WWW : డిజిటల్ లో రానున్న టెక్నాలజీ థ్రిల్లర్

ఇటీవలే డిస్నీ హాట్ స్టార్ లో నేరుగా విడుదలైన అద్భుతం ద్వారా డెబ్యూ చేసిన రాజశేఖర్ కూతురు శివానికి యాక్టింగ్ పరంగా మంచి మార్కులే పడ్డాయి. డిజిటిల్ రిలీజ్ కాబట్టి జనం బాగానే చూశారు. బాగుందా లేదానేది పక్కనపెడితే థియేటర్లకు వెళ్లకుండా మంచి పని చేసిందని మాత్రం చెప్పొచ్చు. ఇక శివాని రెండో సినిమా డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు(WWW) కూడా ఓటిటి బాట పట్టిందని లేటెస్ట్ అప్ డేట్. కళ్యాణ్ రామ్ 118 ద్వారా ఇక్కడి ఆడియన్స్ ని మెప్పించిన దర్శకుడు కం కెమెరామెన్ కెవి గుహన్ డైరెక్షన్ లో ఇది రూపొందింది. గతంలో వచ్చిన టీజర్ తదితర ప్రమోషనల్ మెటీరియల్ జనాన్ని బాగానే ఆకట్టుకున్నాయి. ముందు థియేటరే అనుకున్నారు.

ఈ లోగా పరిణామాలు మారిపోయి పెద్ద సినిమాల మధ్య చిన్నవి నలిగిపోయే అవకాశం ఉండటంతో ఈ ట్రిపుల్ డబ్ల్యు ఇలా ఓటిటి రూటు పట్టేసింది. సోనీ లివ్ ద్వారా ఈ నెల 24న ఆడియన్స్ ని పలకరించబోతోందని తెలిసింది. అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో ఇవ్వబోతున్నారు. దీని హక్కుల్లో నిర్మాత సురేష్ బాబు కూడా భాగస్వామి కావడం గమనార్హం. ఆదిత్ అరుణ్, ప్రియదర్శి, వైవా హర్ష, దివ్య దృష్టి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇంటర్ నెట్ టెక్నాలజీని మెయిన్ పాయింట్ గా తీసుకున్న గుహన్ దీన్నో థ్రిల్లర్ గా రూపొందించారట. ట్విస్టులు మంచి షాక్ ఇచ్చేలా ఉంటాయని ఇన్ సైడ్ టాక్.

థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకున్నాక కూడా పలువురు నిర్మాతలు డైరెక్ట్ ఓటిటి రిలీజులకు మొగ్గు చూపడం గమనిస్తే రాబోయే భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. తీసిన ప్రతి సినిమా హాల్లోనే రిలీజ్ చేయాలనే పంతం ఇకపై కనిపించకపోవచ్చు. వ్యయప్రయాసలు కూర్చి అలా రిలీజ్ చేస్తే వచ్చే లాభం కన్నా డిజిటల్ బాటలో లాభాలు త్వరగా వస్తుండటంతో ఇమేజ్ క్యాస్టింగ్ లేని ఇలాంటి చిత్రాలకు ఇంత కన్నా మంచి దారి లేదు. నారప్ప, దృశ్యం 2, టక్ జగదీశ్, మాస్ట్రో లాంటి బ్రాండెడ్ మూవీసే జై స్మార్ట్ స్క్రీన్ అన్నప్పుడు ఈ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు లాంటివి సేఫ్ గేమ్ ఆడటంలో తప్పు లేదు.

Also Read : Trailer/Teaser Delays : రెండు నిమిషాల వీడియోలకు ప్లానింగ్ ఉండదా

Show comments