iDreamPost
android-app
ios-app

2022 రివ్యూ 10 – స్టార్ హీరోల ప్రోగ్రెస్ రిపోర్ట్

  • Published Dec 28, 2022 | 8:05 PM Updated Updated Dec 28, 2022 | 8:05 PM
2022 రివ్యూ 10 – స్టార్ హీరోల ప్రోగ్రెస్ రిపోర్ట్

ఇంకో మూడు రోజుల్లో సెలవు తీసుకోబోతున్న 2022లో స్టార్ హీరోల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం. మహేష్ బాబు సర్కారు వారి పాటతో భారీ అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయినా కమర్షియల్ కోణంలో నష్టాలు రాకుండా బయ్యర్లను సేఫ్ చేయగలిగాడు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఆశించిన అద్భుతాలు చేయలేకపోయినా రీమేక్ తో తొంభై కోట్ల దాకా వసూళ్లు రాబట్టడం కొంత ఊరట కలిగించింది. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లకు ఆర్ఆర్ఆర్ చిరస్మరణీయమైన గొప్ప విజయాన్ని అందించడమే కాక దేశవిదేశాలు దాటేలా అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చింది. ఆస్కార్ కనక ఏదో ఒక రూపంలో ట్రిపులార్ కి వస్తే అదింక లైఫ్ టైం మెమరీనే అవుతుంది

ప్రభాస్ కు రాధే శ్యామ్ చేదు జ్ఞాపకమే ఇచ్చింది. విపరీతమైన హైప్ మధ్య అన్ని భాషల్లోనూ నిరాశకలిగించే ఫలితం తెచ్చింది. పుష్ప 2 స్క్రిప్ట్ లో జరిగిన ఆలస్యం వల్ల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శనం ఈ సంవత్సరం మొత్తం లేకుండా పోయింది. చిరంజీవికి ఆచార్య మరిచిపోలేని పీడకలగా నిలిస్తే గాడ్ ఫాదర్ మంచి రిపోర్ట్స్ మధ్య సైతం పెద్ద రేంజ్ కు వెళ్లలేకపోయింది. బ్యాడ్ మూవీ స్టాంప్ పడకపోవడం నయం. గత ఏడాది చివర్లో అఖండతో అదిరిపోయే హిట్ అందుకున్న బాలకృష్ణను థియేటర్లో చూసే ఛాన్స్ ఫ్యాన్స్ కు దక్కలేదు. అన్ స్టాపబుల్ టాక్ షోతో సర్దుకున్నారు. నాగార్జునకు ది ఘోస్ట్, బిగ్ బాస్ 6 దెబ్బేయగా బంగార్రాజు రిలీఫ్ ఇచ్చింది

వెంకటేష్ కు ఎఫ్3 రూపంలో మరో మంచి సక్సెస్ దక్కింది. ఓరి దేవుడాలో చేసిన స్పెషల్ క్యామియో రిలీజ్ కు ముందు క్రేజ్ అయితే తెచ్చింది కానీ దాని యావరేజ్ కంటెంట్ బాక్సాఫీస్ వద్ద అద్భుత ఫలితాలు ఇవ్వలేదు. రవితేజకు ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీలు షాట్ ఇస్తే చివరిలో ధమాకా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునేలా చేసింది. కారణం ఏమైనా రొటీన్ కంటెంట్ తో హిట్టు కొట్టడం విశేషం. నానికి అంటే సుందరానికి అచ్చిరాలేదు.వరుణ్ తేజ్ కు గని, విజయ్ దేవరకొండకు లైగర్ పెద్ద ఝలక్ లు. నిఖిల్ కు కార్తికేయ్ 2 మొదటి వంద కోట్ల సినిమాగా నిలిస్తే 18 పేజెస్ పర్లేదనిపించుకుంది. సుధీర్ బాబు, అల్లు శిరీష్ లు ఫ్లాపులు రుచి చూడాల్సి వచ్చింది