iDreamPost
android-app
ios-app

మిస్సైల్ ప్రయోగం.. ప్రత్యర్థి దేశాలకు రష్యా వార్నింగ్

మిస్సైల్ ప్రయోగం.. ప్రత్యర్థి దేశాలకు రష్యా వార్నింగ్

ప్రత్యర్థి దేశాలకు రష్యా స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. అన్ని దేశాలు ఒకటైనా ఏమాత్రం తగ్గేదేలే అని ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంటున్నారు. రష్యాతో పెట్టుకుంటే మటాషే అన్నట్టుగా సంకేతాలు పంపుతున్నారు. రష్యా ఏ బెదిరింపులకు లొంగే రకం కాదంటున్నాడు. తాము భయపడే రకం కాదు.. భయపెట్టే రకం అంటున్నాడు. రష్యాతో కయ్యానికి దిగే ముందు ఆలోచించుకుని దిగాలని సున్నితంగా హెచ్చరిస్తున్నాడు.

అందులోభాగంగానే ప్రపంచ దేశాలను కవ్వించే ప్రయత్నంలో అత్యంత శక్తివంతమైన క్షిపణిని ప్రయోగించాడు. అణ్వాయుధాలను మోసుకెళ్లే సర్మత్ ఖండాంతర క్షిపణిని తొలిసారి ప్రయోగించింది రష్యా.. ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పాశ్చాత్య దేశాలకు పుతిన్ ఈ క్షిపణి ప్రయోగం ద్వారా భయపెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్షిపణి ప్రయోగం తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ తమను ఎవరూ భయపెట్టలేరని సంకేతాలు ఇచ్చారు. సర్మత్‌ క్షిపణిని (Sarmat superheavy intercontinental ballistic missile).. సాటాన్2గా పాశ్చాత్య దేశ విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా మలితరం క్షిపణిగా చెబుతున్నారు.

అందుకే కాబోలు.. పుతిన్ ఇన్విన్సిబుల్ అంటున్నారు. గతంలోనూ రష్యా ఇదేతరహా కింజల్, అవన్‌గార్డ్ హైపర్ సానిక్ క్షిపణులను ఎన్నో ప్రయోగించింది. ఉక్రెయిన్‌పై దాడుల జరుగుతున్న సమయంలోనే రష్యా కింజల్ క్షిపణిని ఫస్ట్ టైం ప్రయోగించింది. ఈ క్షిపణిని ప్రయోగించేందుకు ప్రత్యేకించి తమ బలగాలకు ట్రైనింగ్ కూడా ఇచ్చింది. సర్మత్ క్షిపణి ప్రయోగం విజయవంతం అనంతరం దాన్ని రూపొందించిన శాస్త్రవేత్తలను పుతిన్ అభినందించారు. అందులో భాగంగానే పుతిన్ పైవిధంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

రష్యా ప్రయోగించిన ఈ ఖండాతర క్షిపణి అత్యంత శక్తివంతమైన మిస్సైల్‌. రష్యా చేతిలో ఇదో బ్రహ్మస్త్రం. రష్యా రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయగలదన్నారు. రష్యాపై ఎవరైనా దాడులు చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని శత్రువులకు పుతిన్ హెచ్చరికలు పంపారు. ఉత్తర రష్యాలోని ప్లెస్‌ట్స్‌క్‌ కాస్మోడ్రోమ్ వేదికగా రష్యా బాలాస్టిక్ మిస్సైల్‌ను ప్రయోగించారు. ఈ క్షిపణి వార్‌హెడ్స్‌ను తూర్పు రష్యా ప్రాంతంలోని కామ్‌చత్కా పెనిన్‌సులాకు చేరవేసింది.

సర్మత్ (Sarmat superheavy) అనే ఈ క్షిపణిని భూభాగంపై ఎలాంటి లక్ష్యమైనా క్షణాల వ్యవధిలో చేధించగలదని రష్యా రక్షణ వ్యవస్థ చెబుతోంది. ఈ ప్రయోగంతో రష్యా అణ్వాయుధ వ్యవస్థ మరింత శక్తివంతమైనదిగా పుతిన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సర్మత్ క్షిపణిని శత్రు దేశాలు పసిగట్టడం అంత తేలిక కాదంటున్నారు. 200 టన్నుల బరువైన ఈ సర్మత్ క్షిపణి భూమిపై ఎలాంటి లక్ష్యాన్ని అయినా క్షణాల్లో నేలమట్టం చేయగల సామర్థ్యం ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు.