iDreamPost
iDreamPost
‘అధిష్టానం ఎవరికి ఏమి చెప్పిందో తెలీదుకానీ వివాదం సద్దుమణిగింది’ .. ఇది తాజాగా కన్నా లక్ష్మీనారాయణ-విజయసాయిరెడ్డి మధ్య జరిగిన ఆరోపణలు, ప్రత్యారోపణల గురించి ఎల్లోమీడియాలో వచ్చిన ఓ వ్యాఖ్య. ప్రతి ఆదివారం ఎల్లోమీడియాలో వచ్చే కొత్తపలుకులో మీడియా యాజమాని వేమూరి రాధాకృష్ణ బిజెపి-విజయసాయిరెడ్డి మధ్య జరిగిన మాటల యుద్ధం గురించి సవివరంగా ప్రస్తావించాడు. జరిగిన సంఘటనల ఆధారంగా చూస్తే బిజెపి అదిష్టానానికి పార్టీ నేతలకన్నా తానే దగ్గరనేట్లుగా విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్నాడంటూ తెగ బాధపడిపోయాడు.
సరే వేమూరి బాధగురించి పక్కన పెట్టేస్తే కరోనా వైరస్ పరీక్షల నిర్ధారణ కోసం ప్రభుత్వం తెప్పించిన ర్యాపిడ్ టెస్టు కిట్ల కొనుగోలులో అవినీతి జరిగిందని కన్నా ఆరోపించాడు. దానికి విజయసాయి కౌంటర్ గా చంద్రబాబునాయుడు దగ్గర రూ. 20 కోట్లు తీసుకుని ప్రభుత్వంపై కన్నా ఆరోపణలు చేస్తున్నాడంటూ మండిపడ్డాడు. ఇదే విషయమై రెండు రోజుల పాటు ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది.
ఆ తర్వాత బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా పార్టీ ఎంపిలు, రాష్ట్రాల అధ్యక్షులతో వీడియా కాన్ఫరెన్సు నిర్వహించాడు. ఆ సందర్భంగా కరోనా కిట్ల అవినీతి విషయంలో వెనక్కు తగ్గద్దని నడ్డా రాష్ట్ర అధ్యక్షుడికి భరోసా ఇచ్చినట్లు ఆంధ్రజ్యోతి మొదటిపేజీలో తాటికాయలంత అక్షరాలతో రాసుకున్నది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ విషయంలో కూడా వెనక్కు తగ్గదని కూడా నడ్డా చెప్పినట్లు అచ్చేసింది. మరి కన్నాకు నడ్డా చెప్పిందే నిజమైతే ఆదివారం కాలంలో అధిష్టానం ఎవరికేమి చెప్పిందో తెలీదు కానీ వివాదం సద్దుమణిగిందని రాధాకృష్ణ ఎలా రాస్తాడు ?
ఈ రోజు రాసిందే నిజమైతే మొన్నటి వీడియా కాన్ఫరెన్సు గురించి రాసింది అబద్ధమని అంగీకరిస్తున్నట్లే కదా ? పైగా బిజెపి అధిష్టానానికి కమలం నేతలకన్నా విజయసాయిరెడ్డే దగ్గరని తేలిపోయిందని కూడా తెగ బాధపడ్డాడు. కేంద్రప్రభుత్వంపై విజయసాయికి పట్టుందన్న విషయాన్ని ఎల్లోమీడియా కూడా అంగీకరించింది. ఒక వేళ అదే నిజమైతే ఇక బిజెపి నేతలు చేసేదేముందని కూడా నీరసంగా ప్రశ్నిచింది. తాజా ఉదాహరణతో బిజెపి-వైసిపి మధ్య గొడవలు ఏమీ లేవని కూడా నిర్ధారణ అయిపోయినట్లు ఎల్లోమీడియా చెప్పింది.
అసలు ఏనాడైనా కేంద్రంతో జగన్ కు వివాదాలున్నాయని ఎవరైనా చెప్పారా ? బిజెపి-వైసిపి మధ్య చెడిందని రాసేదీ ఎల్లోమీడియానే సంబంధాలేమీ చెడలేదు సఖ్యత బాగానే ఉందని చెప్పేదీ ఎల్లోమీడియానే. అంటే ఇక్కడ ఎల్లోమీడియా ఉద్దేశ్యం ఏమిటంటే కేంద్రంతో జగన్ సంబంధాలు అర్జంటుగా చెడిపోవాలి. సంబంధాలు చెడిపోయి గ్యాప్ వస్తే ఆ గ్యాప్ లో బిజెపికి చంద్రబాబు దగ్గరైపోవాలన్నదే ఎల్లోమీడియా ఆలోచనగా అర్ధమైపోతోంది. అది జరిగేదెప్పుడో రాధాకృష్ణ ఆశలు నెరవేరేదెప్పుడో చూద్దాం.