iDreamPost
android-app
ios-app

చిన్న సినిమాల భారీ యుద్ధం

  • Published Aug 13, 2021 | 6:22 AM Updated Updated Aug 13, 2021 | 6:22 AM
చిన్న సినిమాల భారీ యుద్ధం

థియేటర్లు తెరుచుకున్న ఉత్సాహం నిర్మాతలను కుదురుగా ఉండనివ్వడం లేదు. పోటీ ఎంత ఉన్నా సరే తగ్గేదేలే అనే రేంజ్ లో కాంపిటీషన్ కి రెడీ ఐపోతున్నారు. లాక్ డౌన్ ఎత్తేసి కరోనా ఇంతకు ముందు ఉన్నంత తీవ్రంగా లేకపోయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా పూర్తి స్థాయిలో హాళ్లకు రావడం లేదు. దీనికి కారణం ఇంకా నెలకొని ఉన్న భయమా లేక సరైన సినిమా రాలేదనే నిరుత్సాహమా తెలియదు కానీ మొత్తానికి ఉండాల్సిన జోష్ అయితే ప్రస్తుతానికి లేదు. ఇవాళ రేపు తొమ్మిది సినిమాలు రాబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే వారం కూడా 19, 20 తేదీల్లో అయిదారు దాకా వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

ఇక ఆపై సెప్టెంబర్ 27న కూడా మూడు చెప్పుకోదగ్గ చిత్రాలే రేస్ లో ఉన్నాయి. మొదటిది సుధీర్ బాబు నటించిన శ్రీదేవి సోడా సెంటర్. పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మాస్ ఎంటర్ టైనర్ లో ఆనందిని హీరోయిన్ గా నటించింది. మణిశర్మ అందించిన ట్యూన్లకు రెస్పాన్స్ బాగానే వచ్చింది. రెండోది సుశాంత్ నటించిన ఇచట వాహనములు నిలుపరాదు. పోయిన ఏడాది లాక్ డౌన్ టైంలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ థ్రిల్లర్ మూవీకి ఇప్పటికి మోక్షం దక్కింది. ఇక అవసరాల శ్రీనివాస్ టైటిల్ పాత్ర పోషించిన 101 జిల్లాల అందగాడు కూడా వీటితో పోటీ పడనుంది. ఇది బాలీవుడ్ మూవీ బాలకు రీమేక్ అని టాక్.

సో మొత్తానికి ట్రయాంగిల్ వార్ ఆసక్తికరంగా ఉండబోతోంది. చూసేందుకు ఇదంతా బాగానే ఉంది కానీ ఈ ముగ్గురు మంచి ఓపెనింగ్ తెచ్చేవారు కాదు. టాక్ బాగుంటేనే జనం థియేటర్లకు వస్తారు. ఇంకా వేచి చూసే కొద్దీ ఇబ్బందులే కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఇలా తప్పనిసరి పరిస్థితుల్లో కాంపిటీషన్ కు జెండా ఊపేస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి భారీ చిత్రాలు రంగంలోకి దిగబోతున్న తరుణంలో ముందుజాగ్రత్తగా ఇలాంటి మీడియం బడ్జెట్ సినిమాలు సేఫ్ గేమ్ ఆడేస్తున్నాయి. ఇప్పటికి ఈ మూడే. రాబోయే రోజుల్లో ఇంకెన్ని ప్రకటనలు వస్తాయో చూడాలి మరి

Also Read : థియేటర్ల వద్ద సందడి ఖాయమేనా