Romantic : రొమాంటిక్ సినిమా రిపోర్ట్

నిన్న వరుడు కావలెనుతో పాటు విడుదలైన ఆకాష్ పూరి రొమాంటిక్ కి గత పది రోజులుగా ఏ రేంజ్ లో ప్రమోషన్లు చేశారో చూశాం. ఏకంగా ప్రభాస్ తో వీడియో ఇంటర్వ్యూలు చేయించి మరీ బజ్ తీసుకొచ్చారు. పూరి జగన్నాధ్ రచనలో ఆయన శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహించిన ఈ యూత్ ఎంటర్ టైనర్ లో కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. విపరీతమైన జాప్యం వల్ల మొదట్లో పెద్దగా అంచనాలు లేకపోయినా క్రమంగా ఓ వర్గంలో దీని మీద ఆసక్తి పెరుగుతూ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంతలో ఓపెనింగ్స్ మెరుగ్గా దీనికే రావడం గమనార్హం. మరి ఇదెలా ఉందో చిన్న రిపోర్ట్ లో చూద్దాం.

ఇది పూరి మార్కు అరిగేసి తిరగేసి మడతేసి వాడేసిన కథ. తన పాత హిట్లన్నీ కలిపి మిక్సీ చేసుకుని వండిన స్టోరీ. గోవా మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. లార్డ్ రోడ్రిగో ముఠాలో చేరిన వాస్కోడిగామా(ఆకాష్ పూరి)కి అక్కడి నేర సామ్రాజ్యంలో తనే రాజు కావాలనే లక్ష్యం ఉంటుంది. ఈ క్రమంలోనే ఏకంగా బాసునే చంపేస్తాడు. దెబ్బకు కింగ్ మేకర్ గా ప్రకటించేసుకుంటాడు. కామమో ప్రేమో తెలియని ఉద్రేకంలో మోనికా(కేతిక శర్మ)ని ప్రేమిస్తాడు. వాస్కోడిగామా ఆట కట్టించేందుకు ముంబై నుంచి గోవాకు ఏసిపి రమ్య(రమ్యకృష్ణ) రంగంలోకి దిగుతుంది. అక్కడి నుంచి వేట షురూ. ఫైనల్ గా ఏం జరిగిందో తెరమీద చూడాలి.

యూత్ కి భలే అనిపించే నాలుగు డైలాగులు, శృతి మించిన హీరోయిజం, కావాలని రాసుకున్న లస్ట్ సీన్లు ఉంటే చాలు నాలుగు డబ్బులు వచ్చేస్తాయనే ఆలోచనలో రొమాంటిక్ తీసినట్టు కనిపిస్తుంది. హీరో పలు ఇంటర్వ్యూలలో చెప్పుకున్నట్టు ఇడియట్, పోకిరి రేంజ్ లో పావు వంతు కాదు కదా ఇది కనీసం ఇంచు కూడా లేదు. ఎక్కడిక్కడ సన్నివేశాలను పేర్చుకుంటూ పోతూ ఇష్టం వచ్చినట్టు తీశారు తప్ప ప్రాపర్ రైటింగ్ అనేది అంతగా అనిపించదు. ఆకాష్ వయసుకు మించి ఇంత ఓవర్ డోస్ క్యారెక్టర్ కొడుక్కు ఎందుకు రాసుకున్నారో అర్థం కాదు. ఇస్మార్ట్ శంకర్ హ్యాంగోవర్ తాలూకు ప్రభావం కావొచ్చు. పేరుకి అనిల్ దర్శకుడే కానీ అడుగడుగునా పూరి మార్కు స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. ఆయన వీరాభిమానులు అయితే తప్ప రొమాంటిక్ ని తట్టుకోవడం అంత సులభం కాదు

Also Read : Varudu Kavalenu Review : వరుడు కావలెను రివ్యూ

Show comments