Rorschach ఊరిస్తున్న మరో మలయాళం రీమేక్

కథల విషయంలో మన స్టార్లు పెద్దగా రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడటం లేదు. సేఫ్ గేమ్ కోసం రీమేకులు చేసుకుంటే అటు బడ్జెట్ మిగలడంతో పాటు రిజల్ట్ గ్యారెంటీకి ఎక్కువ అవకాశాలు ఉండటంతో అటువైపే మొగ్గు చూపుతున్నారు. పవన్ కళ్యాణ్ గత ఏడాది వకీల్ సాబ్ తో, ఈ సంవత్సరం భీమ్లా నాయక్ తో నిర్మాతలకు కోట్లలో భారం కాని సినిమాలు చేసి గట్టెక్కారు. తాజాగా గాడ్ ఫాదర్ రూపంలో చిరంజీవి అందుకున్న సక్సెస్ సైతం కేరళ నుంచి తీసుకొచ్చిన లూసిఫరే. ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం వచ్చిన పెద్దరికంతో మొదలుపెడితే ఇప్పటిదాకా ఎన్ని వచ్చాయో లెక్కబెట్టడం కష్టమే. తాజాగా మరో రీమేక్ మీద మనవాళ్ళు మనసు పడేలా ఉన్నారు.

మల్లువుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన రోర్సాచ్ ఇటీవలే విడుదలై ఘనవిజయం సాధించింది. వారం దాటకుండానే వంద కోట్ల‌ గ్రాస్ వైపు పరుగులు పెడుతోంది. అలా అని ఇదేం కమర్షియల్ ఎంటర్ టైనర్ కాదు. పూర్తిగా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన సైకలాజికల్ థ్రిల్లర్. విదేశాల నుంచి వచ్చిన హీరో భార్యతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా యాక్సిడెంట్ జరుగుతుంది. స్పృహ వచ్చి చూశాక పక్కన ఆమె ఉండదు. దీంతో ప్రమాదం జరిగిన అటవీ ప్రాంతంలో ఉండే పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లయింట్ ఇస్తాడు. ఆ తర్వాతే మొదలవుతుంది అసలు కథ. ముందు అతని ఉద్దేశమేంటో అర్థం కాదు. తర్వాత ఎన్నో షాకింగ్ సంఘటనలు జరుగుతాయి.

లైన్ మరీ కొత్తది కాకపోయినా దర్శకుడు నిసం బషీర్ ట్రీట్మెంట్ చాలా ఫ్రెష్ గా థ్రిల్లింగ్ గా తీర్చిదిద్దడంతో రోర్సాచ్ ఈ జానర్ ని ఇష్టపడే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. సాంకేతిక విభాగాలు కూడా పోటీ పడి పని చేశాయి. కాకపోతే ఇది మమ్ముట్టి చేశాడు కాబట్టి స్టార్ అట్రాక్షన్ వచ్చి ఇంత గొప్ప సక్సెస్ అందుకుంది కానీ మనదగ్గర ఇలాంటి కథలను సీనియర్లు ఒప్పుకోవడం కష్టమే. ఎలాగూ ప్రయోగాలకు ఎప్పుడూ ఎస్ చెప్పే నాగార్జున ఉన్నాడు కనక తను ట్రై చేస్తే బాగానే ఉంటుంది. అన్నట్టు ఈ రోర్సాచ్ ఫలితం తెలియగానే టాలీవుడ్ నిర్మాతలు కొందరు ఆల్రెడీ రిమేక్ రైట్స్ కోసం ఒరిజినల్ వెర్షన్ ప్రొడ్యూసర్లతో సంప్రదింపులు మొదలుపెట్టారట.

Show comments