iDreamPost
android-app
ios-app

విరాటపర్వం సినిమా చూసి సరళ అన్నయ్య ఏమన్నాడు??

  • Published Jun 19, 2022 | 11:37 AM Updated Updated Jun 19, 2022 | 11:37 AM
విరాటపర్వం సినిమా చూసి సరళ అన్నయ్య ఏమన్నాడు??

రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విరాటపర్వం. జూన్ 17న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంటుంది. ఇక ఈ సినిమాని వరంగల్ కి చెందిన సరళ అనే ఓ మహిళ కథతో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇటీవల సాయి పల్లవి, రానా, చిత్ర యూనిట్ సరళ కుటుంబ సభ్యులని కలిశారు కూడా. తాజాగా సినిమా సక్సెస్ మీట్ నిర్వహించగా సరళ అన్నయ్య తూము మోహనరావు కూడా పాల్గొని సినిమా గురించి, తన చెల్లి సరళ గురించి మాట్లాడారు.

విరాటపర్వం సక్సెస్ మీట్ లో సరళ అన్నయ్య తూము మోహన్ రావు మాట్లాడుతూ… 30ఏళ్ల క్రితం జరిగిన సంఘటనని ఇలా సురేష్ ప్రొడక్షన్‌ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ గొప్ప చిత్రంగా నిర్మిస్తుందని ఊహించలేదు. డైరెక్టర్ వేణు ఊడుగుల కొన్ని నెలలు క్రితం నన్ను కలిసి ఈ సినిమా గురించి చెప్పారు. ఎలా చూపిస్తారో అనే భయం ఉండింది. కానీ వేణు గారు చెప్పిన తర్వాత కన్విన్సింగ్ గా అనిపించింది. ఇందులో రానా, సాయి పల్లవిలు నటిస్తున్నారు అని చెప్పినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. సినిమా ప్రివ్యూకి రమ్మని చాలా సార్లు అడిగారు. కానీ ఈ సినిమాని ప్రేక్షకుడిగానే అందరితో కలసి చూడాలనుందని చెప్పాను. సినిమా చూసిన తర్వాత మేము ఏం అనుకుంటున్నామో అదే తీశారు.

మా ఇంట్లో మొదట్నుంచి కమ్యునిస్ట్ వాతావరణం వుంది. మా చెల్లి విప్లవాన్ని ప్రేమించింది. తను స్టూడెంట్ ఆర్గనై జేషన్ లోకి వెళ్లడాన్ని మేము వారించాము. కానీ తను నక్సల్ లోకి వెళ్లిపోతుందని మేము అనుకోలేదు. దాన్ని ప్రేమించి, ఇష్టంతో వెళ్లింది. సినిమాలో రవన్న రచనలకు ప్రభావతమై వెళ్లినట్లు చూపించారు. రెండూ ఒక్కటే. ఆమె విప్లవాన్ని ప్రేమించింది. విప్లవం వల్లే చనిపోయింది. ఇందులో ఎవరినీ తప్పుపట్టలేము.

మా కుటుంబం అంతా కలసి సినిమా చూశాం. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు అని నా భార్య అడిగింది. ఎప్పుడూ వినని మ్యూజిక్ విరాటపర్వంలో వినిపించిదని చెప్పింది. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలికి కంగ్రాట్స్. మాకు తెలిసిన కథలో శంకరన్న పాత్ర నెగిటివ్. తన వల్ల చనిపోయింది కాబట్టి కోపం ఉండేది. కానీ రానా, సాయి పల్లవిని దర్శకుడు చూపించిన విధానం అద్భుతంగా ఉంది. సురేష్ ప్రొడక్షన్ లాంటి బ్యానర్‌లో ఇలాంటి కథని తీసుకొని ఒక ప్రయోగం చేయడమనేది చాలా గొప్ప విషయం. వారికి నా అభినందనలు అని తెలిపారు.