సంక్రాంతి పండుగ అంటేనే గోదావరి జిల్లాల్లో ఒక ఉత్సవంలా జరుగుతుంది. అటు తూర్పుగోదావరి ఇటు పశ్చిమగోదావరి జిల్లాలో పండగ ఈ ఏడాది కూడా అంబరాన్ని అంటింది. కొత్త అల్లుళ్ళు రాక.. పిండివంటల ఘుమఘుమలు తో గోదావరి జిల్లాలు కళకళలాడాయి. ప్రతి ఊరిలో వారివారి స్థాయికి తగ్గట్టుగా పండుగను కోలాహలంగా జరుపుకున్నారు. ప్రజాప్రతినిధులు సైతం.. సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. రంగు రంగుల ముగ్గులు… హుందాగా సాగిన సరదాల ఆటలతో పండగ అత్యంత ఉత్సాహం తో సాగింది. కరోనా పరిస్థితులను లెక్కచేయకుండా గ్రామాల్లో సంప్రదాయ క్రీడలు, సంక్రాంతి ఆటలు చక్కగా జరిగాయి. అన్ని ప్రాంతాల్లోనూ ఆయా ప్రజా ప్రతినిధులు పాల్గొని.. గ్రామీణులను సంక్రాంతి ఉత్సవాలను దగ్గరుండి ముందుకు నడిపించారు.
కోడి సై…!!
సంక్రాంతి పండుగ అంటేనే గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు పెట్టింది పేరు. ఈ సంవత్సరం సైతం కోడి పందాలు యధావిధిగా సాగాయి. సంప్రదాయం పేరుతో కోడి సై అంది. గోదావరి జిల్లాలో ప్రతి చోట పందెం బరీలు వెలిసాయి. పశ్చిమగోదావరి జిల్లా అయి భీమవరంలో గతంలో ఉన్న దగ్గరే పందెం బరి భారీగా వెలిసింది. అలాగే తూర్పుగోదావరి జిల్లా మండపేట లోనూ భారీగా పందెం బరులు వెలిసాయి. హైదరాబాద్తో పాటు ఇతర ప్రదేశాల నుంచి పందెంరాయుళ్లు… భారీగా తరలి వచ్చారు. ఎప్పటిలాగే కోడిపందెం బరిలో కోట్ల రూపాయలు పందేలు జరిగాయి. గోదావరి జిల్లాల్లో కోడి పందాలు ఒక సంప్రదాయంగా జరుగుతుండడంతో పోలీసులు సైతం ఈసారి వారిని ఏమాత్రం ఆటంకం కలిగించలేదు. పండగ మూడు రోజులు అధికారికంగానే అనుమతులు ఇవ్వడంతో పందెపురాయుళ్లు ఆనందంగా కోడి పందాల బరిలో కనిపించారు. గ్రామాల్లో పోలీసులు అధికారికంగానే ఈ మూడు రోజులు అనుమతులు ఇచ్చినట్లు చెప్పడంతో దాదాపు పశ్చిమగోదావరి జిల్లా అన్నిచోట్ల పందెపు బరిలు కనిపించాయి. చాలా చోట్ల ప్రజాప్రతినిధులు సైతం కోడి పందాల బరిలో కనిపించారు. గ్రామస్తులు ఉత్సాహపరుస్తూ వారు సైతం సంప్రదాయపు క్రీడలో ముందుకు సాగారు.