iDreamPost
android-app
ios-app

దేశం కోసం కన్న కల.. తూటాకి బలి..

  • Published Jun 17, 2022 | 8:30 PM Updated Updated Jun 17, 2022 | 8:30 PM
దేశం కోసం కన్న కల.. తూటాకి బలి..

ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనుకున్నాడు ఓ నిరుపేద యువకుడు. ఆర్మీ అతని క‌ల‌. కానీ ఇవాళ ఆ ఆర్మీ కోసం చేసిన పోరాటంలో కల చెదిరి తూటాకి బలయ్యాడు ఆ యువకుడు. అగ్నిపథ్ కి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలల్ని అదుపు చేయడానికి పోలీసులు చేసిన కాల్పుల్లో రాకేష్ అనే ఓ యువకుడి ప్రాణం పోయింది.

కేంద్రప్ర‌భుత్వం తీసుకొచ్చిన అగ్నిప‌థ్ స్కీం గురించి సరిగా తెలుసుకోకుండా, అది తన ఆర్మీ క‌ల‌ల‌కు స‌మాధి క‌డుతుంద‌ని అందరిలాగే ఆందోళ‌న చెందాడు. కేంద్ర‌ప్ర‌భుత్వం తీసుకొచ్చిన అగ్నిప‌థ్ స్కీంకు వ్య‌తిరేక ఉద్య‌మంలో భాగ‌స్వామి కావాల‌ని వరంగల్ నుంచి రెండు రోజుల క్రితమే హైద‌రాబాద్ వ‌చ్చాడు.

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ఖానాపురం మండ‌లం ద‌బీర్‌పేట‌కు చెందిన రాకేష్‌ ఆర్మీలో చేరాలనుకున్నాడు. రాకేష్ సోద‌రి రాణి ఐదేళ్ల క్రితం BSFలో చేరింది. ప్ర‌స్తుతం ఆమె ప‌శ్చిమ‌బెంగాల్‌లో ప‌ని చేస్తోంది. మ‌రొక అక్క వివాహం చేసుకొని వెళ్ళింది. రాకేష్ అన్న విక‌లాంగుడు. త‌ల్లిదండ్రులు నిరుపేద‌లు. రాకేష్ ఎలాగైనా ఆర్మీకి ఎంపిక కావాలని కళలు కన్నాడు. రాకేష్ కి ఆర్మీ ఉద్యోగం వస్తే త‌మ‌కు ఆర్థిక ఇబ్బందులు త‌ప్పుతాయ‌ని అతని త‌ల్లిదండ్రులు కూడా భావించారు. రెండేళ్ల క్రితం ఆర్మీ ఎంపిక కోసం రాకేష్ వెళ్లి అన్ని ర‌కాల ఫిజిక‌ల్ ప‌రీక్ష‌ల్లో పాస్ అయ్యాడు. ఇక ఎగ్జామ్ రాయాల్సి వుంది. అయితే కేంద్ర ప్ర‌భుత్వం కరోనా వల్ల ఆ పరీక్షలని వాయిదా వేస్తూ వచ్చింది.

తాజాగా ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్ తనకి, తన లాంటి వాళ్ళకి ఎక్కడ ఎసరు పెడుతుందో అన్న భయంతో అగ్నిపథ్ కి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొన్నాడు. రెండురోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన రాకేష్ ఇవాళ ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నాడు. పోలీసులు ఆందోళనకారులని అదుపు చేయడానికి జరిపిన కాల్పుల్లో తూటా తగిలి రాకేష్ మరణించాడు.

దీంతో చేతికొచ్చిన కుమారుడు కుటుంబానికి అండగా ఉంటాడ‌ని భావించిన త‌ల్లిదండ్రులు తమ కొడుకు ఇలా మరణించాడు అని తెలిసే సరికి తట్టుకోలేకపోతున్నారు. ఒక్క తూటాతో తమ కొడుకుని తమకి దూరం చేశారని, ఎన్నో కలల్ని నాశనం చేశారని, ఆశయాల్ని సమాధి చేశారని భోరుమని విలపించారు. ఇప్పుడు మాకు దిక్కెవరంటూ ఆ కుటుంబం కన్నీరు కారుస్తుంది. ఆర్మీకి ఎంపికై, దేశ సేవ‌కు జీవితాన్ని అంకితం చేయాల‌నే ఆశ‌యం నెర‌వేర‌కుండానే త‌నువు చాలించాడ‌ని అతని త‌ల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు చెప్తున్నారు.