iDreamPost
android-app
ios-app

మంచి యాక్షన్ థ్రిల్లర్ కు నిర్వచనం – Nostalgia

  • Published Sep 13, 2021 | 11:18 AM Updated Updated Sep 13, 2021 | 11:18 AM
మంచి యాక్షన్ థ్రిల్లర్ కు నిర్వచనం – Nostalgia

అనుకుంటాం కానీ ఇంకో భాషలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాని రీమేక్ చేసేటప్పుడు మక్కికి మక్కి తీసినా మార్పులు చేర్పులు చేసినా అదే ఫలితం దక్కుతుందన్న గ్యారెంటీ లేదు. ఈ సత్యం ఎన్నోసార్లు రుజువయ్యింది. కాకపోతే ఎంచుకునేటప్పుడు అది మన ఇమేజ్ కు సరిపోతుందా అంత బరువు మోయగలమా లేదా అనేది చెక్ చేసుకోవడం చాలా అవసరం. దానికో క్లాసిక్ ఉదాహరణ చూద్దాం. 1999లో హిందీలో అమీర్ ఖాన్ హీరోగా ‘సర్ఫరోష్’ వచ్చింది. సోనాలి బెంద్రే హీరోయిన్ కాగా నసీరుద్దీన్ షా విలన్ గా నటించారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా రచయితగా ఎంతో పేరున్న జాన్ మాథ్యూ మతన్ కి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. దీనికి అద్భుత విజయం దక్కింది.

పైకి పెద్దమనుషుల్లా కనిపిస్తూ గుట్టుగా ఆయుధాల వ్యాపారం చేస్తూ దేశంలో అలజడి సృష్టించేందుకు పన్నాగాలు పన్నుతున్న ముష్కరుల ఆట కట్టించేందుకు నడుం బిగించిన ఏసిపి అజయ్ సింగ్ రాథోడ్ కథే ఈ సర్ఫరోష్. చాప కింద నీరులా మన వ్యవస్థలో తీవ్రవాదం ఉగ్రవాదం ఏ స్థాయిలో పాకిపోయాయో ఇందులో చూపించిన తీరుకు ప్రేక్షకులు షాక్ అయ్యారు. ముఖ్యంగా మేకవన్నె పులి క్యారెక్టర్ గుల్ఫామ్ హుసేన్ గా నసీరుద్దీన్ షా విశ్వరూపం ఇందులో చూడొచ్చు. అనుక్షణం దేశభద్రత కోసం ప్రాణాలకు సైతం తెగించే పాత్రలో అమీర్ ఖాన్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ముస్లిం పోలీస్ గా ముఖేష్ ఋషికి అదరగొట్టాడు అనే మాట చిన్నదే.

సర్ఫరోష్ లో ఎన్నో సీరియస్ అంశాలను టచ్ చేశారు జాన్. దీనికి బెస్ట్ పాపులర్ ఫిలిం విభాగంలో జాతీయ అవార్డు దక్కింది. జతిన్ లలిత్ సంగీతం మ్యూజికల్ గా పేరు తెచ్చింది. కమర్షియల్ గానూ ఈ మూవీ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. దీన్నే 2006లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో ‘అస్త్రం’గా రీమేక్ చేశారు. హీరోయిన్ అనుష్క శెట్టి కాగా విలన్ గా జాకీ శ్రోఫ్ నటించారు. ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం అందించారు. అమీర్ ఖాన్ చేసిన పాత్ర బరువుకు మంచు విష్ణు సరితూగలేకపోయాడు. దానికి తోడు ఒరిజినల్ వెర్షన్ లో ఇంటెన్సిటీ తెలుగుకు వచ్చేప్పటికి నేటివిటీ ఫ్యాక్టర్ వల్ల బాగా తగ్గిపోయింది. ఫలితంగా ఫ్లాప్ ముద్ర తప్పలేదు

Also Read :  వంశీ వండిన నవ్వుల వంటకం – Nostalgia