iDreamPost
android-app
ios-app

స‌యామి క‌వ‌ల‌ల తొలి చిత్రం అగ్గిపిడుగు – Nostalgia

స‌యామి క‌వ‌ల‌ల తొలి చిత్రం అగ్గిపిడుగు – Nostalgia

బి.విఠ‌లాచార్యకి జాన‌ప‌ద బ్ర‌హ్మ అని పేరు. 1960-70 మ‌ధ్య ఆయ‌న తెర‌మీద సృష్టించిన అద్భుతాలు అన్నీఇన్నీ కాదు. అవ‌న్నీ ఇపుడు తీయాలంటే గ్రాఫిక్స్ కోసం కోట్లు ఖ‌ర్చు పెట్టాలి.

అలెగ్జాండ‌ర్ డ్యూమా ఫ్రెంచి ర‌చ‌యిత‌. ఆయ‌న న‌వ‌ల‌ల ఆధారంగా ప్ర‌పంచ‌మంతా కొన్ని వంద‌ల సినిమాలు తీశారు. 1844లో THE CORSICAN BROTHERS ( ది కోర్సిక‌న్ బ్ర‌ద‌ర్స్‌) అనే న‌వ‌ల‌ని ఆయ‌న రాశాడు. క‌థ ఏమిటంటే ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు అతుక్కొని పుడుతారు. వాళ్ల‌ని ఆప‌రేష‌న్ ద్వారా వేరు చేస్తారు. అయితే ఇద్ద‌రూ ఒకేలా స్పందిస్తూ ఉంటారు. ఈ క‌థ‌తో విఠ‌లాచార్య ఎన్టీఆర్‌తో 1964లో అగ్గిపిడుగు తీశారు. అయితే చాలా నిజాయితీగా త‌న సినిమాకి మూలం “కోర్సిక‌న్ బ్ర‌ద‌ర్స్” అని సినిమా ప్రారంభంలోనే వేసుకున్నాడు. (నాగార్జున హ‌లో బ్ర‌ద‌ర్ కూడా ఇదే క‌థ‌)

చిన్న‌ప్పుడు అతుక్కుని పుట్టిన క‌వ‌ల‌ల‌ని ఒక డాక్ట‌ర్ (ముక్కామల‌) వేరు చేస్తాడు. (విఠ‌లాచార్య ప్ర‌త్యేక‌త ఏమంటే క‌థా కాలం గురించి ఆయ‌న‌కి ప‌ట్టింపులు లేవు. అందుకే ఈ డాక్ట‌ర్ ఇంగ్లీష్ మాట్లాడుతుంటాడు) ఆ క‌వ‌ల‌ల ప్ర‌త్యేక‌త ఏమంటే ఒక‌రు ఏడిస్తే ఇంకొక‌రు ఏడుస్తారు. అయితే ఈ పాయింట్ సినిమాలో పెద్ద‌గా క‌న‌ప‌డ‌దు. (హ‌లో బ్ర‌ద‌ర్‌లో డైరెక్ట‌ర్ ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ‌, ఈ పాయింట్ మీదే బోలెడు కామెడీ సృష్టించాడు)

రాజ్యం మీద క‌న్నేసిన రాజ‌నాల , హీరోల త‌ల్లిదండ్రుల‌ని చంపేస్తాడు. క‌వ‌ల‌లు వేర్వేరు చోట్ల పెరుగుతారు. త‌మ‌కి జ‌రిగిన అన్యాయం గురించి తెలుసుకుని రాజ‌నాల మీద ప్ర‌తీకారం తీర్చుకుంటారు. ఇద్ద‌రు హీరోలు కాబ‌ట్టి , కృష్ణ‌కుమారి, రాజ‌శ్రీ హీరోయిన్లు. మొత్తం సినిమాని వాహినీ స్టూడియోలో తీశారు. అక్క‌డ‌క్క‌డా వ‌చ్చే అవుట్‌డోర్ సీన్స్ మ‌ద్రాస్ ప‌రిస‌రాల్లో తీశారు. ( ఆ రోజుల్లో మ‌ద్రాస్ చుట్టు ప‌క్క‌ల విశాల‌మైన ఖాళీ స్థ‌లాలు ఉండేవి)

క‌థంతా రొటీన్ పార్మెట్‌. పాట‌లు, ఫైట్స్‌, మారువేషాలు. ఆ రోజుల్లో మారువేషం లేకుండా ఎన్టీఆర్ సినిమా ఉండేది కాదు. ఎన్టీఆర్ ఒక మీషం పెట్టుకుని త‌ల‌పాగా చుట్టుకుని వ‌స్తే హీరోయిన్ కూడా క‌నుక్కోలేదు. ఎన్టీఆర్ టైట్ ఫ్యాంట్ వేసుకుని , చువ్వ‌లాంటి క‌త్తిని స‌క్‌ స‌క్‌మ‌ని తిప్పుతూ ఫైటింగ్ చేస్తాడు. ఆయ‌న కంటే ఎక్కువ‌గా డూప్‌లే క‌ష్ట‌ప‌డ‌తారు. గుర్రం మీద హీరో చాలాసార్లు వెళ్తాడు కానీ, ఒక్క‌సారి కూడా నిజం గుర్రం ఎక్కింది లేదు.

సినిమాలో మూడు హిట్ సాంగ్స్ ఉన్నాయి. రాజ‌న్‌-నాగేంద్ర సంగీతం కొత్త ట్యూన్ అందించింది. అగ్గిపేరుతో తెలుగులో క‌నీసం 50 సినిమాలు వ‌చ్చి ఉంటాయి.

క‌వ‌ల‌ల సినిమాలు త‌ర్వాత రోజుల్లో ఎన్ని ర‌కాలుగా రూపాంత‌రం చెందాయో తెలుసుకోడానికి స‌ర‌దాగా ఈ సినిమా చూడొచ్చు. యూట్యూబ్‌లో ఉంటుంది. ప‌ని ఏమీలేక‌పోతే కాసేపు ప్ర‌య‌త్నించండి. ఆ కాలం ఓవ‌రాక్ష‌న్ చూసి కాసేపు న‌వ్వుకోవ‌చ్చు.