iDreamPost
iDreamPost
బాలీవుడ్ లో డైరెక్ట్ ఓటిటి రిలీజుల పర్వం కొనసాగుతూనే ఉంది. నిన్న భారీ అంచనాల మధ్య విక్కీ కౌషల్ నటించిన సర్దార్ ఉధమ్ అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ వచ్చాక దీని మీద భారీ హైప్ నెలకొంది. స్వతంత్రం రాక పూర్వం జరిగిన సంఘటనలు ఆధారంగా చేసుకుని దర్శకుడు సుజిత్ సిర్కార్ ఈ సినిమాను రూపొందించారు. గత ఏడాది అమితాబ్ బచ్చన్ గులాబో సితాబో తర్వాత ఈయనకిది రెండో ఓటిటి రిలీజ్. ముంబైతో సహా నార్త్ లో దాదాపు థియేటర్లన్నీ తెరుచుకున్న నేపథ్యంలో ఇలాంటి గ్రాండియర్ డిజిటల్ లో రావడం ట్రేడ్ ని నిరాశపరిచింది. ఇంతకీ ఉధమ్ సింగ్ మెప్పించాడా లేదా రిపోర్ట్ లో చూద్దాం
భగత్ సింగ్ శిష్యుడైన ఉధమ్ సింగ్(విక్కీ కౌషల్)భారతదేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా నిలిచిపోయిన 1919 జలియన్ వాలా బాగ్ ఊచకోతకు ప్రత్యక్ష సాక్షి. ఎలాగైనా దానికి కారణమైన జనరల్ మైకెల్ ఓ డయ్యర్(షౌన్ స్కాట్)ని అంతమొందించే లక్ష్యం పెట్టుకుంటాడు. కానీ అదంత సులువుగా ఉండదు. రెండు దశాబ్దాల తర్వాత లండన్ లో ఉన్న డయ్యర్ ను మట్టుబెట్టేందుకు ఉధమ్ సింగ్ పక్కా ప్రణాళికతో అక్కడికి చేరుకొని తన దేశభక్తిని ఎలా ఋజువు చేసుకున్నాడు అనేదే కథ. ఈ మధ్యలో అతను ఎదురుకున్న ఇబ్బందులు, చేసిన సాహసాలు, ప్రయాణంలో సవాళ్లు, ప్రమాదాలు లాంటివి సినిమాలోనే చూడాలి.
దర్శకుడు సుజిత్ సిర్కార్ గతంలో ఎన్ని సినిమాలు చేసినా ఈ ఉధమ్ సింగ్ స్క్రిప్ట్ కోసం 20 ఏళ్ళకు పైగా రీసర్చ్ చేశారట. ఆ కష్టం ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. విక్కీ కౌశల్ అద్భుతంగా నటించినప్పటికీ మొదటి గంటన్నర నెమ్మదిగా సాగడం ఇంపాక్ట్ ని తగ్గించింది. అన్ని విషయాలను డీటెయిల్డ్ గా చెప్పాలన్న సుజిత్ ప్రయత్నం ల్యాగ్ కు కారణం అయ్యింది. చివరి 55 నిముషాలు తనలోని బెస్ట్ టెక్నీషియన్ ని బయటికి తీశారు సుజిత్ సిర్కార్. దీని వల్లే సినిమా మీద ప్రతికూల అభిప్రాయం కలగకుండా కాపాడింది. జలవాలా బాగ్ ఉదంతంతో మొదలుపెట్టి క్లైమాక్స్ దాకా స్టన్నింగ్ విజువల్స్, అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించే ఆర్ట్ వర్క్ – టేకింగ్ కట్టిపడేస్తాయి. మొత్తానికి చాలా అరుదుగా వచ్చే ఇలాంటి ప్రయత్నాలు వచ్చింది ఓటిటిలోనే కాబట్టి చూడాల్సిన ఆప్షన్ గా పెట్టుకోవచ్చు
Also Read : Pelli SandaD Report : పెళ్లి సందD రిపోర్ట్