iDreamPost
android-app
ios-app

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ మరో అడుగు.. రాజకీయ రచ్చకు సిద్దమైనట్లే.. !

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ మరో అడుగు.. రాజకీయ రచ్చకు సిద్దమైనట్లే.. !

పాజిటివ్‌ కేసులు లేని సమయంలో కరోనా వైరస్‌ను బూచిగా చూపి మార్చి 15వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఇప్పుడు వైరస్‌ వ్యాపిస్తూ.. ప్రతి రోజు సుమారు నాలుగు వేల కేసులు నమోదవుతున్న తరుణంలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు. రెండు రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల సంఘానికి నిధులు ఇవ్వడంలేదంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలపై మరో అడుగు వేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో చర్చించేందుకు నిర్ణయించారు. ఈ నెల 28వ తేదీన విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల నేతలతో చర్చించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు రాజకీయ పార్టీల నేతలకు గురువారం రాత్రి వర్తమానం పంపారు.

ముమ్మరంగా జరుగుతూ.. మరో పక్షం రోజుల్లో స్థానిక ఎన్నికలు పూర్తవుతాయన్న తరుణంలో అర్థంతరంగా ఎన్నికలను వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఆ తర్వాత జరిగిన పరిణామాలలో పదవిని పోగొట్టుకున్నారు. మళ్లీ న్యాయస్థానాలను ఆశ్రయించి పదవిలోకి వచ్చారు. ఈ మధ్యలో జరిగిన పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం, నిమ్మగడ్డ రమేష్‌ మధ్య అగాధం భారీగా పెరిగింది. ఒక్కమాటలో చెప్పాలంటే రాజకీయ వైరం నెలకొంది. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ టీడీపీ తాజా, మాజీ నేతలతో సమావేశాలు అవ్వడం రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు. రాబోయే మార్చితో పదవి కాలం ముగుస్తున్న తరుణంలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. వీలైనంత మేరకు రాష్ట్ర ప్రభుత్వంలో రచ్చనే కొరుకుంటున్నట్లుగా ఆయన చర్యల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఎన్నికలు వాయిదా పడడంతో స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలనను రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఆరు వరకు పొడిగించింది. ఆ తర్వాత కరోనా పరిస్థితిని బట్టి ఎన్నికలు నిర్వహణపై నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం ఊహించినట్లుగానే కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతోంది. గత నెల వరకూ రాష్ట్రంలో రోజుకు గరీష్టంగా పది వేల కేసుల నమోదవగా.. ప్రస్తుతం ఆ సంఖ్య నాలుగు వేల దిగవకు వచ్చింది. మరో రెండు, మూడు నెలల్లో ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో కోవిడ్‌ రెండో దశ కూడా వ్యాపించే ప్రమాదం ఉందనే హెచ్చరికలు అందుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల ప్రాణాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. అయితే నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మాత్రం.. స్థానిక సంస్థల ఎన్నికల కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వంతో రాజకీయం నడపాలని యోచిస్తున్నట్లుగా ఆయన వ్యవహార శైలి ద్వారా స్పష్టమవుతోంది. ఎవరి కోసం నిమ్మగడ్డ ఈ పని చేస్తున్నారు..? ఆయన వెనుక ఎవరున్నారనేది ఇప్పటిగే జగద్విదితమే కావడంతో.. నిస్సంకోచంగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ రాజకీయ క్రీడ ఆడేందుకు సిద్ధమయ్యారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.