తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్‌డేట్‌!

గత కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అడపాదడపా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. వర్షాలతో పాటు ఎండలు కూడా దంచి కొడుతున్నాయి. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. అప్పటి వరకు ఎండకాసి ఆ వెంటనే వర్షాలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో అసలు వర్షాలే లేవు. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ వర్షాలపై కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

తెలంగాణలోని ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, మహబూబాబాద్‌, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో చెదురుమొదురు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రేపటినుంచి ఓ మూడు రోజుల పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని ప్రకటించింది. 28 తర్వాతి నుంచి కొన్ని రోజులు విరామం ఉంటుందని, తర్వాత సెప్టెంబర్‌ 3నుంచి మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే.. నెల్లూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరుతో పాటు తిరుపతి జిల్లాల్లో చెదురుమొదురునుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో.. మంగళవారం, బుధవారం చెదురుమొదురు నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. నేడు కూడా ఈ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి, మరికొన్ని రోజుల పాటు కొనసాగనున్న వర్షాలపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Show comments