iDreamPost
iDreamPost
బాలీవుడ్ లోనూ జెండా పాతాలని హీరోలకే కాదు హీరోయిన్లకూ ఉంటుంది. అందుకే అక్కడ అవకాశాలు వచ్చినప్పుడు ఎగ్జైట్ మెంట్ ఫీలవ్వడం సహజం. కాకపోతే మాట్లాడే విషయంలో ఆచితూచి ఉండకపోతే ట్రోలింగ్ కు గురవ్వాల్సి ఉంటుంది. రష్మిక మందన్నకు ఇది ప్రత్యక్షంగా అనుభవమవుతోంది. ఆ మధ్య తనకు తొలి అవకాశాలు ఇచ్చిన శాండల్ వుడ్ గురించి ఏదో మాట్లాడబోయి ఏదో అనేయడంతో కన్నడ పరిశ్రమ బ్యాన్ చేస్తుందనే దాకా వార్తలు వచ్చాయి. నిషేధం నిజం కాకపోయినా రక్షిత్ శెట్టితో బ్రేకప్ మొదలు తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వరకు కన్నడిగులు ఇప్పటికే తన మీద గుర్రుగా ఉన్నారు. తాజాగా మరొకటి వచ్చింది
రష్మిక మందన్న హిందీలో చేసిన మొదటి చిత్రం మిషన్ మజ్ను త్వరలో రిలీజ్ కానుంది. ఇది ఆలస్యం కావడం వల్లే రెండో సినిమా గుడ్ బై ముందు విడుదలయ్యింది. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ఈ స్పై డ్రామా షూటింగ్ ఎప్పుడో పూర్తయినా ఎందుకో వాయిదా పడుతూ వచ్చింది. దీని ప్రమోషన్ లో రష్మిక చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. సౌత్ సినిమాల్లో ఎక్కువగా ఐటెం నెంబర్స్, మసాలాలు ఉంటాయని అందుకే మొదటిసారి రొమాంటిక్ సాంగ్ చేస్తున్నందుకు చాలా ఉద్వేగంగా ఉందని ఏదేదో చెప్పుకొచ్చింది. అంతే దక్షిణాది పరిశ్రమను చులకన చేసినట్టు భావించిన మూవీ లవర్స్ వెంటనే తన మీద భగ్గుమంటున్నారు
నిజానికి సరైన అవగాహన లేకుండా మాట్లాడ్డం వల్లే ఈ చిక్కంతా. రొమాంటిక్ సాంగ్స్ హిందీలోనే కాదు తెలుగు తమిళం కన్నడలో దశాబ్దాలుగా వస్తున్నాయి వస్తాయి కూడా. చలోలో చూసి చూడంగానే, గీత గోవిందంలో ఇంకేం ఇంకేం కావాలే ఫాస్ట్ బీట్స్ కాదుగా. ఇళయరాజాతో మొదలుకుని తమన్ దాకా బ్యూటిఫుల్ మెలోడీస్ వందలు వేలు కంపోజ్ చేశారు. ఆ మాటకొస్తే మణిరత్నంతో మొదలుపెట్టి సందీప్ రెడ్డి వంగా దాకా అందరూ రొమాన్స్ ని అద్భుతంగా చూపించినవాళ్ళే. అదంతా మరిచిపోయి అసలు హిట్ సాంగ్స్ ఊసే లేని బాలీవుడ్ పాటల గురించి ఈ రేంజ్ లో పొగడ్తలు గుప్పించడం ఎంత ప్రమోషన్ కోసమే అయినా కాస్త చూసుకోవాలిగా