Idream media
Idream media
రాష్ట్రంలో కొవిడ్ చాయలు పెద్దగా లేవు.. ఆంక్షలను తొలగిస్తున్నాం.. అని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డా.గడల శ్రీనివాసరావు చెప్పి రెండునెలలు కూడా కాలేదు. ఆయనే ఇప్పుడు కరోనా ఇంకా అంతం కాలేదు.. మాస్కులు ధరించి అప్రమత్తంగా ఉండాల్సిందే అని చెప్పారు. మరో మూడునెలల పాటు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.
ఈ ఏడాది డిసెంబరు నాటికి కొవిడ్ పూర్తిగా ‘ఫ్లూ’లాగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా రాబోయే 4-6 వారాల తర్వాత కరోనా కేసులు పెరిగే అవకాశముందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. చైనా, తైవాన్, ఈజిప్టులో కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. మన దేశంలోని ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌తో పాటు మన పొరుగు రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయని గడల శ్రీనివాసరావు తెలిపారు. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 4 శాతానికి చేరిందని చెప్పారు. గత ఆరు వారాలుగా రాష్ట్రంలో కొవిడ్ అదుపులో ఉందన్నారు. మూడో వేవ్ నుంచి మనం ఇప్పుడిపుడే కోలుకుంటున్నామని, రాష్ట్రంలో నాలుగో వేవ్ రాకపోవచ్చని చెప్పారు. సీఎం కేసీఆర్ కరోనా వ్యాప్తిపై ఎప్పటికప్పుడు వివరాలు తీసుకుంటున్నారని వెల్లడించారు.
జూన్ వరకు పెళ్లిళ్లు, వేసవిలో ప్రజలు చేసే విహారయాత్రలు ఎక్కువగా ఉంటాయని, ప్రభుత్వం ప్రకటించే జాగ్రత్తలను ప్రజలందరూ పాటించాలని సూచించారు. ముఖ్యంగా అందరూ మాస్కులు ధరించాలన్నారు. రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని, 12-17 ఏళ్ల వయసు వారు రెండో డోసు కూడా తీసుకోవాలని సూచించారు. రెండో డోసు తీసుకుని, 9 నెలలు పూర్తయిన వారందరూ మూడో డోసు తీసుకోవాలని వివరించారు. 60 ఏళ్లు పైబడినవారూ బూస్టర్ డోసును తీసుకోవాలన్నారు. వీరికి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బూస్టర్ డోసు వేస్తున్నామని తెలిపారు. ఎక్స్‌ఈ వేరియంట్ ఎక్కువ ప్రభావం చూపకపోవచ్చని ఆయన వెల్లడించారు. కరోనా నుంచి పూర్తిగా బయట పడాలంటే ప్రజలందరూ వ్యాక్సిన్లు వేసుకోవాలని సూచించారు.