iDreamPost
android-app
ios-app

దక్షిణ ధృవ అన్వేషణ – ఒక విజయం, ఒక విషాదం

దక్షిణ ధృవ అన్వేషణ – ఒక విజయం, ఒక విషాదం

డిసెంబర్ 14,1911 న నార్వే దేశానికి చెందిన రోనాల్డ్ అముండ్సేన్ దక్షిణ ధృవం చేరుకుని తన దేశానికే చెందిన పతాకం ఎగురవేయడంతో భూమి మీద అప్పటివరకూ ఎవరూ చేరుకోలేని ఆఖరి ప్రాంతాన్ని కూడా మనిషి జయించినట్టు అయింది. అయితే అదే సమయంలో, దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొదటి వ్యక్తిగా రికార్డు సాధించాలని ప్రయాణం మొదలుపెట్టిన మరో బృందం అంటార్కిటికా ఖండం మీద చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతూ దక్షిణ ధృవం వైపు ప్రయాణం సాగిస్తూ ఉందన్న విషయం అముండ్సేన్ కి తెలియదు.

దక్షిణ ధృవాన్ని చేరడంలో పోటీ

ఇరవయ్యవ శతాబ్దం మొదటికి భూమి మీద ఉన్న అన్ని ఖండాలతో పాటు ఉత్తర సముద్రంలో ఉన్న ఉత్తర ధృవాన్ని కూడా మనిషి చేరడంతో ఉత్సాహవంతులైన అన్వేషకులకీ, సాహసికులకీ మిగిలింది అంటార్కిటికా ఖంఢంలోని దక్షిణ ధృవం. అంటార్కిటికా ఖంఢం మీద కొంత భాగం అన్వేషించినా దక్షిణ ధృవాన్ని ఎవరూ చేరుకోలేక పోయారు. అతి శీతల ఉష్ణోగ్రతలతో పాటు, విపరీతమైన వాతావరణం అందుకు కారణం. చాలా జట్లు దక్షిణ ధృవాన్ని చేరాలని బయలుదేరి మధ్యలో వెనక్కి వచ్చేశాయి. ఈ ప్రయత్నంలో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు.

1910లో నార్వే దేశానికి చెందిన రోనాల్డ్ అముండ్సేన్, ఇంగ్లాండుకి చెందిన రాబర్ట్ ఫాల్కన్ స్కాట్ ఇంచుమించు ఒకే సమయంలో దక్షిణ ధృవాన్ని చేరుకోవడానికి తమ ప్రణాళిక బయట పెట్టడంతో వార్తాపత్రికలు దక్షిణ ధృవం వైపు పోటీ అని ప్రచారం చేశాయి. దీంతో ఇద్దరు అన్వేషకుల మధ్య పోటీ మొదలైంది. జట్టులో సభ్యులను ఎంచుకోవడం, ప్రయాణానికి అవసరమైన డబ్బును, వస్తువులను సమకూర్చుకోవడం పూర్తి చేసుకుని రెండు జట్లు రెండు వేర్వేరు మార్గాల్లో దక్షిణ ధృవం వైపు తమ ప్రయాణం మొదలు పెట్టారు.

1911 మొదటి కంతా ఇరుజట్లు అంటార్కిటికా ఖండాన్ని చేరుకుని బేస్ క్యాంపులు ఏర్పరచుకుని తమ మార్గంలో అక్కడక్కడా తిరుగు ప్రయాణంలో తమకు అవసరమౌతాయని ఆహార పదార్థాల నిల్వలు ఏర్పాటు చేసి వాతావరణం అనుకూలంగా మారితే ధృవం వైపు ప్రయాణం చేయడానికి వేచిచూడసాగారు.

భయంకరమైన అంటార్కిటికా శీతాకాలం ముగిశాక సెప్టెంబరు మాసంలో అముండ్సేన్ జట్టు ధృవం చేరే ప్రయత్నం చేసినా కొంతదూరం పోయాక వెనుదిరగవలసి వచ్చింది. అక్టోబరు 20న పరిస్థితులు మెరుగవడంతో అయిదు మంది సభ్యులు ఉన్న అముండ్సేన్ జట్టు దక్షిణ ధృవం వైపు ప్రయాణం మొదలుపెట్టింది. డిసెంబర్ 14న దక్షిణ ధృవాన్ని చేరిన ఆ జట్టు అక్కడ నార్వే జాతీయ పతాకాన్ని నాటి, తమ విజయాన్ని సిగార్లు కాల్చి సెలబ్రేట్ చేసుకుని, ఫోటోలు దిగి బేస్ క్యాంపుకి తిరిగి వచ్చింది.

రాబర్ట్ స్కాట్ నాయకత్వంలోని బ్రిటిష్ జట్టు తమ బేస్ క్యాంపునుంచి నవంబర్ 1న తమ ప్రయాణం మొదలుపెట్టారు. అయితే స్కాట్ ప్రయాణం అంత సాఫీగా జరగలేదు. సరుకులు మోయడానికి తెచ్చుకున్న గుర్రాలు చనిపోయాయి. కుక్కలను వెనక్కి పంపాల్సి వచ్చింది. మోటారు బండ్లు పనిచేయకుండా పోయాయి. దాంతో బ్రందంలో సభ్యులు తమ వస్తువులను చేతితో లాక్కుంటూ అతికష్టం మీద జనవరి 17,1912న దక్షిణ ధృవాన్ని చేరుకుని అక్కడ ఎగురుతున్న నార్వే పతాకం చూసి ఒక్కసారిగా నీరసపడిపోయారు.

తమ తిరుగు ప్రయాణంలో మంచు తుఫానులో చిక్కుకుని ఒకరు మరణించారు. మరొక సభ్యుడు ఫ్రాస్ట్ బైట్ బారినపడి కాళ్ళు పుండ్లు అయ్యాయి. తన వల్ల మిగిలిన జట్టు వేగంగా ప్రయాణించలేకపోతుందని అలా అయితే అందరి ప్రాణాలకు ప్రమాదమని భావించిన లారెన్స్ ఓట్స్ మిగిలిన ముగ్గురికీ వీడ్కోలు చెప్పి మృత్యువుని వెతుక్కుంటూ గుడారం బయటకు నడుచుకుంటూ వెళ్లిపోయాడు.

స్కాట్ తో సహా మిగిలిన ముగ్గురు కొద్ది రోజుల తర్వాత మార్చి 29,1912న తమ బేస్ క్యాంపునుంచి పదకొండు కిలోమీటర్ల దూరంలో మంచు తుపానులో చిక్కుకుని మరణించారు. వీరి శవాలు, డైరీలు, కెమెరాలను 1912 నవంబరులో మరొక జట్టు గుర్తించింది.

అముండ్సేన్ జట్టు విజయానికి కారణాలు

దక్షిణ ధృవం నుంచి అముండ్సేన్ ఏర్పాటు చేసుకున్న బేస్ క్యాంపు స్కాట్ బృందం ఏర్పాటు చేసుకున్న క్యాంపు కన్నా 95 కిలోమీటర్లు దగ్గరగా ఉంది. అముండ్సేన్ సరకులు మోయడానికి కుక్కలు లాగే బండ్లు తెచ్చుకున్నాడు. ఈ కుక్కలు మధ్యలో చనిపోతే వాటిని చంపి ఆహారంగా కూడా వాడుకున్నారు. స్కాట్ బృందం మోటారు బండ్లు, గుర్రాలు, కుక్కలను తెచ్చుకుంటే బండ్లు ఆ వాతావరణంలో పని చేయడం మానేశాయి. గుర్రాలు మరణిస్తే వాటిని పూడ్చిపెట్టారు. కుక్కలను వెనక్కి పంపివేసి, సామాను మొత్తాన్ని సభ్యులు లాక్కుపోవలసి వచ్చింది. స్కాట్ బృందం దక్షిణ ధృవాన్ని చేరుకోవడంతో పాటు అంటార్కిటికా ఖండంలో కొన్ని ప్రయోగాలు చేసి, సమాచారం సేకరించడం కూడా లక్ష్యంగా పెట్టుకుని వచ్చింది. అముండ్సేన్ జట్టుకి దక్షిణ ధృవం చేరుకోవడం ఒకటే లక్ష్యం. “సైన్సు సంగతి సైంటిస్టులు చూసుకుంటారు. నాకేం సంబంధం” అన్నది అముండ్సేన్ విధానం.

విజయవంతంగా తిరిగి వచ్చిన రోవాల్డ్ అముండ్సేన్ రాత్రికిరాత్రి సెలబ్రిటి అయ్యాడు. అమెరికా ప్రెసిడెంట్, బ్రిటిష్ రాణి ఫోన్లు చేసి శుభాకాంక్షలు చెప్పారు. రాబర్ట్ స్కాట్ బృందం తాలూకు శవాలు, డైరీలు బయట పడ్డాక రాబర్ట్ స్కాట్ కూడా హీరో అయ్యాడు. బ్రిటిష్ ప్రభుత్వం నైట్ హుడ్ ఇచ్చింది. అముండ్సేన్ ఆ తర్వాత షిప్పింగ్ కంపెనీ పెట్టాడు. ఎయిర్ షిప్పులో దక్షిణ ధృవం మీదుగా గగనంలో ప్రయాణం చేసిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పే ప్రయత్నం చేస్తే, అంతకు మూడు రోజుల ముందే రిచర్డ్ బైర్డ్ అనే వ్యక్తి అ రికార్డు సాధించాడు. 1928లో నార్వే దగ్గర ఎయిర్ షిప్ కూలిపోయి సముద్రంలో చిక్కుకున్న ఒక సాహసికుడిని కాపాడే ప్రయత్నంలో మరణించాడు రోవాల్డ్ అముండ్సేన్.