Idream media
Idream media
రేషన్ డోర్ డెలివరీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 9,260 వాహనాలను రాయితీపై పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లబ్ధిదారులకు ఈ వాహనాలను 60 శాతం రాయితీపై అందించనున్నారు. ఇందుకు అర్హులు గ్రామ, వార్డు సచివాలయంలోని సంక్షేమ, విద్య సహాయకుడికి దరఖాస్తులు అందజేయాలి. గత ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి రాయితీలో ఎలాంటి వాహనాలను పొందలేదనే ప్రమాణ పత్రాన్ని దరఖాస్తుదారులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నెల 27వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు.
9,260 వాహనాలలో 2,300 ఎస్సీలకు, 556 ముస్లింలకు, 104 క్రిస్టియన్లకు కేటాయించాలని నిర్ణయించారు. మిగిలిన వాహనాలను బీసీ, ఓసీలకు ఇవ్వనున్నారు. ఈ వాహనాలను ఆయా కులాల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల ద్వారా రాయితీపై ఇవ్వనుంది. 51,81,190 రూపాయల విలువ గల ఈ వాహనాన్ని 60 శాతం రాయతీ, పది శాతం లబ్ధిదారుడు వాటా, మిగతా 30 శాతం బ్యాంకు రుణం ద్వారా అందిస్తారు. 7వ తరగతి చదవి, 21–45 ఏళ్ల మధ్య ఉన్న వారు ఇందుకు అర్హులు.
లబ్ధిదారుల ఎంపిక కోసం మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారిగా నోటిఫికేషన్లు జారీ చేశారు. 27వ తేదీ తర్వాత అర్హతలను పరిశీలించి దరఖాస్తుదారులకు డిసెంబర్ 4వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 50 శాతం మార్కుల ప్రాతిపదికన ఇంటర్వ్యూలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎంపికైన లబ్ధిదారులు జాబితాను డిసెంబర్ 5వ తేదీన ప్రకటిస్తారు. జనవరి నెల నుంచి రేషన్ డోర్ డెలివరీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తారు. ఏప్రిల్ నెల నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఈ కార్యక్రమం పైలెట్ ప్రాజెక్టుగా అమలవుతోంది.