Idream media
Idream media
కొద్ది రోజులుగా ప్రతిపక్షాలకు చెందిన ఎందరో నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వంపై ఆరోపణల వర్షం కురిపిస్తున్నారు. కరోనాకు భయపడి ఫామ్ హౌస్ కు పారిపోతున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ కనిపించకుండా పోయారంటూ కూడా ఆరోపణలు కురిపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్కడ? ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నిస్తూ హైకోర్టులో సైతం పిటిషన్ దాఖలు చేశారు. 15 రోజులు ఫాం హౌస్ లో ఉండి పది రోజుల క్రితం ప్రగతిభవన్ కు చేరుకున్న కేసీఆర్ తనపై ఆరోపణలు చేసే వారికి గట్టిగా సమాధానం చెబుతారని అంతా భావించారు. కానీ.. ఆ విషయంలో మౌనంగా ఉంటూ.. మరోవైపు సమీక్షలతో బిజీగా గడుపుతున్నారు. ముందుగా పాలనకు సంబంధించిన వ్యవహారాలను పూర్తి స్థాయిలో చక్కదిద్దిన తర్వాతే ప్రతిపక్షాల పని బడతారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల కురిసిన వర్షానికి ఉస్మానియా ముంపునకు గురైన సందర్భంలో కూడా ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. వాటికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెక్ పెడుతూ ఘాటుగా స్పందించినా.. కేసీఆర్ రంగంలోకి దిగితే పరిస్థితి వేరేలా ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సచివాలయం విషయంలోనూ…
సచివాలయం కూల్చివేత పనులు.. నూతన సచివాలయం నిర్మాణంలోనూ ప్రతిపక్షాలు అడ్డు తగులుతూనే ఉన్నాయి. కోర్టులో పిటిషన్ లు వేసి పనులను అడ్డుకునే ప్రయత్నం చేశాయి. కొద్ది రోజులు పనులు ఆగిపోయాయి కూడా. చివరకు సుప్రీం కోర్టు, హై కోర్టు కూడా ప్రభుత్వ వాదనలనే సమర్థించాయి. కూల్చివేత పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. కోర్టు తీర్పులే ప్రతిపక్షాలకు చెంప పెట్టు అని మంత్రులు ప్రకటించారు. కానీ.. కేసీఆర్ మాత్రం కోర్టు పిటిషన్లు.. అనుకూలంగా వచ్చిన తీర్పులపై ఇప్పటి వరకూ స్పందించలేదు. కానీ..
గవర్నర్ తో భేటీ అనంతరం…
వారం రోజులుగా వరుస సమీక్షలతో బిజీగా ఉన్న కేసీఆర్ ఈ రోజు ఉదయం కూడా ప్రగతి భవన్ లో ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్షలు జరిపారు. నూతన సచివాలయం భవన నిర్మాణం, డిజైన్ల పరిశీలన, రూపురేఖల విషయంలో సెక్రటేరియట్ బాహ్యరూపం ఎలాఉండాలి? లోపల సౌకర్యాలు ఎలా ఉండాలి? అనే విషయాలపై ఆరా తీశారు. అనంతరం మధ్యాహ్నం నేరుగా గవర్నర్ తమిళి సై ని కలిశారు. కరోనా విషయంలో ఇటీవల గవర్నర్ చేసిన వ్యాఖ్యలు, ఇదే క్రమంలో కేసీఆర్ గవర్నర్ ను కలవడానికి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గవర్నర్ ను కలిసిన కేసీఆర్ పెద్దల సభకు ఎమ్మెల్సీల ఎంపిక, సచివాలయం నిర్మాణం, కరోనా కట్టడిలో ప్రభుత్వ పాత్ర, గవర్నర్ సహకారం తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. సుమారు గంట పాటు తమిళి సైతో కేసీఆర్ చర్చించారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని వివరించారు. బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తోందని తెలిపారు.
తర్వాత.. రెఢీ..?
ప్రస్తుతం కరోనా నివారణ చర్యలు, కరోనాతో సహజీవనం చేస్తూనే పాలనలో పురోగతి సాధించడం ఎలా.. దానిపైనే దృష్టి పెట్టిన కేసీఆర్ త్వరలో మీడియా సమావేశం పెట్టేందుకు కూడా రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సెక్రటేరియట్ కూల్చివేతలకు అడ్డంకులు తొలగడం, గవర్నర్ తో చర్చల అనంతరం ఇక రాజకీయ వ్యూహానికి పదును పెడుతున్నారని తెలుస్తోంది. అయితే మంగళవారం సచివాలయం భవన నిర్మాణంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సెక్రటేరియట్ తెలంగాణ ప్రతిష్ఠ, వైభవానికి ప్రతీకగా ఉండాలని భావించిన సీఎం కేసీఆర్ ఇందుకు సంబంధించిన డిజైన్లను ఇప్పటికే పరిశీలించారు. మంగళవారం వీటిపై మరోమారు సమీక్షించనున్నారు. తర్వాత మంత్రివర్గంలో చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటారు. టెండర్లు పిలిచి కొత్త భవన సముదాయ నిర్మాణం ప్రారంభిస్తారు. దానిపై సమీక్ష అనంతరం కేసీఆర్ మీడియా సమావేశం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే.. ప్రభుత్వం, తనపై వచ్చిన అన్నిఆరోపణలపైనా కేసీఆర్ ఘాటుగానే స్పందిస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.