iDreamPost
iDreamPost
మనకు మగ హాస్యనటులు గుర్తున్నంతగా లేడీ కమెడియన్స్ ఫ్లాష్ కారు. ఎందుకంటే వాళ్ళ ఉనికే తక్కువ కాబట్టి. అలాంటి ట్రెండ్ లోనూ ఒక సంచలనంలా దూసుకొచ్చిన కోవై సరళ గురించి తెలియని వారు ఉండరు. ఇప్పుడంటే అవకాశాలు తగ్గిపోయి వయసు ఆరోగ్యం దృష్ట్యా కనిపించడం తగ్గించారు కానీ సరైన పాత్ర దక్కితే ఇప్పుడూ చెలరేగిపోతానని రుజువు చేస్తూనే ఉన్నారు. దానికి మంచి ఉదాహరణగా నిన్న రిలీజైన తమిళ మూవీ సెంబి గురించి చెప్పుకోవచ్చు. స్వయానా కమల్ హాసన్ దీన్ని చూసి చాలా బాగుందని మెచ్చుకోవడంతో మీడియా కూడా ఈ సినిమా మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. దానికి తగ్గట్టే సెంబి మీద ప్రశంసలు కురుస్తున్నాయి.
కొడైకెనాల్ కు దగ్గరలో ఓ అటవీ ప్రాంతంలో ఉండే వీరతాయి(కోవై సరళ)అక్కడ దొరికే తేనె తుట్టెలతో పాటు ఇతర సహజంగా దొరికే వస్తువులను సేకరించి వాటిని అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉంటుంది. ఒక్కగానొక్క మనవరాలు సెంబి(నీల)కు పదేళ్ల వయసు. ముగ్గురు యువకులు ఆ పాపపై అత్యాచారం చేస్తారు. అందులో ఒకడు స్థానిక రాజకీయ నాయకుడి కొడుకు కావడంతో వీరతాయికి న్యాయం జరగదు. దీంతో ఎలాగైనా ఆ దుర్మార్గులకు శిక్ష పడాలనే సంకల్పంతో వ్యవస్థ తనకు ఏ మాత్రం సహకరించకపోయినా పోరాడేందుకు సిద్ద పడుతుంది. ఈ క్రమంలో ఎన్నో ప్రమాదాలు సవాళ్లు ఎదురవుతాయి. చివరికి వీరతాయి లక్ష్యం ఎలా నెరవేరిందో అదే అసలు కథ
సెంబిలో కోవై సరళ వెంటనే గుర్తుపట్టలేనంత గొప్పగా బామ్మ పాత్రలో జీవించేశారు. ఆవిడకు పోటీగా నీల కూడా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ప్రేమఖైది, గజరాజు, అరణ్య లాంటి సినిమాల ద్వారా ఫారెస్ట్ హిల్ బ్యాక్ డ్రాప్స్ మాత్రమే తీసుకుననేప్రభు సాల్మన్ ఈ మూవీకి దర్శకుడు. అనవసరమైన కమర్షియల్ అంశాలు లేకుండా సీరియస్ గా ప్రభు సెంబిని తెరకెక్కించిన తీరు ఈ జానర్ ని ఇష్టపడే వాళ్లకు నచ్చుతుంది. ఇలాంటి లైన్ తో గతంలోనూ సినిమాలు వచ్చినప్పటికీ ఎంచుకున్న నేపథ్యం ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. మన ఆడియన్స్ కి ఈ తరహా కాన్సెప్ట్స్ కనెక్ట్ కావడం కష్టం కాబట్టి డబ్బింగ్ చేయకపోవచ్చు. కోవై సరళ నటన కోసమైనా సెంబిని ఖచ్చితంగా చూడొచ్చు