iDreamPost
android-app
ios-app

హీరోయిన్‌ అరెస్ట్‌, నెక్స్‌ట్‌ వికెట్‌ ఎవరిది?

హీరోయిన్‌ అరెస్ట్‌, నెక్స్‌ట్‌ వికెట్‌ ఎవరిది?

కన్నడ సినీ పరిశ్రమలో మరో హీరోయిన్‌ అరెస్టయ్యింది. ఈసారి తెలుగు సినీ ప్రేక్షకులకీ సుపరిచితురాలైన హీరోయిన్‌ అరెస్ట్‌ కావడం గమనార్హం. ఆమె ఎవరో కాదు, ‘బుజ్జిగాడు’ ఫేం సంజన. తెలుగులో పలు సినిమాల్లో నటించిన సంజనని ఈ రోజు ఉదయం డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, కొద్ది రోజుల క్రితం తనపై డ్రగ్స్‌ ఆరోపణలు రావడం బాధాకరమంటూ సంజన వ్యాఖ్యానించింది. తనకూ ఆ డ్రగ్స్‌ కేసుకీ సంబంధం లేదని చెప్పింది. అయితే. పక్కా ఆధారాలతోనే అధికారులు ఆమెను అరెస్ట్‌ చేసినట్లు కన్నడ సినీ మీడియా చెబుతోంది. ఇదిలా వుంటే, కన్నడ సినీ పరిశ్రమలోనే మరికొందరు సినీ ప్రముఖులు డ్రగ్స్‌ కేసుకి సంబంధించి అరెస్ట్‌ కాబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ లిస్ట్‌లో పలువురు హీరోల పేర్లూ వినిపిస్తున్నాయి. నటి సంజనకు అలాగే ఇప్పటికే అరెస్టయిన రాగిణి ద్వివేదీకి సినీ పరిశ్రమలో ఎవరు అత్యంత సన్నిహితులు.? అన్న దిశగా అధికారులు ఆరా తీస్తున్నారట. మరోపక్క, తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లోనూ సంజన సినిమాలు చేయడంతో, ఆయా సినీ పరిశ్రమల్లోనూ డ్రగ్స్‌కి సంబంధించి విచారణ జరుగుతుందా.? అన్న అనుమానాలూ విన్పిస్తున్నాయి. అయితే, అరెస్టయినవారంతా నేరస్తులని ఇప్పుడే చెప్పేయలేం. ఆయా వ్యక్తులు దోషులా.? కాదా.? అన్నది న్యాయస్థానాలు తేల్చాల్సి వుంది. ‘న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం వుంది..’ అంటూ అటు రాగిణి కుటుంబ సభ్యులు, ఇటు సంజన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సంజన సోదరి నిక్కీ గల్రాని కూడా కన్నడ, తమిళ సినీ పరిశ్రమల్లో పలు సినిమాలు చేసిన విషయం విదితమే.