iDreamPost
iDreamPost
భారీ అంచనాలతో వచ్చిన సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నట్టు, జనసేన పార్టి కూడా 2019 ఎన్నికలని ప్రభావితం చేయగల పార్టీగా ప్రచారం కల్పించుకుని భారీ ఓటమితో చతికిలపడింది. దీంతో ఆ పార్టీ భవిష్యత్తు మీద నీలి నీడలు అలముకున్నాయి. అసలు పార్టీ మనుగడ సాధ్యమా అనే మాటలు అక్కడక్కడ వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో పవన్ కల్యాణ్ అభిమానుల్లో పార్టీ మనుగడపై ఒకింత గుబులు రేగినా, వారికి ఉన్న ధైర్యం పవన్ కి అండగా ఉన్న అతని మిత్రుడు రాజు రవితేజ. పవన్ కల్యాణ్ కి మిత్రుడిగా , జనసేన పార్టీకి రాజ్యంగం, సిద్దాంతం తయారు చేసి ఇజం అనే పుస్తకాన్ని రాసిన ఫిలాసఫర్ గా, జనసేన పార్టీ ఆవిర్భావంలో ముఖ్య భూమిక పోషించిన పార్టీ వ్యవస్తాపకుడిగా అందరికి సుపరిచితం అయిన రాజు రవితేజ తమ పార్టీని ఒడ్డున పడేస్తాడనే నమ్మకంతో ఉన్న జన సైనికులకి భారీ షాక్ ఇస్తూ జనసేన పార్టీకి, రాజు రవితేజ రాజీనామా చేశారు.
2015 మార్చ్ 14న హైద్రబాద్ హైటెక్స్ లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో సుదీర్ఘంగా ప్రసంగించిన పవన్ , మధ్యలో రాజు రవితేజ పేరును ఉటంకిస్తూ, తనే పార్టీ పెట్టమని ప్రోత్సహించినట్టు, తన రాజకీయ అరంగేట్రంకి వెనకనుండి ఎంతో సహాయం చేసినట్టు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ కి ఇంత దగ్గర వ్యక్తి అయిన రాజు రవితేజ జనసేనకు రాజీనామా చేస్తూ పవన్ కళ్యాణ్ విధానాలని తీవ్ర స్థాయిలో తూర్పారబట్టారు. దీంతో పవన్ రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు అలముకున్నాయి.
ఎవరీ రాజు రవితేజ ?
శిక్షకుడు, తత్వవేత్త, రచయిత, సలహాదారుడు , వ్యక్తిత్వ వికాస నిపుణుడు అయిన రాజు రవితేజ వరంగల్ జనగాంలో జన్మించాడు. పేదరికం ఒక పక్క వెక్కిరిస్తున్నా, చిన్నపటినుండే ఎంతో కృషి పట్టుదల కలిగిన రవితేజ తన 16వ ఏటనే ఒక ఫంక్షన్ హాలులో వెయిటర్ గా తన జీవితాన్ని ప్రారంభించాడు. ఒక వైపు చదువుకుంటూనే ఆఫీస్ బాయ్ గా , కంప్యుటర్ ప్రోగ్రామర్ గా, సేల్స్ మెన్ గా బ్రతుకుదెరువు కోసం ఎన్నో పనుల్లో కుదిరాడు. 1994లో యురిక్సో అనే కన్సెల్టెన్సి కంపెనీ స్థాపించి తనలోని శక్తి సామర్ద్యలకు పదును పెట్టుకుంటూ ఎంతోమందికి మార్గదర్శకుడిగా మారాడు. ఎన్నో అంశాలపై పూర్తి పట్టుతో అనర్గలంగా మాట్లాడగలిగే రవితేజ కొన్ని వందల సంస్థలకు వ్యక్తిగత శిక్షకుడిగా వ్యవహరిస్తున్నారు.
న్యూ డిల్లీలో బ్రిటీష్ హై కమీషన్, సత్యం కంప్యూటర్స్, నోకియా సంస్థలు రవితజ సేవలను ఉపయోగించుకున్నాయి. 2002లో ఇన్స్పైర్ ఇండీయా అనే సామాజిక స్వచ్చంద సంస్థని స్థాపించి యువతని ప్రభావితం చేస్తూవచ్చారు. ఆలోచన, పరిశీలన, అనుభవం మూల సూత్రాలుగా తన ఫిలాసఫీని రూపొందించుకున రాజు రవితేజకు సమాజం, రాజకీయాలు, యువ చైతన్యం లాంటి అంశాలపై నిర్దిష్ట సూత్రాలు ఉన్నాయి. ఈ ఆలోచనా ధోరణి ఉన్న రవితేజకు 2007-08 మధ్యలో పవన్ కళ్యాణ్ దగ్గర అయ్యాడు. ఆ సమయలో రాజు రవితేజ పవన్ కళ్యాణ్ కి తెలంగాణ ఉద్యమం, దాని నేపథ్యం గురించి వివరిస్తూ ఉండేవాడని, ఈ విషయమై వారి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగేవని, పవన్ కళ్యాణ్ తెలంగాణ సాయుధ పోరాటం గురించి, ఇంకా అనేక అంశాలు రాజు రవితేజ దగ్గరనుండే తెలుసుకున్నాడనే వాదనా ఉంది.
సమాజం లో మార్పు రావాలి అంటే ప్రశ్నించే పార్టీ ఒకటి ఉండాలనే ఆలోచనతో ఉన్న రవితేజకు పవన్ తోడై జనసేన పార్టీని నిర్మించారు. కాని నేడు ఇదే రవితేజ పార్టీ నుండి వెళ్ళిపోతు పార్టీ మొదటి రెండు సిద్దాంతాలైన కులాలు కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయానికి, భిన్నంగా , పవన్ కళ్యాణ్ కుల మత ప్రస్తావన తో రాజకియం చేస్తూ ఒక విభజన శక్తిగా మారాడని ఇది చాల ప్రమాదకరమైన ధోరణని చెప్పి పార్టీకి రాజీనామా చేశారు. విజ్ఞాన భాండాగారం పవన్ కళ్యాణ్ కి దగ్గర అయిన వ్యక్తి నోటి నుండే ఇలా పవన్ వ్యక్తిత్వంపై తీవ్ర విమర్శలు రావటం రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీసింది..