Idream media
Idream media
విపక్షాలను కలిపిన ఈసీ తొలగింపు వ్యవహారం
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రమేష్ కుమార్ పదవీ
కాలానికి ముప్పు తెచ్చేలా ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీసుకువచ్చిన ఆర్డినెన్స్ విపక్షాలకు మింగుడు పడలేదు. అసలు ఎన్నికల అధికారిని తొలగించడం రాష్ట్ర పరిధిలో లేదు..కేంద్రం జోక్యం చేసుకుంటే తప్ప అవ్వదు అని దిలాసాగా ఉన్న టీడీపీ, దాని మిత్రపక్షాలు జగన్ కొట్టిన దెబ్బతో బిత్తరపోయాయి. అసలు ఏమి జరుగుతుందో తెరుకునేలోపు కొత్త వెన్నికల అధికారిగా జస్టిస్ కనగరాజు వచ్చి ఛార్జ్ కూడా తీసుకున్నారు…ఇదంతా చంద్రబాబుకు కలలో జరిగిపోయినట్లు అనిపిస్తోంది ..కానీ దీనిమీద ఏమి చేయగలిగేది లేదు.
ఈ హఠాత్పరిణామంతో నిరుత్తరులైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లెఫ్ట్ నాయకుడు రామకృష్ణ,ఇంకా రాష్ట్రంలో ఉందో లేదో తెలియని కాంగ్రెస్, అదే స్థాయిలో ఉన్న బీజేపీలు ఇప్పుడు ఒక్కటయ్యాయి.
ముందుగా చంద్రబాబు నేరుగా గవర్నర్ కు లేఖరాశారు. అలా ఆర్డినెన్స్ తేవడం తప్పని, అంతగా అవసరం అనుకుంటే నిమ్మగడ్డ పదవీకాలం అయ్యాక కొత్త ఎన్నికల అధికారి నియామకం సమయంలో కొత్త అర్హతలు నిర్ణయించవచ్చని, ప్రస్తుతానికి ఆయన్నే కొనసాగించాలని కోరుతూ లెటర్ రాసారు. దాన్ని గవర్నర్ విశ్వహుషన్ హారిచందన్ ఎలాగూ చెత్తబుట్టలో వేస్తారు అది వేరేవిషయం.
ఇక ఈ కరోనా దెబ్బకు ఎక్కడున్నాడో ఏమైపోయాడో ఏ ఊళ్ళో లాక్ డవున్ అయ్యాడో తెలియని పవన్ కళ్యాణ్ కూడా రమేష్ కుమార్ ను వెనకేసుకువచ్చారు. అది పద్ధతి కాదని, అప్రజాస్వామ్యమని అన్నారు. బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎలాగూ చంద్రబాబు మనిషే కాబట్టి ఇదంతా కక్షపూరితం జగన్ కక్ష సాధిస్తున్నాడు. ఇలాంటి రాజకీయాలు ఏనాడూ చూళ్ళేదు అనేశాడు. లెఫ్ట్ నేత రామకృష్ణ కూడా బాబు కొలీగ్ అమరావతి పోరాటంలో కలసి పాల్గొన్నారు. కలిసి భిక్షాటన చేశారు కాబట్టి ఇక రామకృష్ణ కూడా జగన్ మోహన్ రెడ్డి మీద ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నోళ్లను అలా తొలగించారదని, ఇదంతా అరాచకత్వమని ఏదేదో అన్నారు.
ఇక లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ కూడా రాజ్యాంగం , సెక్షన్లు అంటూ పెద్ద వ్యాఖ్యానమే చేస్తూ మొత్తానికి ఏపీ ప్రభుత్వం తప్పు చేసింది, నిమ్మగడ్డను టార్గెట్ చేసింది అన్నట్లుగానే మాట్లాడారు.. ఆయన అలాగే మాట్లాడతారన్నది అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ప్రభుత్వం ఎన్నికల అధికారి నియామకానికి సంబంధించి కొత్త నిబంధనలు, అర్హతలు పేర్కొంటూ ఉత్తర్వులిచ్చింది. ఆ కొత్త అర్హతలు రమేష్ కుమార్ కు లేవు కాబట్టి ఆయన పదవిని కోల్పోయాడు తప్ప ఆయన్ను ఎవరూ తొలగించలేదు అని వైసిపివాళ్ళు అంటున్నారు.
మొత్తానికి ఒకే దెబ్బతో విపక్షాలు మొత్తాన్ని వారాంపాటు లెవకుండా దెబ్బకొట్టిన జగన్ అదే సమయంలో వారందరినీ ఏకం చేసినట్లు అయింది. అందరూ ఏకమైనా ఈ ప్రక్రియ అయితే పూర్తయింది కాబట్టి ఇక దానిమీద పోరాడే పరిస్థితి రమేష్ కుమార్ కు ఉండకపోవచ్చు అంటున్నారు.