iDreamPost
android-app
ios-app

శాసనసభ చరిత్రలో ఈ అన్నదమ్ములు గెలుపు ఓ రికార్డు

  • Published Jun 12, 2020 | 5:46 PM Updated Updated Jun 12, 2020 | 5:46 PM
శాసనసభ చరిత్రలో ఈ అన్నదమ్ములు గెలుపు  ఓ రికార్డు

సమైక్య రాష్ట్రంగా ఉన్నపుడు ఎన్నో ఎన్నికలు జరిగాయి. విడిపోయిన తర్వాత కూడా రెండు ఎన్నికలు జరిగాయి. అయితే ఎప్పుడూ జరగని రికార్డు ఒకటి 2019లో నమోదయ్యింది. అదేమిటంటే సొంత అన్నదమ్ములు ముగ్గురు ఒకేసారి మూడు నియోజకవర్గాల నుండి ఎంఎల్ఏలుగా ఎన్నికవ్వటం. అదికూడా రెండు జిల్లాల నుండి అందులోను ఒకేపార్టీ నుండి ఎన్నికవ్వటం రికార్డనే చెప్పాలి. ఒకే కుటుంబం నుండి ఎంఎల్ఏలైన తండ్రి కొడుకులున్నారు. భార్యా, భర్తలున్నారు. ఇద్దరు అన్నదమ్ములు కూడా ఉన్నారు. కానీ ముగ్గురు అన్నదమ్ములు ఒక సభలో ఎంఎల్ఏలుగా ప్రాతినిధ్యం వహించటం మాత్రం రికార్డనే చెప్పాలి.

ఆ రికార్డు సృష్టించిన ఘనత కర్నూలు, అనంతపురం జిల్లాల నుండి గెలిచిన వై. బాల నాగిరెడ్డి, వై. సాయి ప్రసాద్ రెడ్డి,
వై. వెంకటరామిరెడ్డికే దక్కుతుంది. ముందుగా బాల నాగిరెడ్డి కర్నూలు జిల్లాలోని మంత్రాలయం నియోజకవర్గం నుండి వరుసగా మూడు ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాడు. ఈయన 2009లో తెలుగుదేశంపార్టీ తరపున మొదటిసారి గెలిచాడు. తర్వాత 2014, 2019లో వైసిపి తరపున గెలిచాడు. అంటే పార్టీ మారిన గెలుపుఖాయమైందంటే పార్టీతో సంబంధం లేకుండా నియోజకవర్గంలోను, క్యాడర్ మీద పట్టున్న విషయం అర్ధమైపోతోంది.

అలాగే వై. సాయిప్రతాప్ రెడ్డి విషయం చూస్తే ఈయన కూడా కర్నూలు జిల్లాలోని ఆదోని నియోజకవర్గం నుండి మూడుసార్లు గెలిచాడు కానీ వరసగా మాత్రం కాదు. 2004 కాంగ్రెస్ తరపున గెలిచాడు. 2009లో టిడిపి అభ్యర్ధి చేతిలో ఓడిపోయాడు. అదికూడా 258 ఓట్లతేడాతో ఓడిపోయాడు. వైసిపి ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ కు రాజీనామా చేసి జగన్ తో కలిశాడు. 2014, 2019 ఎన్నికల్లో ఘన విజయాలు సాధించాడు. ఇక మూడో సోదరుడు వై. వెంకటరామిరెడ్డి మాత్రం కర్నూలు జిల్లా నుండి కాకుండా అనంతపురం జిల్లా నుండి గెలిచాడు. జిల్లాలోని గుంతకల్ నియోజకవర్గంలో నుండి మొదటిసారి 2019లో గెలిచాడు. 2014లోనే పోటి చేసినా టిడిపి అభ్యర్ధి జితేందర్ గౌడ్ చేతిలో ఓడిపోయాడు.

అసలు సోదరులది ఒరిజినల్ గా అయితే అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గం. ఇక్కడి నుండి 1983లో తెలుగుదేశంపార్టీ తరపున పోటిచేసి గెలిచిన భీంరెడ్డి కొడుకులే ఈ సోదరులు . వీళ్ళ అన్న శివరామిరెడ్డి 1999లో కాంగ్రెస్ తరపున ఉరవకొండ నుంచి గెలిచాడు ,తర్వాత అంటే 2006లో కాంగ్రెస్ నుండి ఎంఎల్సీ కూడా అయ్యాడు. ఆయన ప్రస్తుతం వైసీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు. అంటే వీళ్ళది మొదటి నుండి రాజకీయ నేపధ్యమున్న కుటుంబమని అర్ధమైపోతోంది.