iDreamPost
android-app
ios-app

మంత్రి పదవిపై మనసు పారేసుకున్న అబ్బాయి!

  • Published Jan 12, 2022 | 10:00 AM Updated Updated Jan 12, 2022 | 10:00 AM
మంత్రి పదవిపై మనసు పారేసుకున్న అబ్బాయి!

ఆలూ లేదు చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది టీడీపీలో ఒక నాయకుడి తీరు. ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలో లేదు. వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తుందన్న గ్యారెంటీ అంతకన్నా లేదు. అయినా సరే 2024లో ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి అయిపోవాలని ఆయన కలలు కంటున్నారు. రెండుసార్లు ఎంపీగా గెలిచిన శ్రీకాకుళం టీడీపీ నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆ పదవిలో పెద్ద కిక్ లేదని నిట్టూరుస్తున్నారు. మంత్రి హోదాపై మనసు పారేసుకున్నారు. ఆ విషయంలో తన బాబాయ్ అచ్చెన్నాయుడు పోటీకి వస్తారన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా తన పాట్లు తాను పడుతున్నారు. సొంత నియోజకవర్గం టెక్కలిలో అచ్చెన్న పోటీ చేయడం ఖాయం కనుక.. దాని పక్కనే ఉన్న నరసన్నపేట నియోజకవర్గంపై కన్నేశారు. 

బాబాయ్ నీడ నుంచి బయటపడాలని..

శ్రీకాకుళం జిల్లా టీడీపీలో కింజరాపు కుటుంబానిది ప్రత్యేక స్థానం. పార్టీతో పాటే ఎదిగిన దివంగత ఎర్రన్నాయుడు ఉన్నంతకాలం పార్టీకి పెద్ద దిక్కుగా నిలిచారు. ఆయన తదనంతరం తనయుడు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా 2014లో తొలిసారి ఎన్నికయ్యారు. 2019లో అతి కష్టం మీద రెండోసారి గెలిచారు. మరోవైపు ఎర్రన్నాయుడు సోదరుడు అచ్చెన్నాయుడు మొదట హరిశ్చంద్రపురం.. తర్వాత టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రాగలిగితే అచ్చెన్న ఖచ్చితంగా మంత్రి పదవి రేసులో ఉంటారు.

ఈ విషయం అబ్బాయి రామ్మోహన్ కు కూడా తెలుసు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరిని మంత్రులను చేయడం కుదరని పని అని కూడా తెలుసు. కానీ రామ్మోహన్ మంత్రి అవ్వాలనే ఫిక్స్ అయిపోయినట్లుంది. వచ్చే ఎన్నికల్లో నరసన్నపేట నుంచి పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే కొన్నాళ్లుగా వీలు దొరికినప్పుడల్లా నరసన్నపేటలో వాలిపోతూ హడావుడి చేస్తున్నారు. అచ్చెన్నాయుడు జిల్లాకు దూరంగా ఉంటుండటం కూడా ఆయనకు కలిసి వస్తోంది. కానీ పదవి విషయానికి వస్తే అబ్బాయి కోసం బాబాయి త్యాగానికి సిద్ధపడతారా? లేక పరస్పరం పోటీ పడతారా? అన్న ప్రశ్న టీడీపీ కార్యకర్తలను వేధిస్తోంది.

నరసన్నపేటలో అంత ఈజీ కాదు

టెక్కలిలో తన బాబాయ్ అచ్చెన్న పోటీ చేస్తారు కనుక.. పొరుగు నియోజకవర్గమైన నరసన్నపేటలో పోటీకి రామ్మోహన్ సిద్ధపడుతున్నారు. తన సామాజికవర్గం, బంధువర్గం పెద్ద సంఖ్యలో ఉండటమే దీనికి కారణం. అయితే నరసన్నపేటలో నెగ్గుకురావడం అంత సులభం కాదు. ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో బగ్గు రమణమూర్తిపై ఆయన విజయం సాధించారు. రామ్మోహన్ సామాజికవర్గానికే చెందిన ధర్మాన కుటుంబానికి నియోజకవర్గంపై పూర్తి పట్టుంది. పైగా అది వారి సొంత నియోజకవర్గం. టీడీపీకి అక్కడ పెద్దగా పట్టులేదు. గత కొంతకాలంగా ఎన్నికల్లో ఓడిపోతోంది. అక్కడ ప్రస్తుతం బగ్గు రమణమూర్తి టీడీపీ ఇంఛార్జిగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నరసన్నపేటలో రామ్మోహన్ పోటీకి చంద్రబాబు అవకాశం ఇస్తారా? ఒకవేళ ఇస్తే శ్రీకాకుళం ఎంపీ సీటుకు తగిన అభ్యర్థిని వెతుక్కోవడం ఆ పార్టీకి కష్టమవుతుంది.

Also Read : టీడీపీ, జనసేన పొత్తుపై బాబు, పవన్ ది ఒకేమాట. మరోసారి స్పష్టమయిన స్నేహబంధం