iDreamPost
android-app
ios-app

సొగసైన పల్లెటూరి యువకుడి ప్రేమకథ – Nostalgia

  • Published Oct 10, 2021 | 8:38 AM Updated Updated Oct 10, 2021 | 8:38 AM
సొగసైన పల్లెటూరి యువకుడి ప్రేమకథ – Nostalgia

తెలుగు రాష్ట్రాల్లో సోగ్గాడు అనే పదం వినిపించగానే గుర్తొచ్చే రూపం అందాల నటుడు శోభన్ బాబు. వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఎప్పటికీ మర్చిపోలేని క్లాసిక్ గా నిలిచిపోయిన ఆ సినిమా విశేషాలు చూద్దాం. 1975. నిర్మాత రామానాయుడు గారు కె బాపయ్య దర్శకత్వంలో సినిమాను ప్రకటించారు. అప్పటికి మూడు సినిమాల అనుభవం ఉన్న బాపయ్యకు ఊర్వశి మాత్రమే విజయాన్ని అందించగా ఎన్టీఆర్ తో తిరుగులేని మనిషి నిర్మాణంలో ఉంది. తమిళ రచయిత బాలమురుగన్ కథకు మోదుకూరి జాన్సన్ మాటలు సమకూర్చగా మంచి కాంబినేషన్ తో దీన్ని తీస్తే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందన్న నాయుడు గారి నమ్మకం బాపయ్య నిజం చేశారు.

జయసుధ, జయచిత్ర హీరోయిన్లుగా సత్యనారాయణ, పద్మనాభం, రాజబాబు, అల్లు రామలింగయ్య, నగేష్, గిరిబాబు, అంజలిదేవి, రమాప్రభ తదితరులు ఇతర తారాగణంగా భారీ క్యాస్టింగ్ ని సెట్ చేసుకున్నారు, మామ కెవి మహదేవన్ అదిరిపోయే ఆల్బమ్ ని సిద్ధం చేశారు. విన్సెన్ట్ ఛాయాగ్రహణం బాధ్యతలు నెరవేర్చారు. ఖర్చుకు వెనుకాడకుండా హైదరాబాద్, విజయవాడ పరిసర గ్రామాలు, నాయుడు గారి స్వగ్రామం కారంచేడులో షూటింగ్ చేశారు. బావ మరదళ్ళు వీళ్ళ మధ్య హీరో భార్యగా ప్రవేశించిన అమ్మాయి కథతో ట్రయాంగిల్ స్టోరీగా తీర్చిదిద్దినప్పటికీ గ్రామీణ నేపథ్యంలో ఏ అంశం మిస్ కాకుండా తీర్చిదిద్దిన తీరు అద్భుతంగా కుదిరింది

1975 డిసెంబర్ 19న విడుదలైన సోగ్గాడు మీద జనం కలెక్షన్ల వర్షం కురిపించారు. ఆయన కెరీర్ లో 19 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న మొదటి సినిమా ఇదే. ఒక విలేజ్ డ్రామాకు ఈ స్థాయిలో వసూళ్లా అని ట్రేడ్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. గత ఇండస్ట్రీ హిట్లను తలపించేలా కొన్ని సెంటర్స్ లో ప్రభంజనం సృష్టించడం విశేషం. పాటలు యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రేడియో, గ్రామ్ ఫోన్ రికార్డుల్లో మారుమ్రోగిపోయాయి. ఖైదీ బాబాయ్, జీవనజ్యోతి తర్వాత శోభన్ బాబు సోగ్గాడుతో హ్యాట్రిక్ ఫిలిం ఫేర్ అందుకున్నారు. 1976 ఏప్రిల్ లో విజయవాడ మున్సిపల్ స్టేడియంలో వంద రోజుల వేడుకను ఘనంగా జరిపారు

Also Read : హీరోని దేవుడంటే ప్రేక్షకులు ఒప్పుకోలేదా – Nostalgia