iDreamPost
android-app
ios-app

రామ్‌దేవ్‌ బాబాకు భారీ షాక్‌.. పోలీసుల ముందు హాజరు కావాలంటూ ఆదేశాలు

  • Published Sep 14, 2023 | 6:49 PM Updated Updated Sep 14, 2023 | 6:49 PM
  • Published Sep 14, 2023 | 6:49 PMUpdated Sep 14, 2023 | 6:49 PM
రామ్‌దేవ్‌ బాబాకు భారీ షాక్‌.. పోలీసుల ముందు హాజరు కావాలంటూ ఆదేశాలు

యోగా గురు బాబా రాందేవ్‌కు కోర్టు భారీ షాకిచ్చింది. విద్వేషపూరిత ప్రసంగాల కేసుకు సంబంధించి బాబా రాందేవ్‌కు రాజస్థాన్ హైకోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్‌ 5న ఆయన పోలీసులు ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 2న రాజస్థాన్‌లోని బార్మర్‌లో జరిగిన మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న బాబా రాందేవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్నారనీ, హిందూ మహిళలను అపహరించుకుపోతున్నారని ఆరోపిస్తూ ఆయన ప్రసంగించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైర‌ల్‌ అయ్యింది. దాంతో బాబా రాందేవ్‌పై పథాయ్ ఖాన్ అనే వ్యక్తి ఫిబ్రవరి 5న బార్మర్‌లోని చోహ్తాన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ రాందేవ్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు.

మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ బాబా రాందేవ్‌ మీద నమోదైన ఎఫ్ఐఆర్‌కు సంబంధించి ఆయనను అక్టోబర్ 5న బార్మర్‌లోని ఛోహ్తాన్ పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని రాజస్థాన్ హైకోర్టు ఆదేశించింది. అంతేకాక రాందేవ్‌ అరెస్ట్‌ మీద ఇచ్చిన స్టేను అక్టోబర్‌ 16 వరకు పొడిగించింది. కేసు డైరీని అక్టోబర్ 16న కోర్టులో సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించిన హైకోర్టు అప్పటి వరకు బాబా రాందేవ్‌ అరెస్టుపై స్టేను పొడిగించింది.

ఎఫ్ఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ బాబా రాందేవ్ దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ కుల్దీప్ మాథుర్ ఈ ఆదేశాలు జారీ చేశారు.అయితే అంతకుముందు జరిగిన విచారణలో, హైకోర్టు రాందేవ్ అరెస్టుపై స్టే విధించింది. మే 20 లేదా అంతకంటే ముందు విచారణ కోసం దర్యాప్తు అధికారి (ఐఓ) ముందు హాజరు కావాలని ఆదేశించింది. కానీ రాందేవ్ ఈ ఆదేశాలను పాటించడంలో విఫలమయ్యారు.