బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ.. రోడ్డు మీద పడ్డ 800 మంది ఉద్యోగులు..

నిరుద్యోగులకు ఉద్యోగం ఆశ చూపించి వారి దగ్గర సాఫ్ట్ వేర్ జాబ్ అంటూ డబ్బులు తీసుకొని రెండు నెలలు మంచిగా మెయింటైన్ చేసినట్లు నటించి సడెన్ గా రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసింది ఓ సాఫ్ట్ వేర్ సంస్థ. హైదరాబాద్‌ మాదాపూర్‌లో ఇన్నోహబ్‌ టెక్నాలజీస్‌ అనే సంస్థ సాఫ్ట్‌వేర్‌ జాబ్ పేరిట ఒక్కో నిరుద్యోగి నుంచి 2 లక్షల వరకు వసూలు చేసింది. ఇలా వసూలు చేసిన వారికి రెండు నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి జీతాలు కూడా ఇచ్చారు.

దీంతో కంపెనీ మీద ఎవరికీ అనుమానం రాలేదు. అయితే అకస్మాత్తుగా రెండు వారాల క్రితం కంపెనీకి సంబంధించిన వెబ్ సైట్, మెయిల్స్ బ్లాక్ చేసింది ఇన్నోహబ్‌ టెక్నాలజీస్‌ సంస్థ. ఇది గమనించిన ఉద్యోగులు సమాచారం ఆరా తీసేందేకు ప్రయత్నించగా సంస్థకు సంబంధించిన వారెవరూ అందుబాటులో లేరు. ఆఫీస్ లో కానీ, ఫోన్లలో కానీ ఎవ్వరూ అందుబాటులో లేకపోవడంతో ఉద్యోగులు తాము మోసపోయినట్లు గ్రహించారు.

ఆ కంపెనీ బోర్డు తిప్పేయడంతో కంపెనీలో పనిచేసే 800 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. దీనిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో బాధిత ఉద్యోగులు వారం రోజుల క్రితమే ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసి వారం గడుస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ సోమవారం ఉదయం మాదాపూర్ పోలీస్ స్టేషన్ ముందు బాధిత ఉద్యోగులు ఆందోళన మొదలు పెట్టారు. ఈ కంపెనీ ఒక్కొక్కరి వద్ద 2 లక్షలు చొప్పున తీసుకొని దాదాపు 10 కోట్ల పైనే వసూలు చేసి బోర్డు తిప్పేసిందని సమాచారం.

Show comments