iDreamPost
android-app
ios-app

దళిత హక్కుల గొంతు రామ్ విలాస్ పాశ్వాన్

  • Published Oct 09, 2020 | 2:38 PM Updated Updated Oct 09, 2020 | 2:38 PM
దళిత హక్కుల గొంతు రామ్ విలాస్ పాశ్వాన్

1980 దశకంలో భారత దేశంలో వినిపించిన దళిత హక్కుల గొంతు రామ్ విలాస్ పాశ్వాన్ అని చెప్పొచ్చు. ఒకవైపు రాజ్యాధికారం లక్ష్యంగా బహుజన్ సమాజ్ పార్టీ స్థాపించి ఉత్తర్ ప్రదేశ్ లో అధికారం దిశగా కాన్షిరాం అడుగులు వేస్తున్న సమయంలోనే అధికారమే లక్ష్యంగా రాజకీయ పావులు కదిపిన నేత పాశ్వాన్. ఆయన కేంద్రంలో మంత్రిగా నాటి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నుండి నేటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వరకూ అందరు ప్రధానమంత్రులతో కలిసి పనిచేశారు. ఈ విషయంలో పాశ్వాన్ తో చాలామంది విభేదిస్తారు. ఇంకొంతమంది విమర్శిస్తారు. అయితే తన విమర్శకులకు పాశ్వాన్ చెప్పింది ఒక్కటే – అధికారమే లక్ష్యం అయినప్పుడు నేను అధికారంలోనే ఉంటా అని నిర్ద్వందంగా చెప్పారు. 

1969లో కళాశాల విద్య పూర్తికాగానే పోలీసు శాఖలో డిఎస్పీ ఉద్యోగంలో చేరిన పాశ్వాన్ కొన్ని నెలలకే ఉద్యోగానికి రాజీనామా చేసి ఉమ్మడి సోషలిస్టు పార్టీ తరపున రాజకీయాల్లోకి వచ్చారు. మొదట 1969లో బీహార్ శాసనసభకు ఎన్నికైన పాశ్వాన్ ఆ తర్వాత 1974లో రాజ్ నారాయణ్ మరియు జయప్రకాష్ నారాయణ్ పిలుపుమేరకు లోక్ దళ్ లో చేరారు. ఆ తర్వాత 1977లో జనతా పార్టీలో చేరి మొదటిసారిగా లోక్ సభకు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికతోనే 4.24 లక్షల ఓట్ల ఆధిక్యతతో ప్రపంచంలోనే అత్యంత ఆధిక్యతతో గెలిచిన ప్రజాప్రతినిధిగా గిన్నీస్ రికార్డు సాధించారు. 

పార్లమెంటుకు ఎన్నిక పాశ్వాన్ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పింది. జాతీయ స్థాయిలో, ప్రత్యేకించి పార్లమెంటులో దళితుల హక్కులపై ఆయన గొంతు ప్రతిధ్వనించడం మొదలయింది. జనతా పార్టీ ప్రభుత్వం అతికొద్ది సమయంలోనే కూలిపోయినప్పటికీ ఆ తర్వాత నుండి జాతీయ రాజకీయాల్లో పాశ్వాన్ స్వరం పెంచారు. దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడుల పట్ల పాశ్వాన్ అనేక సందర్భాల్లో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంటు వేదికగా దళిత హక్కులకోసం ఉద్యమాలు మొదలుపెట్టారు. ఈ ఉద్యమాల ఫలితమే 1989 ఎస్సి, ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం వచ్చింది. ఈ చట్టంకు అప్పట్లో దేశంలోని అనేక రాష్ట్రాల్లో పాశ్వాన్ ఉద్యమాలు నిర్వహించారు. సరిగ్గా అదే దశకంలో ఆంధ్ర ప్రదేశ్ లో  కారంచేడు మారణహోమం పట్ల పాశ్వాన్ పార్లమెంటులో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత 1991లో ఆంధ్ర ప్రదేశ్ లోని చుండూరు మారణకాండ పట్ల కూడా ఆయన తీవ్రంగా స్పందించి, చుండూరు దళిత ఉద్యమానికి జాతీయ స్థాయిలో అండగా ఉన్నారు. భారత దేశంలో ఇప్పటికి 1989 చట్టం ఉన్న కారణంగానే కాస్తో, కూస్తో దళితులపై దాడులు తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ చట్టం దుర్వినియోగం అయ్యిందనే ఆరోపణలు ఉన్నప్పటికీ, ఈ చట్టం నిర్లక్ష్యానికి గురయిన సందర్భాలే ఎక్కువ.  

చుండూరు ఉద్యమం తర్వాతనే ఆయన జాతీయ స్థాయిలో దళిత సేన స్థాపించి దేశవ్యాప్తంగా విస్తరించారు. దళిత సేన అనేక రాష్ట్రాల్లో దళిత సమస్యలపై 1990 దశకంలో విస్తృతంగా ఉద్యమాలు నిర్వహించింది. అయితే 1990 దశకం చివర్లో దళిత సేన పేరు ఎస్సి సేన గా మార్చి దాని బాధ్యతలు తన సోదరుడికి అప్పగించడంతో ఆంధ్ర ప్రదేశ్ తో సహా అనేక ఇతర రాష్ట్రాల్లో దళిత సేన నిర్వీర్యం అయింది.  అయితే 2000 దశకం నుండి పాశ్వాన్ దళిత ఉద్యమాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. ఆరోగ్యకారణాలు కావచ్చు, మరొకటి కావచ్చు 2000 దశకం తర్వాత దళిత సమస్యలపై పాశ్వాన్ గట్టిగా మాట్లాడిన సందర్భాలు తక్కువే. 

2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన పాశ్వాన్ ఆ తర్వాత 2014లో బీజేపీ నేతృత్వంలో నరేంద్ర మోడీ  నాయకత్వంలో ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వంలో కూడా మంత్రిగా చేరి చనిపోయే రోజువరకూ కేంద్రమంత్రిగానే కొనసాగారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో శాసనసభకు ఒక సారి (1974), రాజ్యసభకు (2019) ఒక సారి ఎన్నికయిన పాశ్వాన్ 1984లో ఒక సారి, 2009 మరోసారి లోక్ సభ ఎన్నికల్లో ఓటమి చూశారు. బీహార్ రాష్ట్రంలోని హాజీపూర్ లోక్ సభా స్థానంతో పాటు రోసెరా మరియు సమస్తిపూర్ లోక్ సభా స్థానాలు పాశ్వాన్ కుటుంబానికి పెట్టని కోటలుగా నిలిచాయి.