పొలిటికల్ స్ర్కీన్ మీద ఆ ఇద్దరూ ఒక్కటవుతారా?

  • Published - 02:37 AM, Thu - 17 December 20
పొలిటికల్ స్ర్కీన్ మీద ఆ ఇద్దరూ ఒక్కటవుతారా?

తమిళనాట కొత్త రాజకీయాల గాలివీస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఆరంగేట్రం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. విశేష ప్రేక్షకాధరణ గల నటుడిగా రజనీకాంత్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి నటుడు ఇప్పుడు రాజకీయ రంగప్రవేశం చేస్తుండడంతో అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. నెలాఖరులో పార్టీ వివరాలు వెల్లడించనున్న సూపర్ స్టార్ జనవరిలో పార్టీని ప్రారంభించనున్నారు. ఇప్పటికే పార్టీ జెండా, ఎన్నికల గుర్తు విషయంలో క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రజనీతో కలిసి పనిచేయడానికి పలు పార్టీలు సానుకులతను కనబరుస్తున్నాయి. అందులో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ పార్టీ కూడా ఉండడం గమనార్హం.

తమిళ రాజకీయాలను సినీరంగంతో వేరుచేసి చూడడం కష్టం. అన్నాదురై నుంచి రజనీకాంత్ వరకు ఎందరో సినీతారలు పొలిటికల్ స్ర్కీన్ మీద తమను తాము పరీక్షించుకున్నవారే. కొందరు జయకేతనం ఎగరేశారు. ఇంకొందరు రాజకీయ యవనికపై రాణించలేకపోయారు. ఇప్పుడు రజనీకాంత్, కమల్ హాసన్ ల వంతు. సుదీర్ఘకాలంగా రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై చర్చలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు ఆ దిశలో అడుగు ముందుకేసిన సూపర్ స్టార్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా నిరూపించుకోవాలనుకుంటున్నాడు. కాగా…. రజనీ పార్టీ ఇంకా ఉనికిలోకి రాకముందే ఆయనకు దగ్గరయ్యేందు పలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

ఇప్పటికే రజనీకాంత్ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమంటూ అన్నాడీఎంకే నేతలు ప్రకటించారు. తాజాగా కమల్ హాసన్ సైతం అలాంటి ప్రకటనే చేశారు.

మక్కల్ నీథి మయ్యం పార్టీని స్థాపించిన కమల్ హాసన్ ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇప్పటికే అధికార అన్నాడీఎంకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించింది. అటు డీఎంకే కాంగ్రెస్ తో కలిసి పోటీచేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో రాజనీకాంత్ పెట్టబోయే పార్టీ ఎలాంటి ఎటువైపు నిలబడుతుందనే చర్చమొదలైంది. కాగా… ఎంఎన్ఎం అధినేత కమల్ హాసన్ రాష్ట్రంలో థర్డ్ ఫ్రంట్ కి అవకాశం ఉందంటూ చేసిన ప్రకటన ఆసక్తినిరేకెత్తిస్తోంది. రజినీకాంత్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి తనకు ఎలాంటి భేషజాలు లేవని, భావ సారూప్యం ఉంటే పొత్తు ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటుందని స్పష్టం చేశారు కమల్ హాసన్. రజనీకాంత్ పార్టీ ప్రకటించిన తరువాతే ఈ విషయాలపై చర్చించడం సరైందన్నారు.

కమల్ హాసన్ చేసిన థర్డ్ ఫ్రంట్ ప్రకటన తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరతీయనుందా అనే చర్చమొదలైంది. ఇప్పటికే కమల్ హాసన్ వచ్చే ఎన్నికల్లో ఎంఐఎంతో కలిసి పోటీ చేసే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రజనీకాంత్ పెట్టబోయే పార్టీ వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచీ పోటీ చేస్తుందని ఆయన సలహాదారు తమిళరువి మణియన్ ఇప్పటికే ప్రకటించారు. కానీ… రజనీకాంత్ నుంచి ఇప్పటి వరకూ పొత్తుల విషయంలో ఎలాంటి స్పందనా రాలేదు. అయితే… తాను పెట్టబోయే పార్టీ ఆధ్యాత్మిక రాజకీయాలను అనుసరిస్తుందని ఇప్పటికే రజనీకాంత్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సైద్ధాంతికంగా రజనీపార్టీ బీజేపీ భావజాలానికి దగ్గరగా ఉంటుందనే చర్చకూడా జరుగుతోంది. రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ మొత్తంగా బీజేపీకి బలం చేకూర్చుతుందని అభిప్రాయపడేవారూ ఉన్నారు. మతపరమైన రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని కమల్ హాసన్ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ ఇద్దరు స్టార్ల కలయిక ఆచరణ సాధ్యమయ్యే విషయంగా కనిపించడం లేదు. మొత్తానికి తమిళ రాజకీయాల్లోకి చేరుతున్న కొత్త ప్రవాహం ఎక్కడి చేరుతుందో తేలాలంటే ఇంకొద్ది కాలం వేచిచూడాల్సిందే.

Show comments