iDreamPost
iDreamPost
ఉక్రెయిన్ పై దీర్ఘకాలిక పోరు సాగిస్తున్న రష్యాను కట్టడి చేయడమెలా? ఐరోపా దేశాలు ఆంక్షలన్నాయి. ఈ యేడాది చివరి నాటికి లీటర్ చమురు కూడా కొనమన్నాయి. రష్యా ఏం చేయాలి? సముద్ర మార్గంలో చమురు సరఫరాకు కావాల్సిన ట్యాంకర్లున్నాయి. రేటుకూడా తగ్గించింది. అంతే, చమురు దిగుమతులమీద ఆధారపడే చైనా, భారత్ లు రష్యాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.
రష్యా చమురు ఎగుమతుల్లో సగం, ఆసియాకు వస్తోంది. అందులోనూ ముఖ్యంగా చైనా, ఇండియాలకే. మే నెలనాటికే సౌది అరేబియాను దాటి భారతదేశానికి రెండో అతిపెద్ద చమురు ఎగుమతి దేశంగా రష్యా అవకాశం కొట్టేసింది. రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధాన్ని ఇండియా మంచి అవకాశంగా తీసుకుంది. ఎప్రిల్ లో పోలిస్తే, మేలో ముడింతలు ఎక్కువగా చమురును దిగుమతి చేసుకుంది. అందులోనూ తక్కువ రేటుకే.
రోజుకు 3.55 మిలియన్ బ్యారెర్స్ మేర ముడిచమురును రష్యా ఎగుమతి చేస్తోంది.అందులో 50శాతం ఆయుల్ ను మోసుకొంటూ భారీ నౌకలు ఆసియా వైపు కదులుతున్నాయి. అందులో 40శాతం మేర ఇండియాకు వస్తున్నాయి. చైనాకూడా రష్యా నుంచి ముడిచమురును దిగుమతి చేసుకొంటున్నా, ఆ మొత్తం దాదాపుగా ఒకేలా ఉంది. ఇండియా దిగుమతులు మాత్రం 1శాతం నుంచి 18శాతానికి ఎగబాకాయి.
ఎప్రిల్ వరకు ఇరాక్, సౌది ఆరేబియా నుంచే చమురును ఇండియా ఎక్కువగా దిగుమతి చేసుకొనేది. ఎప్రిల్ లో రష్యా నుంచి వచ్చే చమురు 2,27,000 బ్యారెల్స్ మాత్రమే. అదే మే నాటికి దాదాపు నాలుగింతలైంది. ఇప్పుడు 8,19,000 బ్యారెల్స్ ను దిగుమతి చేసుకొంటోంది. ఇండియాకెందుకంత దూకుడు? రీజన్ ముడి చమురు రేటు.
అమెరికా మొదలు ఐరోపో వరకు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఈలోగా చమురు రేట్లు కూడా పెరిగాయి. అప్పుడే రష్యా వ్యూహం మార్చింది. భారీగా డిస్కౌంట్లనిచ్చింది. అందుకే ఇండియా త్వరపడింది.
రేట్లు తక్కువని, ఇండియా భారీగా రష్యా చమురును దిగుమతి చేసుకోవడాన్ని అంతర్జాతీయ సమాజం నిశితంగా పరిశీలిస్తోంది. ఈయేడాది చివరినాటికి రష్యా చమురు దిగుమతులను 90శాతం మేర తగ్గించుకోవాలన్నది యూరోపియన్ దేశాల పంతం. ఐరోపా, అమెరికా ఒక్కటై రష్యాను కాళ్లబేరానికి తీసుకొనిరావాలని ప్రయత్నిస్తుంటే, ఆ దేశం నుంచి ఇండియా చమురును భారీగా దిగుమతి చేసుకోవడమేంటి? అమెరికా, దాని మిత్ర దేశాలు ఏమంటున్నాయి? రష్యా చమురును కొనద్దని అమెరికా ప్రత్యేక రాయబారి భారతేదశాన్ని అభ్యర్ధించారుకూడా.
ఇదే సమయంలో ఉక్రెయిన్ పై రష్యా దాడిని అటు ఇండియా, ఇటు చైనా నిరసించలేదు. రష్యాపై ఆంక్షలను చైనా విమర్శించింది కూడా.