Idream media
Idream media
పూలమ్మో పూలు. మల్లెపూలు, జాజిపూలు, సన్నజాజి, కాకడాలు, చామంతి, రోజా, గులాబీ, మందారం….రాత్రిపూలు…రండమ్మా రండి…సరికొత్త పూలు. రాత్రిపూలు…మీరెప్పుడూ వినలేదా, చూడలేదా? ఆ రాత్రిపూల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే పదండి ఒక్కసారి వెనక్కి. పోదాం పదండి కడప జిల్లా ప్రొద్దుటూరుకు…
కడప జిల్లా ప్రొద్దుటూరుకు రెండో ముంబయ్‌గా పేరు. బంగారం వ్యాపారానికి ప్రసిద్ధి. అంతే కాదండోయ్ సాహిత్య సువాసన ఎప్పటికీ వెదజల్లుతూ ఉంటుంది. సాహిత్య, సాంస్కృతిక కేంద్రంగా ప్రొద్దుటూరు అనేక సాహితీ సాంస్కృతిక కార్యకలాపాలకు నిలయమైంది.
కడప నుంచి 1990 దశకంలో శశిశ్రీ సంపాదకత్వంలో సాహిత్యనేత్రం అనే సాహిత్య పత్రిక వచ్చేది. కడప జిల్లాకు చెందిన సొదుం జయరాం, దాదాహయత్, సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి, పాలగిరి విశ్వప్రసాద్‌లు కథారచయితలు. ఒక్కొక్కరు ఐదేసి చొప్పున రాసిన 20 కథలను రాతిపూలు పేరుతో శశిశ్రీ సంపాదకత్వంలో సంకలనం తీసుకొచ్చారు. 1996లో ఈ సంకలనం వెలువడింది.
పుస్తకావిష్కరణలో భాగంగా ప్రొద్దుటూరు రోటరీక్లబ్‌లో కూడా మిత్రజ్యోతి సాహితీసాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో సభను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ప్రధాన బాధ్యుడు బాష. ఇతను గాంధీరోడ్డులో కళ్లద్దాల దుకాణం నడుపుతూ, సాహిత్యంపై మక్కువ పెంచుకున్నాడు. మనిషి అనే పదానికి నిలువెత్తు నిదర్శనం బాషన్న అంటే అతిశయోక్తి కాదు. పోయినోళ్లంతా మంచోళ్లే అని పెద్దలు అన్నారని నేను ఆ విధంగా చెప్పడం లేదు.
అసలు విషయానికి వద్దాం. ఆదివారం పుస్తకావిష్కరణ సభ. సాహిత్యమంటే అభిరుచి ఉన్న వారందరికీ సమాచారం ఇచ్చాం. సహజంగా సాహిత్య సభలంటే వచ్చేవారి సంఖ్య చాలా పరిమితంగా ఉంటుంది. ఈ సభకు కూడా అలాగే వస్తారనుకున్నాం. కానీ మేమెవరమూ ఊహించని విధంగా రోటరీక్లబ్ అంతా జనంతో నిండిపోయింది. ముఖ్యంగా వచ్చిన వారిలో విద్యార్థులే అధికం. మా బాషన్న ఆనందానికి అవధుల్లేవు.
” రమణా స్టూడెంట్స్‌లో ఇంత మార్పు ఎప్పుడొచ్చిందిబ్బీ” అని మురిసిపోతూ నన్ను పదేపదే అడిగేవాడు. అంత మంది సాహిత్య సభకు రావడం నా జీవితంలో మొదటిసారి చూడటం అదే. ఏమోలే ఆదివారం కదా, టైం పాస్ కోసమైనా వచ్చింటారని అనుకున్నాను.
పిల్లలంతా గుంపులుగుంపులుగా ఏర్పడి ఏదో సీరియస్‌గా చర్చించుకుంటున్నారు. ఎవరి కోసమో వెతుకుతున్నట్టు గాల్లోకి చూస్తున్నారు. వారిని గమనిస్తున్నానని గ్రహించి ఒకతను నా దగ్గరికి వచ్చాడు. “అన్నా ఈ సభ నిర్వాహకులు ఎవరు” అని అడిగాడు. “ఏం” అని ప్రశ్నించాను. “ఏమీలేదులే వారితో మాట్లాడాలి” అని అన్నాడు.
సభా వేదిక దగ్గర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న బాషన్నను చూపాను. “థ్యాంక్స్ అన్నా” అని చెప్పి, బాషన్న దగ్గరికి ఇద్దరుముగ్గురు స్టూడెంట్ కలసి వెళ్లారు. బాషన్నను పిలుచుకుని క్లబ్ ఆవరణలోని ఓపెన్ ప్లేస్‌కు వెళ్లారు. వారి వైపే నేను తధేకంగా చూస్తుండిపోయాను.
ఏం మాట్లాడుతున్నారో తెలియదు. కానీ బాషన్న మాత్రం నవ్వుతూ కనిపించాడు. ఏదో పేపర్ కూడా బాషన్నకు చూపిస్తున్నారు. బాషన్న ఆసక్తిగా పేపర్‌లో తల పెట్టి చిక్కగా నవ్వుతున్నాడు. ఎందుకో బాషన్నను చూస్తూ నేను కూడా నవ్వుకున్నాను. తర్వాత ఏమైందో కానీ, వారు అటు నుంచే కిందికి దిగిపోగా, మరికొందరు స్నేహితుల దగ్గరికి వెళ్లి ఏదో గుసగుసలాడారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా సమావేశం నుంచి వెళ్లిపోవడం ప్రారంభించారు.
బాషన్న పడిపడి నవ్వుతున్నాడు. నన్ను పిలవడానికి కూడా నోరు రానంతగా ఉందా నవ్వు. సైగలతో నన్ను పిలిచాడు. బాషన్న దగ్గరికి వెళ్లాను. నా భుజాలపై చేతులు వేసి మరింతగా నవ్వుతూ ఏదో చెప్పాలనుకుంటున్నాడే కానీ…నవ్వు ఆపుకోలేక చెప్పలేకపోయాడు.
“అన్నా పూర్తిగా నవ్వి అయినా చెప్పు, లేదంటే చెప్పిన తర్వాతైనా నవ్వు” అన్నానవ్వుతూ.
“బ్బీ ఇందాకటి నుంచి సాహిత్యసభకు ఇంత మంది రావడం ఏందబ్బా అనుకుంటిమి కదా?” అని ప్రశ్నించాడు. అవునన్నట్టు తలూపాను. “ఏంలేదబ్బీ ఆ పిల్లోల్లు నన్ను పక్కకు పిలిచింది ఎందుకనుకుంటున్నావ్ ” అని మళ్లీ పెద్దగా నవ్వడం ప్రారంభించాడు.
“ఏందన్నా” అంటూ బాషన్ననవ్వుతో శృతి కలిపాను.
“ఏంలేదు రమణా వారికి రాత్రిపూలు కావాలంట” అని అన్నాడు.
“నాకేమీ అర్థం కాక రాత్రిపూలు ఏందన్నా” అని అమాయకంగా అడిగాను.
“అక్కడే ఉంది అసలు కిటుకు. ఓ పేపర్‌లో నేడు “రాతిపూలు” ఆవిష్కరణకు బదులుగా “రాత్రిపూలు” ఆవిష్కరణ అని వచ్చింది. ఆ వార్తను ఇందాక నాకు చూపి…రాత్రిపూలకు బదులు పుస్తకాలు అమ్ముతున్నారేందని నిలదీశారని” అసలు రహస్యాన్ని చెప్పేసరికి, నేను కూడా నవ్వు ఆపుకోలేక పోయాను.
అదండీ రాత్రిపూల కథాకమామీషూ….