Idream media
Idream media
అన్నాడీఎంకే బహిషృత నేత, దిగవంగత ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి శశికళ రాజకీయంగా తన లక్ష్యం ఏమిటో తమిళ ప్రజలకు చాటి చెప్పారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన ఆమె ఈ నెల 27వ తేదీన జైలు నుంచి విడుదలయ్యారు. కరోనా పాజిటివ్‌తో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆమె పూర్తిగా కోలుకుని ఆదివారం డిశ్చార్జి అయ్యారు. వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమన్న వైద్యుల సూచన మేరకు ఆస్పత్రి నుంచి నేరుగా బెంగుళూరు శివారులోని ఓ రిసార్టుకు వెళ్లారు. జయలలిత ప్రయాణించిన కారునే శశికళ వినియోగించడం, కారుపై అన్నాడీఎంకే జెండాను ఉంచడంతో తమిళనాడు రాజకీయాల్లో రాబోయే పరిణామాలకు అద్దం పడుతున్నాయి.
జయలిలత మరణం తర్వాత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు చేపట్టారు. సీఎం పీఠాన్ని కూడా అధిరోహించేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే జయ మరణం తర్వాత మళ్లీ వెలుగులోకి వచ్చిన అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. ఈ పరిణామం తర్వాత శశికళను అన్నాడీఎంకే నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టులో పెడింగ్‌లో ఉంది. ఈ క్రమంలో జైలు నుంచి విడుదలైన శశికళ.. అన్నాడీఎంకే జెండాను తాను ప్రయాణిస్తున్న కారుపై పెట్టుకోవడం చర్చనీయాంశమవుతోంది. రాబోయే వేసవిలో తమిళనాడు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో తన ప్రాత ఏమిటో, అన్నాడీఎంకే భవిష్యత్ ఏమిటో జైలు నుంచి బయటకు వచ్చిన ప్రారంభంలోనే శశికళ స్పష్టమైన సంకేతాలిచ్చారు.
తాజా పరిణామాలను అన్నాడీఎంకే నేతలు సునిశితంగా గమనిస్తున్నారు. అన్నాడీఎంకే జెండాను శశికళ తనకారుపై పెట్టుకోవడాన్ని ఆ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి జయకుమార్ తప్పుబట్టారు. శశికళకు పార్టీలో కనీసం సభ్యత్వం కూడా లేదని, అలాంటిది జెండా ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించడం అన్నాడీఎంకే నేతల్లో మొదలైన ఆందోళనకు నిదర్శనంగా నిలుస్తోంది. సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం మధ్య పరోక్ష ఆధిప్యత పోరుతో గత కొంతకాలంగా అన్నాడీఎంకే శ్రేణులు అయోమయంలో ఉన్నాయి. పార్టీలో నెలకొన్న నాయకత్వ లోపాన్ని శశికళ భర్తీ చేస్తారనే భావనతో అన్నాడీఎంకే శ్రేణులున్నాయి. వారం రోజుల విశ్రాంతి తర్వాత తమిళనాడుకు శశికళ రాబోతున్నారు. ఆ తర్వాత తమిళనాడు రాజకీయాల్లో, ముఖ్యంగా అన్నాడీఎంకేలో ఆసక్తికర పరిణామాలు జరిగే అవకాశాలున్నాయి.