iDreamPost
iDreamPost
గతానికంటే భిన్నంగా ఈ సారి గోదావరికి వరద లొస్తున్నాయి. భద్రాచలం వద్ద ఉదయం 44 అడుగులకు ఉన్న నీటిమట్టం సుమారు 24 గంటల వ్యవధిలోనే శుక్రవారం నాటికి దాదాపు 20 అడుగుల వరకు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే విషయం ఆందోళన పెంచుతోంది. గురువారం రాత్రి 11 గంటలకు 52.10 అడుగులకు చేరుకుంది. దిగువకు 14 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇది 60 అడుగులకు చేరి, 20 లక్షల క్యూసెక్కుల వరకు నీరు దిగువకు వెళుతుందని అంచనాలు వేస్తున్నారు.
పేరూరు నుంచి 15 లక్షల క్యూసెక్కుల, తాలిపేరు నుంచి 2 లక్షలు, ములుగు, భూపాలపల్లి, భద్రాది జిల్లాల్లోని కేచ్మెంట్ ఏరియాలనుంచి మరో 2 లక్షలకు పైగా నీరు నదిలోకి వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో భద్రాచలం వద్ద 60 అడుగులకంటే ఎక్కువ నీటి మట్టం నమోదవుతుందని చెబుతున్నారు. భద్రాచలం వద్ద 60 కి చేరితే కొన్ని గంటల వ్యవధిలోనే ధవళేశ్వరం బారెజి వద్దకు ఈ వరద వచ్చి చేరుతుంది.
ఎగువనుంచి వచ్చిపడే వరదకు తోడు ఇక్కడ కూడా భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి మరింత జఠిలంగా మారుతుందంటున్నారు. దీంతో మరోసారి ఉభయ గోదావరి జిల్లాలకు భయాందోళనలు తప్పడంలేదు. ఎగువనుంచి వరద రాక నేపద్యంలో యంత్రాగం అప్రమత్తమైంది.