UK ప్రధాని రేసులో దూసుకుపోతున్న భారత సంతతికి చెందిన రిషి సునాక్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి ఆయన కట్టిస్తున్న స్విమ్మింగ్ పూల్ ప్రజాగ్రహానికి కారణమైంది. 4 లక్షల పౌండ్లు అంటే అక్షరాలా 3 కోట్ల 80 లక్షలు ఖర్చు పెట్టి మరీ రిషి తన భవ్యమైన భవంతిలో పూల్ నిర్మాణం చేపట్టారు. దీనికి సంబంధించిన ఏరియల్ షాట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంగ్లాండులోని చాలా ప్రాంతాలు కరవు, నీటి కొరత బారిన పడుతుంటే రిషి ఇంత ఖర్చు పెట్టి స్విమ్మింగ్ పూల్ ఎలా కట్టిస్తారంటూ నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. వ్యయం తట్టుకోలేక టౌన్ లోని చాలా పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్ మూతపడుతుంటే రిషి మాత్రం తన కోసం ఇంత గొప్ప పూల్ ఏర్పాటు చేసుకుంటున్నారని జనం మండిపడుతున్నారు. ఒక యూజర్ అయితే మరో అడుగు ముందుకేసి ‘ఇండియాలో అయితే మీ మామగారి సపోర్టు ఉండేదేమో కానీ ఇక్కడ అలా కాదు, బ్రిటిష్ ప్రజలు మీ నిజ స్వరూపమేంటో తెలుసుకుంటున్నారు’ అంటూ కామెంట్ చేశాడు. నార్త్ అల్లర్టన్ దగ్గర నిర్మాణంలో ఉన్న ఈ భవంతిలో ఇంకా జిమ్, టెన్నిస్ కోర్టు పనులు కూడా శరవేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
ఇంతకుముందు భార్య అక్షతా మూర్తి వల్ల రిషి సునాక్ చిక్కుల్లో పడ్డారు. పన్ను కట్టడంలో అవకతవకలు, అమెరికన్ పర్మనెంట్ రెసిడెంట్ కార్డు కలిగి ఉన్నారన్న కారణాలతో అక్షత విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే టీ కప్పు వివాదం వీటిని మించిపోయింది. ఇంగ్లండులో జరిగిన ఒక ముఖ్యమైన రాజకీయ పరిణామానికి సంబంధించి రిషి సునాక్ అభిప్రాయం రికార్డు చేసుకోవడానికి వచ్చిన జర్నలిస్టులకు అక్షత ఖరీదైన కప్పుల్లో టీ సర్వ్ చేశారు. తనే స్వయంగా దగ్గరుండి మరీ టీ ఇవ్వడం చూసి అందరూ ముగ్ధులయ్యారు. కానీ కాసేపటికే కొందరి దృష్టి బ్రాండెడ్ టీ కప్పులపై పడింది. ఆ బ్రాండ్ కి చెందిన ఒక్కో టీ కప్పు ఖరీదు 38 పౌండ్లు అంటే 3 వేల 600 రూపాయలన్నమాట! అంతే నెటిజెన్లు యూ-టర్న్ తీసుకుని అక్షతను దుమ్మెత్తిపోశారు. ఒక కప్పు కొనడానికి పెట్టే డబ్బులతో ఒక కుటుంబం రెండు రోజుల పాటు బతికేస్తుందని తీవ్ర విమర్శలు చేశారు.