో ఎవరితోనూ తనకు వ్యక్తిగతంగా విభేదాలు లేవని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న నా నిర్ణయాన్ని ఇప్పటికే ఎన్సీపీ నేతలకు చెప్పాను. మంగళవారం మధ్యాహ్నం ముంబైలో అసెంబ్లీ స్పీకర్‌ని కలిసి రాజీనామా లేఖ సమర్పిస్తానని ఆయన వెల్లడించారు.

ఇదిలావుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే కుమార్తె ప్రణీతి షిండే, సంగ్రామ్ తోపేట్, అమిన్ పటేల్, రోహిదాస్ పాటిల్ మహారాష్ట్ర కేబినెట్ విస్తరణపై అసంతృప్తితో ఉన్నారని వార్తలొస్తున్నాయి. అలాగే తన సోదరుడు సునీల్ రౌత్ కు కేబినెట్ విస్తరణలో చోటు దక్కకపోవడంతో శివసేన ఎంపి సంజయ్ రౌత్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారని అందువల్లే కేబినెట్ విస్తరణ కార్యక్రమానికి సంజయ్ రౌత్ హాజరుకాలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.

కాగా నిన్న 36 మందితో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తన కేబినెట్‌ను విస్తరించిన సంగతి తెలిసిందే. ఎన్సీపీ నేత అజిత్ పవార్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 288 స్థానాలకు గానూ ఎన్సీపీకి 54 మంది ఎమ్మెల్యేలు ఉండగా శివసేనకు 56 మంది కాంగ్రెస్ కి 44 మంది సభ్యులున్నారు