iDreamPost
android-app
ios-app

శివరాత్రికి బయటపడని సంగమేశ్వరుడు… కరువు లేదని అభయమిస్తున్న సంగమేశ్వరుడు

  • Published Feb 21, 2020 | 6:41 AM Updated Updated Feb 21, 2020 | 6:41 AM
శివరాత్రికి బయటపడని సంగమేశ్వరుడు… కరువు లేదని అభయమిస్తున్న సంగమేశ్వరుడు

శివరాత్రికి శ్రీశైలం దారుల్ని ముఖ్యంగా నలమల అడవి మార్గాలు భక్తుల శివన్నామస్మరణలతో హోరెత్తుతున్నాయి. కర్ణాటక,మహబూబ్ నగర్,అనంతపురం,కర్నూల్ జిల్లాల్ నుంచి కాలినడకన అడవి బాటన వేలమంది భక్తులు శ్రీశైలానికి వెళుతుంటారు. బాట వెంట అన్నదానం,మజ్జిగ లతో పాటు కాళ్ళ బొబ్బలకు ఆయిట్మెంట్ ,నొప్పులకు మందులు కూడా ఇస్తుంటారు. వందల కి.మీ దూరం నుంచి నడిచి వచ్చే కన్నడ భక్తులను చూస్తే ఆశ్చర్యమనిపిస్తుంది…

భక్తులకు శివరాత్రి ఉత్సాహాన్ని ఇస్తే రైతులు సంగమేశ్వర గుడి వైపు చూస్తారు… శ్రీశైలం డ్యామ్ కట్టటం వలన సంగమేశ్వర గుడి బ్యాక్ వాటర్స్ లో మునిగిపోయింది. మహబూబ్ నగర్ లోని సోమశిల నుంచి ,ఆంధ్రలోని నందికొట్కూరు ప్రాంతంలోని ముచ్చుమర్రి నుంచి పడవల మీద సంగమేశ్వర గుడికి వెళ్లవచ్చు. కర్నూల్ జిల్లా ఆత్మకూర్ నుంచి రోడ్డు మార్గంలో సంగమేశ్వర గుడికి వెళ్ళవచ్చు.

వర్షాలు బాగా పడితే సాధారణంగా ఆగస్టు నెలలో సంగమేశ్వర గుడి కృష్ణా నీటిలో పూర్తిగా మునిగిపోతుంది. నీటి అవసరాలు, వినియోగంనుబట్టి సంక్రాతి వరకు నీటిలో ఉన్న సంగమేశ్వర గుడి కొంచం కొంచం బయటపడుతూ ఫిబ్రవరి చివరికి పూర్తిగా బయటపడుతుంది. సంగమేశ్వర గుడి మునగటం ఆలస్యం అయినా లేదా జనవరి చివరికి,ఫిబ్రవరి మొదటి వారానికి బయట పడినా ఆ సంవత్సరం నీటికి ఇబ్బందే.

ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఎంత ప్రాంతం ముంపుకు గురవుతుంది?డ్యాములో ఎన్ని అడుగుల నీటిలో నీరు నిలువ ఉంటే ముంపు ప్రాతంలో ఎక్కడి వరకు మునిగిపోతుందన్న లెక్కలు వేస్తారు. కర్నూల్ జిల్లా రైతులు మాత్రం సంగమేశ్వర గుడి ముంపును బట్టి ఆ యేడు పంటలకు నీరు ఏమాత్రం దక్కుతుందో లెక్కలు వేస్తారు .

శ్రీశైలంలో 830 అడుగులలో నీళ్లు ఉంటే నీరు క్రస్ట్ గేట్లను తాకుతుంది. సంగమేశ్వర గుడి సమీపంలోని భీమా లింగం మునగటం మొదలవుతుంది. శ్రీశైలం డ్యాములో నీరు 838 అడుగులకు చేరుకుంటే నీరు సంగమేశ్వర గర్భాలయంలోకి చేరుతుంది.860 అడుగులలో నీరు ఉంటె గోపురం మాత్రమే కనిస్తుంది,గుడి మొత్తం నీట మునుగుతుంది. 865 అడుగులలో నీరు ఉంటె గుడి సంపూర్ణంగా మునిగిపోతుంది. ప్రస్తుతం 863 అడుగుల నీరు ఉంది,రెండు రోజుల కిందట గోపురం బయటపడింది. గడిచిన మూడు నాలుగు సంవత్సరాలలో ఫిబ్రవరి మొదటి వారానికే గోపురం బయట పడింది. మూడువారానికి గుడి ఆవరణం కనిపించేది. మార్చ్ మొదటికి భీమా లింగానికి పూజలు జరిగేవి. ఈ లెక్కల ప్రకారం ఈ ఏడు గత సంవత్సరాల కన్నా ఎక్కువ నీటి లభ్యత ఎక్కువే.

శ్రీశైలంలో 117 టీఎంసీల నీరు ఉంది. రోజు సగటున 20,000 క్యూసెక్కులు అంటే 1.73 టీఎంసీ ల నీటిని వదులుతున్నారు.
నాగార్జున సాగర్ లో 201 టీఎంసీల నీరు ఉంది. పై నుంచి అంటే శ్రీశైలం నుంచి వచ్చిన 18,790 కుసెక్కులను కాలువలకు వదులుతున్నారు.
పులిచింతలలో 21 టీఎంసీ లా నీరు ఉంది. రోజు సగటున 2,500 క్యూసెక్కులు నీటిని కిందికి వదులుతున్నారు.
ప్రకాశం బ్యారేజిలో 2. టీఎంసీల నీరు ఉంది(దాదాపు నిండుగా ఉన్నట్లే). పై నుంచి 4,300 క్యూసెక్కుల నీరు వస్తుండగా 3,190 కుసెక్కులను కాలువలకు వదులుతున్నారు.

బ్రహ్మం సాగర్ తప్ప మిగిలిన రాయలసీమ ప్రాజెక్టులలో కూడా 65 నుంచి 70% నీళ్లు ఉన్నాయి. సోమశిల,కండలేరు లలో కలిపి 90టీఎంసీ ల నీరు ఉంది. సీజనల్ లెక్కల ప్రకారం రాష్ట్రం మొత్తం సంవృద్దిగానే నీరు ఉన్నట్లు.

శ్రీశైలం నుంచి నీటి దిగువకు వదులుతున్న నీటిని కొంచం తగ్గించాలి,సాగర్,పులిచింతలలో ఉన్న నీటి లెక్కల ప్రకారం రోజుకు 10,000 క్యూసెక్కుల కన్నా ఎక్కువ నీరు వదలవలసిన అవసరం లేదు. ఇలా చేస్తే సంగమేశ్వర గుడి పూర్తిగా బయటపడటానికి మరో నెల పడుతుంది.

శ్రీశైలం డ్యాము ఎండిపోయి నీరు పచ్చగా మారితే అదో అద్భుతంగా ప్రచారం జరిగింది. బ్రహ్మంగారు చెప్పినట్లు శ్రీశైలంలో పచ్చబండ బయటపడటం అంటే మరో క్షామం వచ్చినట్లే… అది కాలజ్ఞానం కాదు వాస్తవ నీటి లెక్క.సంగమేశ్వర నీటిలో ముంగి ఉంటే అందరికి సంతోషమే.. సంగమేశ్వర గుడి ముందుగానే బయటపడింది అంటే ఉభయ రాష్ట్రాల కరువుకు ముఖ్యంగా “రాయలసీమ” కరువుకు సూచన …

ఈ సంవత్సరం సగటు వర్షపాతం నమోదయినా చాలు అన్నిప్రాంతాలలో రెండుపంటలకు నీరు దక్కుతుంది. ప్రభుత్వం మొదలు పెడుతున్న కొత్త ప్రాజెక్టులు,కాలువల వెడల్పు పనులు సకాలంలో పూర్తి అయితే ముఖ్యమంత్రి ప్రణాళిక ప్రకారం 40 రోజుల్లోనే వరద నీటితో ప్రాజెక్టులు నింపుకోగలిగితే సంగమేశ్వరుడు గోపురం వైపో అదేపనిగా ఆకాశం వైపు చూసే అవసరం ఉండదు.